RTC division
-
తెలంగాణ ఆర్టీసీ ప్రభావం ఏపీపై ఉండదు: పేర్ని నాని
సాక్షి, అమరావతి : తెలంగాణ ఆర్టీసీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. గురువారం మీడియాతో చిట్‌చాట్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఏపీలో ఆర్టీసీ విలీనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఏపీలో కార్మికుల విలీనానికి ఆర్టీసీ బోర్డు అంగీకరించిందని, బోర్డులో ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా విలీనానికి అంగీకరించారని తెలిపారు. ఆర్టీసీ విభజన జరగలేదని తెలంగాణ హైకోర్టులో కేంద్రం చెప్పిన విషయం ప్రస్తావించగా.. విభజన జరగకపోతే ఏపీ, తెలంగాణలలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు కేంద్రం విడివిడిగా ఎలా నిధులు కేటాయించిందని ప్రశ్నించారు. విభజన అనేది సాంకేతిక అంశమన్న మంత్రి.. త్వరలో ఆ ఇబ్బందులను అధిగమిస్తామని తెలియజేశారు. మరోవైపు మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అంశాన్ని లేవనెత్తగా ‘రాజకీయంగా చివరి దశలో ఉన్న జేసీతో మాకేం పని? ఆయనను వైఎస్సార్సీపీలోకి ఎవరు ఆహ్వానించారు. బస్సుల సీజ్ విషయంలో జేసీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చట్టప్రకారమే వ్యవహరిస్తుంద’ని వ్యాఖ్యానించారు. -
ఆర్టీసీ విభజన చర్చలు విఫలం
-
ఆర్టీసీ విభజన చర్చలు విఫలం
► ఏపీ వైఖరికి నిరసనగా తెలంగాణ వాకౌట్ ► బస్ భవన్ ఒక్కటే పంచాలన్న టీఎస్ఆర్టీసీ ► మొత్తం 14 ఆస్తులు పంచాలన్న ఏపీఎస్ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ విభజనకు మళ్లీ పీటముడి పడింది. హెడ్‌క్వార్టర్ అనే అంశంపై కేంద్రం ఇచ్చిన వివరణ మీద తెలంగాణ, ఏపీలు భిన్నమైన వాదనలు వినిపించడంతో వివాదం మొదటికొచ్చింది. దీంతో ఆర్టీసీ ఆస్తుల పంపిణీ, విభజనపై చర్చించేందుకు శుక్రవారం విజయవాడలో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ఏపీ అనుసరించిన ఏకపక్ష వైఖరికి నిరసనగా తెలంగాణ అధికారులు ఆర్టీసీ బోర్డు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఆర్టీసీ ఎండీ రమణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు పరిపాలన భవనమొక్కటే ఉమ్మడి ఆస్తిగా పరిగణించాలని తెలంగాణ అధికారుల బృందం సమావేశం ఆరంభంలోనే తమ వాదనను వినిపించింది. మొత్తం 14 ఆస్తులను ఉమ్మడి ఆస్తులుగా పరిగణించాలని, విభజన చట్టం ప్రకారం జనాభా దామాషా మేరకు వీటన్నింటినీ పంపిణీ చేయాలని ఏపీ పట్టుబట్టింది. 14 ఆస్తుల్లో 13 తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయని, బస్‌భవన్ ఒక్కటే హెడ్ క్వార్టర్ పరిధిలోకి వస్తుందని టీఎస్ఆర్టీసీ తమ ప్రతిపాదనల నోట్‌ను సమావేశం ముం దుంచింది. దీంతో వాదోపవాదాలతో సయోధ్య కుదరలేదు. మధ్యేమార్గంగా రెండు బోర్డులు ఇచ్చిన నోట్లను, షీలాభిడే కమిటీ చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని, కేంద్రం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుందామని టీఎస్ఆర్టీసీ బోర్డు డైరెక్టర్లు సూచించారు. ఈ సూచనను సైతం ఏపీఎస్ఆర్టీసీ ఆంగీకరించలేదు. -
ఇక ఎవరి ‘దారి’ వారిదే
నేడు అధికారికంగా ఏపీఎస్ఆర్టీసీ విభజన స్థానికత ఆధారంగా అధికారులు, సిబ్బంది కేటాయింపు హైదరాబాద్: ఇక ఎవరి దారి వారిదే. ఆర్టీసీ విభజన వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీ రెండుగా మారబోతోంది. బుధవారం నుంచి అధికారికంగా ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలు ఏర్పాటవుతున్నాయి. ఆస్తులు, అప్పులు మినహా అధికారుల, సిబ్బంది విడివిడిగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ఆర్టీసీలోకి మారబోతున్నారు. దీనికి సంబంధించి రెండు నెలల క్రితం ‘స్థానికత’ ఆధారంగా జరిగిన కేటాయింపునే ఖరారు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఆప్షన్ల జోలికి వెళ్లొద్దని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తొలుత స్థానికత ఆధారంగానే అధికారులు, సిబ్బందిని విభజించిన ప్పటికీ గత నెలలో ఆప్షన్లను ఎండీ సాంబశివరావు తెరపైకి తేవటంతో తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ఆర్టీసీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఎండీ కాస్త వెనక్కు తగ్గారు. స్థానికత ఆధారంగా జరిగిన విభజన ఆధారంగా బుధవారం పోస్టింగులు ఇవ్వనున్నారు. ఏపీకి మొత్తం ఆరుగురు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు అవసరమవుతారు. ఇందులో బస్‌భవన్‌లో ఇద్దరు పనిచేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం బస్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వెంకటేశ్వరరావు, జయరావు, కోటేశ్వరరావులు ఈడీలుగా ఉన్నారు. ఫీల్డ్‌లో నలుగురు ఉండాల్సి ఉండగా కడప, విజయవాడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఓ అధికారిని తెలంగాణకు కేటాయించే ఉద్దేశంతో అప్పట్లో ఐటీ సెక్షన్‌ను విడదీసి మరో ఈడీకి హెడ్ఆఫీసులో కుర్చీ వేశారు. దీనిపై వ్యతిరేకత వచ్చినా అప్పట్లో పట్టించుకోలేదు. ఇక తెలంగాణకు సంబంధించి హెడ్ఆఫీసులో రెండు ఈడీ పోస్టులుండగా ప్రస్తుతం రవీందర్ ఒక్కరే ఉన్నారు. ఇటీవలే విజయవాడ నుంచి వచ్చిన నాగరాజు, ప్రస్తుతం కరీంనగర్లో పనిచేస్తున్న పురుషోత్తమనాయక్లో ఒకరికి హెడ్ఆఫీసులో పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఫీల్డులో పోస్టు భర్తీకి సికింద్రాబాద్ ఆర్ఎంగా ఉన్న సత్యనారాయణకు ఈడీగా పదోన్నతి కల్పించాలని నిర్ణయించారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన డీఎం స్థాయి అధికారులు కొందరు ఏపీకి మారనున్నారు. ఆర్టీసీ కార్మికుల డిప్యుటేషన్ గడువు పొడిగింపు ఆర్టీసీ పూర్తి స్థాయి విభజన ప్రక్రియ జాప్యం జరుగుతుండటంతో ఏపీ, తెలంగాణల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారికి మరో ఏడాది గడువు పొడిగించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు డిప్యుటేషన్‌ను 2016 మే 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ రీజియన్ ట్రాన్స్ఫర్ సమస్యను పరిష్కరించాలని ఇటీవలే కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై గుర్తింపు సంఘాలతో ఓ కమిటీ వేశారు. దీంతో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులకు ఏడాది కాలం పొడిగించక తప్పలేదు. -
ఆర్టీసీ విభజన మళ్లీ ఆగింది
వాయిదా వేస్తున్నట్టు మెమో జారీ చేసిన ఎండీ ‘ఆప్షన్ల’ ఆధారంగా జాబితా రూపొందించాలంటూ జేఎండీకి సూచన హైదరాబాద్: ఆర్టీసీ విభజన వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఆర్టీసీలో పని విభజనకు వీలుగా స్థానికత ఆధారంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర సిబ్బందిని కేటాయించనున్నట్లు ప్రకటించి చర్యలు చేపట్టిన సంస్థ ఎండీ సాంబశివరావు.. విభజనకు 2 రోజుల ముందు ఆ ప్రక్రియ వాయిదా వేశారు. అనూహ్యంగా ‘ఆప్షన్ల’ను తెరపైకి తెచ్చారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. స్థానికత ప్రాతిపదికన పంపిణీ ఉంటుందని చెప్పి, ఇప్పుడు ఆప్షన్లకు తెరలేపడంపై తెలంగాణ ప్రాంత అధికారులు మండిపడుతున్నారు. ఆంధ్రా అధికారులకు తెలంగాణలో పోస్టింగ్ ఇచ్చే కుట్రలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు. హడావుడిగా మెమో: ఆర్టీసీలోని అన్ని కేటగిరీల అధికారులను స్థానికత ఆధారంగా గత నెలలోనే విభజించారు. తర్వాత ఆప్షన్లకు అవకాశం కల్పిస్తూ, తుది విభజన ఆదేశాలను మే 16న జారీ చేయనున్నట్టు ఎండీ అప్పట్లో ప్రకటించారు. అనంతరం ఆ తేదీని మే 28కి మార్చారు. దాని ప్రకారం గురువారం తుది పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ మంగళవారం మెమో జారీ చేశారు. ఆప్షన్ల ఆధారంగా తెలంగాణలోని అధికారుల విభజన జాబితాను అందజేయాల్సిందిగా జేఎండీ, ఈడీ(ఎ)లకు సూచించారు. జూన్ మొదటివారంలోగా జాబితాను అందజేయాలని, లేకుంటే విభజన బాగా జాప్యమవుతుందని పేర్కొన్నారు. వెరసి ఆప్షన్ల ఆధారంగా అధికారుల పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఆర్టీసీలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ప్రాతిపదిక ఏమిటీ?: అధికారులు ఏ రాష్ట్రం పరిధిలో పనిచేయాలనుకుంటున్నదీ ఆప్షన్ ద్వారా తెలిపే అవకాశాన్ని ఎండీ కల్పించారు. ఈ ఆప్షన్లను ఆమోదించటమా, తిరస్కరించటమా అన్న దానికి మాత్రం ఇప్పటివరకు ఏ ప్రాతిపదికనూ రూపొందించలేదు. కానీ తాజాగా ఆప్షన్ల ఆధారంగా పంపిణీ ఉంటుందనే సంకేతాలు రావడంతో... ఏ ప్రాతిపదికన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటారనే అంశం చర్చనీయాంశమైంది. స్పౌజ్, ఆరోగ్య సమస్యలు వంటి వాటినే ఆప్షన్లకు ప్రాతిపదికగా చేసుకోవాలని టీ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ స్కేల్ కేడర్‌లో దాదాపు 11 మంది ఆంధ్రా అధికారులు తెలంగాణ ఆప్షన్ ఇచ్చిన నేపథ్యంలో.. వారందరినీ తెలంగాణకు కేటాయిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు బుధవారం జరగాల్సి ఉన్న ఆర్టీసీ పాలక మండలి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎండీ మరో మెమో జారీ చేశారు. -
25న ఆర్టీసీ విభజన
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ శాశ్వత విభజనకు ఈ నెల 25న అపాయింటెడ్ డేగా నిర్ణయించాలని రెండు తెలుగు రాష్ట్రాలు పట్టుదలగా ముందుకెళుతున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన జరిగి ఏడాది కావస్తున్నా, ఇంత వరకు ఆర్టీసీ విభజన జరగలేదు. ఆస్తుల పంపిణీలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో షీలాబిడే కమిటీ విభజన ప్రక్రియ పూర్తి చేయలేదు. ఆర్టీసీ ఆస్తులు, అప్పులు మదింపునకు గతంలోనే జవహర్ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆస్తులకు సంబంధించి తొలుత రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. 14 ఆస్తులు ఉమ్మడిగా చెందాలని ఏపీ కార్మిక సంఘాల నేతలు, మూడు ఆస్తులు మాత్రమే ఉమ్మడిగా, అదీ పదేళ్ల పాటు మాత్రమే హక్కులు వర్తిస్తాయని తెలంగాణ కార్మిక సంఘాలు వాదించాయి. చివరకు ఈడీ కమిటీ సైతం తార్నాక ఆస్పత్రి, బస్ బాడీ బిల్డింగ్ యూనిట్, బస్‌భవన్ మాత్రమే ఉమ్మడి ఆస్తులుగా పేర్కొంది. జవహర్ కన్సల్టెన్సీ కూడా ఇదే తేల్చి చెప్పింది. అయితే మూడు ఉమ్మడి ఆస్తుల విషయంలోనూ శాశ్వతంగా, తాత్కాలికంగా అంటూ రెండు రాష్ట్రాల నడుమ విభేదాలు తలెత్తాయి. అప్పట్లో జవహర్ కన్సల్టెన్సీ నివేదికను ఆమోదింప చేసుకునేందుకు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయగా, తెలంగాణ కార్మిక సంఘాల నేతలు బహిష్కరించారు. అప్పటి నుంచి బోర్డు మీటింగ్‌లో ఆస్తుల తాలూకు కన్సల్టెన్సీ నివేదిక ఊసే లేదు. అయితే తాజాగా ఆర్టీసీని పరిపాలన పరంగా విభజించారు. మే 14 నుంచే రెండు ప్రభుత్వాలు వేర్వేరుగా పరిపాలన నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ విభజనకు అపాయింటెడ్ డేగా ఈ నెల 25ని ప్రకటించాలని కేంద్రాన్ని కోరనున్నారు. దీనిపై 23న బస్‌భవన్‌లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. -
ఆర్టీసీ విభజనకు కసరత్తు
⇒ రెండు రాష్ట్రాల సీఎంలతో కొత్త ఎండీ సాంబశివరావు విడివిడిగా భేటీ ⇒ సంస్థను విభజిస్తేనే అభివృద్ధికి అవకాశమని వెల్లడి ⇒ వెంటనే ప్రణాళిక రూపొందించాలని ఇద్దరు ముఖ్యమంత్రుల ఆదేశం ⇒ మూడునాలుగు రోజుల్లో నివేదిక సిద్ధం చేస్తానన్న ఆర్టీసీ ఎండీ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని వేగంగా విభజించేందుకు ఆ సంస్థ కొత్త ఎండీ సాంబశివరావు రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన ప్రణాళిక రూపొందించే క్రమంలో మంగళవారం ఆయన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు నాయుడుతో విడివిడిగా భేటీ అయ్యారు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్న నేపథ్యంలో దాన్ని చక్కదిద్దేందుకు వెంటనే చర్యలు చేపట్టాల్సి ఉందని, లేనిపక్షంలో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ఇరువురి దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో సంస్థ విభజన పూర్తి కావాల్సి ఉందని, రెండు కార్పొరేషన్లు ఏర్పాటైతేనే ఆయా రాష్ట్రాల పరిస్థితిని బట్టి విడివిడిగా ప్రణాళికలు రూపొందించేందుకు వెసులుబాటు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ విషయంలో చొరవ చూపించి త్వరగా విభజన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సాంబశివరావును ఇద్దరు ముఖ్యమంత్రులు ఆదేశించారు. తొలుత చంద్రబాబుతో భేటీ అయిన ఆర్టీసీ ఎండీ అనేక అంశాలపై చర్చించారు. ఆంధ్రాలోని పుష్కల వనరులను సద్వినియోగం చేసుకుని ఆర్టీసీని గాడినపెట్టే దిశగా ఆలోచించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. అయితే విభజన తంతు పూర్తికాకపోవటం వల్ల అధికారులు, సిబ్బంది గందరగోళంలో ఉన్నారని, అది పూర్తికాగానే సంస్థను లాభాల బాట పట్టించే అంశంపై కసరత్తు చేస్తానని సాంబశివరావు హామీ ఇచ్చారు. విభజన విషయంలో స్వేచ్ఛగా వ్యవహరించవచ్చని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆర్టీసీ ఎండీ కలిశారు. సంస్థ బాగుపడాలన్నదే తన ఉద్దేశమని, ఇందుకు విభజనతో మార్గం సుగమమవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇక జాప్యం తగదని సూచించారు. దీనికి ఎండీ స్పందిస్తూ.. వెంటనే విభజనపై దృష్టిసారించి మూడు నాలుగు రోజుల్లో ప్రణాళిక రూపొందించనున్నట్టు కేసీఆర్‌కు స్పష్టం చేశారు. ఇటీవలే కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యదర్శితో రెండు రాష్ట్రాల సీఎస్‌లు రాజీవ్‌శర్మ, ఐవైఆర్ కృష్ణారావు సమావేశమైన విషయం తెలిసిందే. ఆస్తులు-అప్పుల పంపకంతో సంబంధం లేకుండా తొలుత రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. అందుకు ఉమ్మడిగా ఓ నివేదికను అందజేయాల్సిందిగా కోరింది. ఇప్పుడు దాన్ని రూపొందిస్తున్నామని సాంబశివరావు ‘సాక్షి’తో చెప్పారు. -
‘ఆప్షన్’ ఇస్తే ఉద్యమమే
* ఉద్యోగుల కేటాయింపు మార్గదర్శకాలపై ఆర్టీసీ టీజేఏసీ హెచ్చరిక * ‘కమలనాథన్’ మార్గదర్శకాలనే హైలెవల్ కమిటీ అనుసరణపై ధ్వజం * దీని వెనక కుట్ర దాగుందని ఆరోపణ * ‘ఎక్కడివాళ్లక్కడే’ మార్గదర్శకాలను రూపొందించాలని డిమాండ్ * అభ్యంతరాలు తెలిపేందుకు పక్షం రోజుల గడువివ్వాలని పట్టు * ఈ వ్యవహారంపై యాజమాన్యానికి నిరసన తెలపాలని నిర్ణయం * యాజమాన్యం స్పందించకుంటే ఉద్యమం చేపట్టాలని తీర్మానం సాక్షి, హైదరాబాద్: ఊరించి ఊరించి రూపొందించిన ఉద్యోగుల కేటాయింపు మార్గదర్శకాలు ఇప్పుడు ఆర్టీసీలో అగ్గి రాజేసింది. ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి కమలనాథన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను ఆర్టీసీ హైలెవల్ కమిటీ యథాతథంగా అనుసరించటంపై ఆర్టీసీ తెలంగాణ జేఏసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఎక్కడివాళ్లక్కడే పనిచేసేలా ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలుండాలని మొదటి నుంచీ గట్టిగా డిమాండ్ చేస్తున్నా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఉద్యోగులకు ‘అప్షన్’ అవకాశం కల్పించటాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. వెంటనే వాటిని బుట్టదాఖలు చేసి గతంలో తాము సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిం చింది. ఆర్టీసీ అధికారుల సంఘం, సూపర్వైజర్స్ సంఘం, టీఎంయూలతో కూడిన జేఏసీ ప్రతి నిధులు, ఎన్ఎంయూ ప్రతినిధులు ఆదివారం నగరంలోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. మూడు రోజుల క్రితం ఆర్టీసీ హైలెవెల్ కమిటీ పేరిట జారీ అయిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించారు. కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఆర్టీసీకి వర్తించవని స్పష్టం చేస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్‌లు ఆర్టీసీకి సంయుక్త లేఖ రాసినప్పటికీ అవే మార్గదర్శకాలను అనుసరించటంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అవే మార్గదర్శకాలను ఆర్టీసీ హైలెవెల్ కమిటీ పేరుతో జారీ చే యటం, అందులో ఎక్కడా సీఎస్ల సంయుక్త లేఖ గురించి ప్రస్తావించకపోవటాన్ని తప్పు పట్టారు. దీని వెనక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. భేటీలో ఏం చర్చించారంటే... # ఉద్యోగులకు ‘ఆప్షన్’ అవకాశం ఇవ్వటం వల్ల రెండు ప్రాంతాల్లో పదోన్నతులు పొందే వెసులుబాటు ఆంధ్రా ప్రాంత ఉద్యోగులకు లభిస్తుంది. అదే సమయంలో తెలంగాణ ఉద్యోగులు పదోన్నతులతోపాటు పోస్టులనూ కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో జూనియర్ స్కేల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 56 ఖాళీలు ఏర్పడనున్నాయి. ఆప్షన్ వల్ల వాటిని ఆంధ్రా ఉద్యోగులు ఆక్రమిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. # సీనియర్ స్కేల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 13 ఖాళీలు కూడా ఆంధ్రా అధికారులకే దక్కుతాయి. వెరసి రెండు ప్రాంతాల్లో వారు పదోన్నతులు పొందితే తెలంగాణకు పోస్టులు దక్కవు. # పోస్టుల కంటే ఉద్యోగుల సంఖ్య ఆంధ్రలో ఎక్కువగా ఉంటే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి భర్తీ చేసుకోవాలి. కాదంటే వేరే డిపార్ట్మెంట్లకు కూడా మారే వీలున్న కేడర్ అధికారులను వాటికి బదిలీ చేసుకోవాలి. # ఉద్యోగుల సంఖ్య మరీ అదనంగా ఉంటే... తప్పని స్థితిలో ఒకటి రెండేళ్ల కాలపరిమితితో డెప్యుటేషన్ పద్ధతిపై తెలంగాణకు రావాలి. ఆంధ్రలో పోస్టులు రాగానే తిరిగి వెళ్లిపోవాలి. # స్పౌజ్ (భార్య లేదా భర్త), వికలాంగులు తదితరులకు ఆప్షన్ అవకాశం కల్పిస్తే, పదేళ్లపాటు హైదరాబాద్ ఆంధ్రకు కూడా రాజధానిగా ఉండనుంది. హైదరాబాద్‌లోని ఏపీఎస్ఆర్టీసీ పోస్టుల్లో వారిని నియమించుకోవాలి. # మార్గదర్శకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసే గడువు 7వ తేదీ వరకు మాత్రమే ఇచ్చారు. దాన్ని కచ్చితంగా మరో 15 రోజులు పొడగించాలి. # ప్రస్తుత మార్గదర్శకాల జారీ వల్ల తెలంగాణ నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినా వాటినే జారీ చేయడం చూస్తుంటే... మరికొంతకాలం జాప్యం జరిగి ఆ రూపంలో ఆంధ్ర ఉద్యోగులకు లబ్ధి చేకూర్చవచ్చనే కుట్ర దాగుంది. # ఈ అభిప్రాయాలను ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. సానుకూలంగా స్పందించకుంటే వెంటనే ఉద్యమాన్ని ప్రారంభించాలి. -
ఆర్టీసీ ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు జారీ
కమలనాథన్ కమిటీ సిఫారసులే అమలు ఈ నెల 7 వరకు అభ్యంతరాల స్వీకరణ.. తర్వాత తుది జాబితా సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఉమ్మడిగా ఉన్న ఆర్టీసీ విభజన దిశగా ఎట్టకేలకు ముందడుగు పడింది. తెలంగాణ, ఏపీలకు ఆర్టీసీ ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగుల విభజన కోసం కమలనాథన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలనే ఆర్టీసీ కూడా అనుసరించనుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శుల సూచన మేరకు కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల జాబితాకే పేరు మార్చి ఆర్టీసీ మార్గదర్శకాలుగా పేర్కొంటూ తాజాగా విడుదల చేసింది. తెలంగాణకు చెందిన జేఎండీ రమణారావు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈడీ(అడ్మిన్) వెంకటేశ్వరరావు సంతకాలతో ఇవి జారీ అయ్యాయి. వీటిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈ నెల 7వ తేదీలోగా తెలపాల్సిందిగా ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సంస్థ పాలకమండలి భేటీలో తుది జాబితాను ఆమోదించి ఇరు రాష్ట్రాలకు పంపనుంది. అక్కడి నుంచి షీలా భిడే కమిటీ ద్వారా కేంద్రానికి చేరుతుంది. తాజా మార్గదర్శకాల ప్రకారం స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు ఉంటుంది. 6 నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా గుర్తిస్తారు. భార్యాభర్తలు(స్పౌస్ కేసు), ఆరోగ్య సమస్యలు, ఏపీలో కలిపిన పోలవరం ముంపు ప్రాంతాల వారు ఆప్షన్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఒక రాష్ట్రంలో పోస్టుల కంటే సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉంటే అదనపు సిబ్బందిని మరో రాష్ట్రానికి బదిలీ చేస్తారు. ఏపీలో పోస్టుల సంఖ్యకన్నా ఉద్యోగులే ఎక్కువగా ఉన్నందున అదనంగా ఉన్నవారు తెలంగాణకు రానున్నారు. దీంతో తాము నష్టపోతామంటూ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఇప్పటికే అభ్యంతరం చెబుతున్నారు. -
త్వరలో ఆర్టీసీ విభజన
వారం రోజుల్లో ఇద్దరు సీఎస్‌లతో మాట్లాడుతా: గడ్కరీ ఆస్తులు, అప్పుల పంపకం కూడా కొలిక్కి తెస్తాం మంత్రి మహేందర్‌రెడ్డికి కేంద్రమంత్రి హామీ సాక్షి, హైదరాబాద్ / న్యూఢిల్లీ : రాష్ట్రం విడిపోయి ఆరునెలలు గడుస్తున్నా ఇంకా ఆర్టీసీ ఉమ్మడిగానే ఉండడం పట్ల కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే రెండు రవాణా సంస్థలుగా సేవలు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. వారంరోజుల్లో రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను పిలిపించి దీనిపై చర్చిస్తానని, వీలైనంత తొందరలో ఆస్తులు, అప్పుల పంపకాలను కూడా పూర్తి చేసేలా చూస్తానని గడ్కరీ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఢిల్లీలో ట్రాన్స్పోర్ట్ భవన్లో నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఆర్టీసీకి 23వేల బస్సులున్నాయని, ఉమ్మడిగా ఉండడంతో ఆస్తుల, ఉద్యోగుల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దాన్ని వెంటనే విభజించాల్సిందిగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మహేందర్ రెడ్డి, టీఆర్ ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. ఎక్కడి ఆస్తులు అక్కడే, ఏ ప్రాంత బస్సులు ఆ ప్రాంతానికే పరిమితం చే సే అవకాశం ఉన్నందున విభజన పెద్ద సమస్య కాబోదనే అభిప్రాయాన్ని కేంద్రమంత్రి వెలిబుచ్చినట్టు ఆయన తెలిపారు. వారంరోజుల్లో రెండు రాష్ట్రాల సీఎస్‌లను పిలిపించి చర్చించినప్పుడు వీటన్నింటిపై నిర్ణయాలు తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. తాను గడ్కరీ వద్ద ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడారని, వారంలో విభజనకు వీలుగా చర్యలు తీసుకుంటానని సీఎంకు గడ్కరీ హామీ ఇచ్చారన్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద రావాల్సిన మరో 522 బస్సులు తొందరగా అందేలా చూడాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును శుక్రవారం కలసి విన్నవించాలని అనుకున్నామని, కానీ శుక్రవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉన్నందున ఆ భేటీని వాయిదా వేసుకున్నట్టు మహేందర్‌రెడ్డి చెప్పారు. నితిన్గడ్కరీతో ఈ యూ నేతల భేటీ ... ఇదిలాఉండగా, ఆర్టీసీని వెంటనే విభజించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఆర్టీసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ కోరింది. కేంద్ర రోడ్డు భద్రత చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన టీఎస్‌ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భాస్కరరావులు గురువారం గడ్కరీని కలసి ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఐదువేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని, దీనిని పూడ్చుకోవడానికి కేంద్రం సాయం చేయాలని వారు కోరారు. అలాగేప్రజారవాణాలో ఉన్న ఆర్టీసీకి రాయితీలు, మినహాయింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో విభజిస్తామని గడ్కరీ తమకు హామీ ఇచ్చారని వారు తెలిపారు. కాగా, జంతర్‌మంతర్ ధర్నాలో తమ యూనియన్ నుంచి 50 మంది పాల్గొన్నారని తెలిపారు. -
ఆర్టీసీ విభజనపై నేడు ఢిల్లీకి మంత్రి
తాండూరు: ఆర్టీసీ విభజన కోసం ఢిల్లీకి వెళ్లనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి తాండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు చెప్పారు. ఆర్టీసీ విభజనను త్వరితగతిన చేపట్టాలని ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రితో చర్చించనున్నట్టు తెలిపారు. కార్మిక బీమా ఆసుపత్రి(ఈఎస్ఐ) ఏర్పాటుకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కలువనున్నట్టు పేర్కొన్నారు. జేఎన్ఎన్యూఆర్ఓ కింద తెలంగాణకు అదనపు ఏసీ బస్సుల కొనుగోలుకు నిధుల మంజూరు కోసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కోరనున్నట్టు వివరించారు. ఇది వరకు రూ.150కోట్లతో 500 బస్సులు వచ్చాయని, ఇందులో 400 పల్లె వెలుగు బస్సులు కాగా మిగిలిన 100 ఏసీ బస్సులు ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లాకు 30, కరీంనగర్ జిల్లాకు 70, మహబూబ్‌నగర్ జిల్లాకు 30 ఏసీ బస్సులను నడపనున్నట్టు చెప్పారు. తెలంగాణలోని మిగితా ఏడు జిల్లాల్లో కూడా ఏసీ బస్సులు నడపనున్నట్టు, ఈ విషయమై మంత్రి వెంకయ్యనాయుడిని కలువనున్నట్టు మంత్రి చెప్పారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, ముంబయి తదితర ముఖ్య నగరాలకు బస్సులను నడపనున్నట్టు చెప్పారు. వికారాబాద్, తాండూరులలో రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాల కోసం కేంద్ర రైల్వే మంత్రిని కోరనున్నట్టు తెలిపారు. కొత్త ఏడాదిలో ఆర్టీసి కార్మికులకు తెలంగాణ గ్రాంట్ అమల్లోకి వస్తుందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణీకుల భద్రత కోసం క్యాబిన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వానికి నష్టం వస్తున్నా మహిళల భద్రత దృష్ట్యా క్యాబిన్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. సీసీ కెమెరాలను కూడా అమర్చినట్టు తెలిపారు. ఏసీ బస్సుల్లో చార్జీలు తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ తక్కువగానే ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్ పాల్గొన్నారు. రోడ్లకు నిధుల మంజూరు బషీరాబాద్: వికారాబాద్ -తాండూరు నాలుగు లైన్ల రోడ్డుకు రూ. 40 కోట్లు మంజూరయ్యాయని రావాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన రెడ్డిగణపూర్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు ఔటర్ రోడ్డు పనుల కోసం రూ.78 కోట్లు మంజూరయ్యాయయన్నారు. తాండూరు నియోజక వర్గంలో ఆర్అండ్బీ రోడ్డు పనులకోసం రూ.188 కోట్లు మంజూరు కాగా అందులో పంచాయతి రాజ్ శాఖ రోడ్ల కోసం 38 కోట్లు మంజూరయ్యాయన్నారు. బ్రిడ్జి నిర్మాణాల కోసం రూ.39 కోట్లు మంజూరయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2లక్షల 14 వేల మందికి రూ.42 కోట్ల ఆసరా పింఛన్లను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అజయ్‌ప్రసాద్, వెంకట్రాంరెడ్డి శంకర్‌రెడ్డి, సుధకర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులున్నారు. -
దసరాకల్లా ఆర్టీసీ విభజన
13న షీలా బేడీ కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్: గందరగోళంగా మారిన ఆర్టీసీ విభజన త్వరలోనే కొలిక్కి రానుంది. దసరాలోగా విభజన పూర్తిచేసి రెండు రాష్ట్రాలకు ఆర్టీసీ బోర్డులను ప్రకటించే కసరత్తు వేగవంతమైంది. విభజన కమిటీకి చైర్మన్‌గా ఉన్న ఉన్నతాధికారిణి షీలా బేడీ నేతృత్వంలో సభ్యులు 13వ తేదీన భేటీ కానున్నారు. అనంతరం పూర్తి స్థాయి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కమిటీ సమర్పించనుంది. సభ్యులు ఇప్పటికే జూలై 1న సమావేశమై ఇరు ప్రాంతాలకు చెందిన ఆస్తుల పంపకాలు, అప్పులపై లెక్కలు తేల్చారు. ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం, తెలంగాణకు 42 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించారు. ఆంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లో ఉన్న 123 డిపోల్లో 10,600 బస్సులు, ఉమ్మడిగా ఉన్న అప్పు రూ.4,700 కోట్లలో రూ.2,633 కోట్లు ఆంధ్ర వాటాగా తేల్చారు. ఉమ్మడిగా ఉన్న 14 ఆస్తుల విషయంలోనే వివాదాలు తలెత్తాయి. పైగా ఆంధ్రకు ఇంకా 1,005 బస్సులు రావాలని, ఆర్టీసీకి హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల్ని లెక్కగట్టి ఆ విలువ తమకు ఇవ్వాలని ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు పట్టుబడుతున్నారు. బస్ భవన్‌తో పాటు హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులకు రూ.1,500 కోట్లు ఇవ్వాలని కోరగా, పదేళ్ల పాటు ఉమ్మడిగా వినియోగించుకోవడమే తప్ప నిధులిచ్చే ప్రసక్తి లేదని తెలంగాణ తేల్చిచెప్పింది. ఈ వివాదం కొనసాగుతుండగా, ఆర్టీసీ సంస్థలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ విభజన జరగకుంటే నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో షీలా బేడీ నేతృత్వంలో సభ్యులు ఏకే గోయల్, కె.నరసింగరావు, కేఎన్‌రావు వివాదాలు తేల్చే ప్రక్రియను వేగిరపరిచారు. విభజనకు రెండు నెలలు సమయం పడుతుందని ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు ఇప్పటికే ప్రకటించారు. దసరా నాటికి రెండు ఆర్టీసీ బోర్డులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీకి సంబంధించి ఆర్టీసీకి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తే తప్ప నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు.