ఆర్టీసీ విభజనపై నేడు ఢిల్లీకి మంత్రి | rtc division on delhi went to minister p.mahendar reddy | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ విభజనపై నేడు ఢిల్లీకి మంత్రి

Published Thu, Dec 18 2014 3:35 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

rtc division on delhi went to minister p.mahendar reddy

తాండూరు: ఆర్టీసీ విభజన కోసం ఢిల్లీకి వెళ్లనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి తాండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు  చెప్పారు. ఆర్టీసీ విభజనను త్వరితగతిన చేపట్టాలని ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రితో చర్చించనున్నట్టు తెలిపారు. కార్మిక బీమా ఆసుపత్రి(ఈఎస్‌ఐ) ఏర్పాటుకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కలువనున్నట్టు పేర్కొన్నారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఓ కింద తెలంగాణకు అదనపు ఏసీ బస్సుల కొనుగోలుకు నిధుల మంజూరు కోసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కోరనున్నట్టు  వివరించారు.

ఇది వరకు రూ.150కోట్లతో 500 బస్సులు వచ్చాయని, ఇందులో 400 పల్లె వెలుగు బస్సులు కాగా  మిగిలిన 100 ఏసీ బస్సులు ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లాకు 30, కరీంనగర్ జిల్లాకు 70, మహబూబ్‌నగర్ జిల్లాకు 30 ఏసీ బస్సులను నడపనున్నట్టు చెప్పారు. తెలంగాణలోని మిగితా ఏడు జిల్లాల్లో కూడా ఏసీ బస్సులు నడపనున్నట్టు, ఈ విషయమై మంత్రి వెంకయ్యనాయుడిని కలువనున్నట్టు మంత్రి చెప్పారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు.

హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, ముంబయి తదితర ముఖ్య నగరాలకు బస్సులను నడపనున్నట్టు చెప్పారు. వికారాబాద్, తాండూరులలో రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాల కోసం కేంద్ర రైల్వే మంత్రిని కోరనున్నట్టు తెలిపారు. కొత్త ఏడాదిలో ఆర్టీసి కార్మికులకు తెలంగాణ గ్రాంట్ అమల్లోకి వస్తుందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణీకుల భద్రత కోసం క్యాబిన్‌లను ఏర్పాటు చేశామన్నారు.

ప్రభుత్వానికి నష్టం వస్తున్నా మహిళల భద్రత దృష్ట్యా క్యాబిన్‌లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. సీసీ కెమెరాలను కూడా అమర్చినట్టు తెలిపారు. ఏసీ బస్సుల్లో  చార్జీలు తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ తక్కువగానే ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్ పాల్గొన్నారు.
 
రోడ్లకు నిధుల మంజూరు
బషీరాబాద్:  వికారాబాద్ -తాండూరు నాలుగు లైన్‌ల రోడ్డుకు రూ. 40 కోట్లు మంజూరయ్యాయని రావాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన రెడ్డిగణపూర్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తాండూరు ఔటర్ రోడ్డు పనుల కోసం రూ.78 కోట్లు మంజూరయ్యాయయన్నారు.

తాండూరు నియోజక వర్గంలో ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులకోసం రూ.188 కోట్లు మంజూరు కాగా అందులో పంచాయతి రాజ్ శాఖ రోడ్ల కోసం 38 కోట్లు మంజూరయ్యాయన్నారు. బ్రిడ్జి నిర్మాణాల కోసం రూ.39 కోట్లు మంజూరయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2లక్షల 14 వేల మందికి రూ.42 కోట్ల  ఆసరా పింఛన్‌లను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అజయ్‌ప్రసాద్, వెంకట్రాంరెడ్డి శంకర్‌రెడ్డి, సుధకర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement