పదవుల పంపకాల్లో సమన్యాయం
తాండూరు: జిల్లాలో నామినేటెడ్ పదవుల పంపకాల్లో సమన్యాయాన్ని పాటిస్తానని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.శనివారం ముస్లింల ఇఫ్తారు విందులో పాల్గొనేందుకు తాండూరుకు విచ్చేసిన మంత్రి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాల్లో అన్ని స్థాయిల్లో పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులను కేటాయించడం జరుగుతుందన్నారు.
నామినేటెడ్ పదవుల విషయంలో తన సొంత నియోజవర్గమైన తాండూరుతోపాటు జిల్లాలోని ఏ ఒక్క నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని నియోజవర్గాలకు పదవుల పంపకాల్లో సమన్యాయాన్ని కచ్చితంగా పాటిస్తానని వివరించారు. అయితే పదవుల పంపకాల కేటాయింపునకు ఒకటిరెండు నెలలు పట్టవచ్చని అన్నారు.
పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ప్రోత్సాహం
జిల్లాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు పెట్టబడుల కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఐటీ మంత్రి తారకరామారావు రిలయన్స్ అధినేత అంబానీ, పెద్ద పెద్ద కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు చర్చలు జరుపుతున్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉన్నందున ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పెద్ద కంపెనీలు సముఖంగానే ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలకు జిల్లాలో అవసరమైన భూముల కేటాయింపుతోపాటు అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఇందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఐఏఎస్‌అధికారిని కూడా నియమించిందని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు 15రోజుల్లో ప్రభుత్వం అన్ని సౌకార్యలు కల్పిస్తామని వివరించారు. పరిశ్రమలు పెద్ధ ఎత్తున రాబోతుండటంతో జిల్లాలోని ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని అన్నారు. వికారాబాద్ తదితర గ్రామీణప్రాంతాల్లో కూడా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు.
ప్రణాళికబద్ధంగా పల్లెల అభివృద్ధి
‘మన ఊరు-మన ప్రణాళిక’ ద్వారా గ్రామీణ ప్రాంతాలను ఐదేళ్లలో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తాగునీరు, పారిశుధ్యం, డంపింగ్‌యార్డు తదితరాలతోపాటు ప్రజల అవసరాలకనుగుణంగా పల్లెలను అన్ని విధాల అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష ్యమన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాల భూమిని ఇస్తామని తెలిపారు. ప్రభుత్వభూమి లేకపోతే ప్రైవేట్ భూమి కొనుగోలు చేసైనా పంపిణీ చేస్తామన్నారు.
దసరా నుంచి నవంబర్ మధ్యలో ఈ ప్రక్రియను మొదలు పెడతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం నెర్చవేర్చుతారన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చడం టీడీపీ,కాంగ్రెస్ హయాంలో హామీలకే పరిమితమైందని, సీఎం దాని నిజం చేయనున్నారని మంత్రి తెలియజేశారు.