State Transport Minister
-
ఆర్టీసీ విభజనపై నేడు ఢిల్లీకి మంత్రి
తాండూరు: ఆర్టీసీ విభజన కోసం ఢిల్లీకి వెళ్లనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి తాండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు చెప్పారు. ఆర్టీసీ విభజనను త్వరితగతిన చేపట్టాలని ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రితో చర్చించనున్నట్టు తెలిపారు. కార్మిక బీమా ఆసుపత్రి(ఈఎస్ఐ) ఏర్పాటుకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కలువనున్నట్టు పేర్కొన్నారు. జేఎన్ఎన్యూఆర్ఓ కింద తెలంగాణకు అదనపు ఏసీ బస్సుల కొనుగోలుకు నిధుల మంజూరు కోసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కోరనున్నట్టు వివరించారు. ఇది వరకు రూ.150కోట్లతో 500 బస్సులు వచ్చాయని, ఇందులో 400 పల్లె వెలుగు బస్సులు కాగా మిగిలిన 100 ఏసీ బస్సులు ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లాకు 30, కరీంనగర్ జిల్లాకు 70, మహబూబ్‌నగర్ జిల్లాకు 30 ఏసీ బస్సులను నడపనున్నట్టు చెప్పారు. తెలంగాణలోని మిగితా ఏడు జిల్లాల్లో కూడా ఏసీ బస్సులు నడపనున్నట్టు, ఈ విషయమై మంత్రి వెంకయ్యనాయుడిని కలువనున్నట్టు మంత్రి చెప్పారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, ముంబయి తదితర ముఖ్య నగరాలకు బస్సులను నడపనున్నట్టు చెప్పారు. వికారాబాద్, తాండూరులలో రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాల కోసం కేంద్ర రైల్వే మంత్రిని కోరనున్నట్టు తెలిపారు. కొత్త ఏడాదిలో ఆర్టీసి కార్మికులకు తెలంగాణ గ్రాంట్ అమల్లోకి వస్తుందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణీకుల భద్రత కోసం క్యాబిన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వానికి నష్టం వస్తున్నా మహిళల భద్రత దృష్ట్యా క్యాబిన్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. సీసీ కెమెరాలను కూడా అమర్చినట్టు తెలిపారు. ఏసీ బస్సుల్లో చార్జీలు తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ తక్కువగానే ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్ పాల్గొన్నారు. రోడ్లకు నిధుల మంజూరు బషీరాబాద్: వికారాబాద్ -తాండూరు నాలుగు లైన్ల రోడ్డుకు రూ. 40 కోట్లు మంజూరయ్యాయని రావాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన రెడ్డిగణపూర్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు ఔటర్ రోడ్డు పనుల కోసం రూ.78 కోట్లు మంజూరయ్యాయయన్నారు. తాండూరు నియోజక వర్గంలో ఆర్అండ్బీ రోడ్డు పనులకోసం రూ.188 కోట్లు మంజూరు కాగా అందులో పంచాయతి రాజ్ శాఖ రోడ్ల కోసం 38 కోట్లు మంజూరయ్యాయన్నారు. బ్రిడ్జి నిర్మాణాల కోసం రూ.39 కోట్లు మంజూరయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2లక్షల 14 వేల మందికి రూ.42 కోట్ల ఆసరా పింఛన్లను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అజయ్‌ప్రసాద్, వెంకట్రాంరెడ్డి శంకర్‌రెడ్డి, సుధకర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులున్నారు. -
86 పశు వైద్యశాలలు మంజూరు
ఘట్కేసర్: జిల్లాకు 86 పశు వైద్యశాలలు మంజూరయ్యాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో గురువారం 3.5 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ప్రతాప్సింగారంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సౌకర్యం లేని 1300 గ్రామాలకు రవాణా వసతి కల్పిస్తామని చెప్పారు. అన్ని గ్రామాలకూ రోడ్లు వేస్తామన్నారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ.. అవసరమైన చోట ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. నీటి ఎద్దడి సమస్యకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గం శివారు ప్రాంతంలో ఉన్నందున 3 డిపోలను ఏర్పాటు చేయాలన్నారు. చెంగిచర్ల డిపో నుంచి రోడ్డు వేయాలని కోరారు. సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు మంద సంజీవరెడ్డి, శామీర్‌పేట్ ఎంపీపీ చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకుడు నక్క ప్రభాకర్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ గొంగళ్ల స్వామి, మండల ఉపాధ్యక్షుడు గ్యార లక్ష్మయ్య, ఎంపీటీసీ సభ్యులు మంకం రవి, కేశవనాథం, రమాదేవి, సర్పంచ్‌లు స్వర్ణలత, నక్క వరలక్ష్మి, మూసీ శంకరన్న, నాయకులు బైరు రాములు, లక్ష్మణ్, నరసింహ, కొంతం వెంకట్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, బొక్క ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాట కుమార్, ధరంకార్ సత్యరాం పాల్గొన్నారు. ఆహ్వానపత్రం అందలేదు.. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమకు ఆహ్వానం అందలేదంటూ ప్రతాప్‌సింగారం సర్పంచ్ బాషగల్ల ఆండాలు, ఎంపీటీసీ సభ్యులు సంజీవ్‌లు సమావేశం నుంచి బయటకు వెళ్లారు. గ్రామానికి ప్రథమ పౌరురాలైన సర్పంచ్‌కు తెలియకుండా అధికారులు ఇలా చేయడం భావ్యం కాదని ఎంపీటీసీ సభ్యుడు సంజీవ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రజక సంఘం ప్రారంభ కార్యక్రమాన్ని సైతం ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు. -
పదవుల పంపకాల్లో సమన్యాయం
తాండూరు: జిల్లాలో నామినేటెడ్ పదవుల పంపకాల్లో సమన్యాయాన్ని పాటిస్తానని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.శనివారం ముస్లింల ఇఫ్తారు విందులో పాల్గొనేందుకు తాండూరుకు విచ్చేసిన మంత్రి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాల్లో అన్ని స్థాయిల్లో పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులను కేటాయించడం జరుగుతుందన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో తన సొంత నియోజవర్గమైన తాండూరుతోపాటు జిల్లాలోని ఏ ఒక్క నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని నియోజవర్గాలకు పదవుల పంపకాల్లో సమన్యాయాన్ని కచ్చితంగా పాటిస్తానని వివరించారు. అయితే పదవుల పంపకాల కేటాయింపునకు ఒకటిరెండు నెలలు పట్టవచ్చని అన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ప్రోత్సాహం జిల్లాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు పెట్టబడుల కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఐటీ మంత్రి తారకరామారావు రిలయన్స్ అధినేత అంబానీ, పెద్ద పెద్ద కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు చర్చలు జరుపుతున్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉన్నందున ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పెద్ద కంపెనీలు సముఖంగానే ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలకు జిల్లాలో అవసరమైన భూముల కేటాయింపుతోపాటు అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఐఏఎస్అధికారిని కూడా నియమించిందని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు 15రోజుల్లో ప్రభుత్వం అన్ని సౌకార్యలు కల్పిస్తామని వివరించారు. పరిశ్రమలు పెద్ధ ఎత్తున రాబోతుండటంతో జిల్లాలోని ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని అన్నారు. వికారాబాద్ తదితర గ్రామీణప్రాంతాల్లో కూడా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. ప్రణాళికబద్ధంగా పల్లెల అభివృద్ధి ‘మన ఊరు-మన ప్రణాళిక’ ద్వారా గ్రామీణ ప్రాంతాలను ఐదేళ్లలో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తాగునీరు, పారిశుధ్యం, డంపింగ్‌యార్డు తదితరాలతోపాటు ప్రజల అవసరాలకనుగుణంగా పల్లెలను అన్ని విధాల అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష ్యమన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాల భూమిని ఇస్తామని తెలిపారు. ప్రభుత్వభూమి లేకపోతే ప్రైవేట్ భూమి కొనుగోలు చేసైనా పంపిణీ చేస్తామన్నారు. దసరా నుంచి నవంబర్ మధ్యలో ఈ ప్రక్రియను మొదలు పెడతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం నెర్చవేర్చుతారన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చడం టీడీపీ,కాంగ్రెస్ హయాంలో హామీలకే పరిమితమైందని, సీఎం దాని నిజం చేయనున్నారని మంత్రి తెలియజేశారు. -
ఆర్టీసీ రూ. 2,600 కోట్ల నష్టంలో ఉంది: సిద్దా
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ రూ.2,600 కోట్ల నష్టంలో ఉందని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సిద్దా రాఘవరావు వెల్లడించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆర్టీసీకి రోజుకు రూ. 2.75 కోట్ల నష్టం వస్తుందని తెలిపారు. నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించడం కోసం 15 శాతం ఛార్జీలు పెంచాలని అధికారులు కొరుతున్నారని చెప్పారు. ఛార్జీల పెంపుపై తాము సుముఖంగా లేమని ఆయన స్సష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో రహదారుల నిర్మాణానికి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి మండలాన్ని జిల్లా కేంద్రానికి అనుసంధానం చేసేందుకు చర్యలు చేపడతామని సిద్దా రాఘవరావు వివరించారు. -
బస్టాండా... బందెల దొడ్డా
ఒంగోలు: ‘ఎక్కడ చూసినా అపరిశుభ్రంగా ఉంది. ఆర్టీసీ బస్టాండు అనుకుంటున్నారా..బందెల దొడ్డనుకుంటున్నారా..’ అని రాష్ట్ర రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావు ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండును సోమవారం మధ్యాహ్నం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండు ఆవరణ అంతా అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహించారు. వేలాది మంది సంచరించే ప్రదేశం ఇంత అపరిశుభ్రంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. ఎక్కడి చెత్త అక్కడే ఉంది..దుమ్ము, ధూళి పేరుకుపోయింది..శుభ్రం చేస్తున్న దాఖలాలే కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అధికారులు పారిశుధ్య కార్మికులను పరుగులెత్తించారు. = మరోవైపు బస్టాండు ఆవరణలో సీలింగ్ మొత్తం వైర్లు వేలాడుతూ చిందరవందరగా ఉండటాన్ని ప్రశ్నించగా..పెయింట్ వర్క్, మరమ్మతులు జరుగుతున్నాయని అధికారులు చెప్పుకొచ్చారు. = కొణిజేడు బస్సులు ఆగే ప్రాంతంలో కనీసం షెల్టర్ లేకపోవడాన్ని గుర్తించి వెంటనే బస్టాండు ఎక్స్టెన్షన్కు ఎంతమేర నిధులు అవసరమవుతాయో అంచనాలు రూపొందించి తనకు పంపాలని ఆదేశించారు. = స్టాల్స్‌లో కూడా పరిశుభ్రత కనిపించడం లేదని శిద్దా అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో క్యాంటిన్‌కు ఇచ్చిన స్థానంలో ప్రస్తుతం వోల్వో కార్నర్ ఏర్పాటు చేస్తున్నామని, మిగతా భాగానికి సంబంధించి ఇటీవలే క్యాంటిన్ నిర్వహణకు టెండర్ ఖరారైంద ని అధికారులు తెలిపారు. త్వరలోనే వారు క్యాంటిన్ ప్రారంభిస్తారన్నారు. బస్టాండుకు పశ్చిమం వైపున టాయిలెట్ల నిర్మాణం పూర్తయిందని అవి కూడా ప్రారంభానికి సిద్ధం చేస్తున్నామన్నారు. = బస్టాండు పల్లంలో ఉండటంతో వర్షాకాలంలో తీవ్ర సమస్యగా ఉందని అధికారులు తెలపగా..సమస్య పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుంది..ఎంత మేర నిధులు అవసరమవుతాయో అంచనాలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. = పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే సహించేది లేదని..కనీసం మంచినీరు కూడా సక్రమంగా, ఉచితంగా అందించలేకపోతే ఎలా అని ఆగ్రహించారు. పది రోజులు వేచి చూస్తానని ఈలోగా బస్టాండు వాతావరణం మొత్తం మారిపోవాలని మంత్రి సూచించారు. ఆయన వెంట ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. మంత్రి శిద్దాను కలిసిన ఒంగోలు డిపో మేనేజర్: రవాణ శాఖా మంత్రి శిద్దా రాఘవరావును సోమవారం ఉదయం ఆయన నివాసగృహంలో ఆర్టీసీ ఒంగోలు డిపో మేనేజర్ మురళీబాబు కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా పలు విషయాల గురించి ప్రశ్నించారు. ఒంగోలు నుంచి ముఖ్య ప్రాంతాలైన చెన్నై, వైజాగ్, తిరుపతికి ఎన్ని బస్సులు నడుపుతున్నారని ప్రశ్నించారు. ఒంగోలు డిపో నుంచి ఆ ప్రాంతాలకు ఎటువంటి బస్సులు నడపడం లేదని, ఇతర డిపోలైన అద్దంకి, పొదిలి, చీరాల తదితర ప్రాంతాల నుంచి నడుపుతున్నట్లు మేనేజర్ చెప్పారు. అది సరికాదని..ఒంగోలు నుంచి ఆ ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వోల్వో బస్సు ఉందా అని ప్రశ్నించగా లేదని..కందుకూరు నుంచి ఉందని మేనేజర్ చెప్పారు. ఇక నుంచి ఆ బస్సును ఒంగోలు నుంచే నడపాలని, ఆదాయంతో ముడిపెట్టి పల్లె వెలుగు బస్సులను నిలిపేయవద్దని మంత్రి ఆదేశించారు. -
రుణమాఫీపై అనుమానాలొద్దు
తాండూరు, న్యూస్‌లైన్ : రుణాల మాఫీ విషయంలో రైతులు అనుమానపడాల్సిన అవసరం లేదని, ఆందోళన చెందరాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆదివారం ఆయన తాండూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్ రూ.లక్ష లోపు రుణాలను కచ్చితంగా మాఫీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. రుణాల మాఫీ విషయంలో ప్రతిపక్షాలు రైతులను అయోమయానికి గురి చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నాయని విమర్శించారు. రుణాల మాఫీ విషయంమై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్లతో ప్రభుత్వం చర్చించిందన్నారు. సీఎం కేసీఆర్ మాట తప్పరని, రైతులకు తప్పకుండా న్యాయం చేస్తారని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా మారుస్తామని, పింఛన్ మొత్తాన్ని రూ.1500కి పెంచుతామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని, ప్రమాదాలకు బాధ్యులైన వారు ఎంత పెద్దవారైనా సరే కఠినచర్యలు తప్పవనీ, అధికారులను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. షాపింగ్ కాంప్లెక్స్‌లు... తెలంగాణలోని పది జిల్లాల్లో ఆర్టీసీ డిపోలు శంకుస్థాపనలు జరిగి కొన్ని, సగంలోనే మరికొన్ని ఆగిపోయాయని మంత్రి చెప్పారు. వీటి నిర్మాణాలు పూర్తిచేస్తే తెలంగాణలో 50 ఆర్టీసీ డిపోలు అందుబాటులోకి వస్తాయన్నారు. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలు తక్కువగా ఉన్నాయని, అయినా బస్సు చార్జీలను పెంచే ఆలోచన లేదని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం కన్నా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఆదాయం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ సంస్థ నష్టాల్లో ఉందన్నారు. ఆదాయ వనరులను పెంపొందించుకోవడానికి పది జిల్లాల్లో ఆర్టీసి బస్టాండ్లు, డిపోల పరిధిలోని ఖాళీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. రహదారులను మెరుగుపరిచి తెలంగాణలోని 1200 గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. మరింత పారదర్శకం... రవాణా శాఖ కార్యక్రమాలన్నీ మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. తాండూరులో ఆర్టీఏ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలల బస్సుల తనిఖీలు, 16వ తేదీ నుంచి పెండింగ్ పైళ్ల క్లియరెన్స్‌తోపాటు ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల 1వతేదీన ఫేస్ టు ఫేస్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మంత్రి వివరించారు. రెండు జిల్లాల్లో తెలంగాణవారికే పోస్టింగ్‌లు రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్రకు చెందిన మూడు వేల మంది ఉపాధ్యాయులు, అలాగే 80శాతం మంది పోలీసు ఉద్యోగాల్లో నియుక్తులైనందున తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే ఈ రెండు జిల్లాలోని సీమాంధ్ర ఉపాధ్యాయులు, పోలీసులను నిబంధనల ప్రకారం వారి ప్రాంతానికి పంపిస్తామని, వారి స్థానంలో తెలంగాణ ప్రాంతం వారికి పోస్టింగ్ ఇస్తామని.. ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవులు మావే.. తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల చైర్పర్సన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తాండూరులో మద్దతు కోసం ఎంఐఎం పార్టీతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఇక్కడ చైర్పర్సన్ పదవి కోసం ఐదుగురు పోటీలో ఉన్నా అందరితో చర్చించి ఏకాభిప్రాయానికి వస్తామన్నారు. ఎన్నికల తేదీ ఖరారు కాగానే చైర్పర్సన్ల ఎంపిక వ్యవహారాన్ని కొలిక్కి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకుడు కరణం పురుషోత్తంరావు పాల్గొన్నారు.