త్వరలో ఆర్టీసీ విభజన
- వారం రోజుల్లో ఇద్దరు సీఎస్‌లతో మాట్లాడుతా: గడ్కరీ
- ఆస్తులు, అప్పుల పంపకం కూడా కొలిక్కి తెస్తాం
- మంత్రి మహేందర్‌రెడ్డికి కేంద్రమంత్రి హామీ
సాక్షి, హైదరాబాద్ / న్యూఢిల్లీ : రాష్ట్రం విడిపోయి ఆరునెలలు గడుస్తున్నా ఇంకా ఆర్టీసీ ఉమ్మడిగానే ఉండడం పట్ల కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే రెండు రవాణా సంస్థలుగా సేవలు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. వారంరోజుల్లో రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను పిలిపించి దీనిపై చర్చిస్తానని, వీలైనంత తొందరలో ఆస్తులు, అప్పుల పంపకాలను కూడా పూర్తి చేసేలా చూస్తానని గడ్కరీ పేర్కొన్నారు.
గురువారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఢిల్లీలో ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఆర్టీసీకి 23వేల బస్సులున్నాయని, ఉమ్మడిగా ఉండడంతో ఆస్తుల, ఉద్యోగుల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దాన్ని వెంటనే విభజించాల్సిందిగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మహేందర్ రెడ్డి, టీఆర్ ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. ఎక్కడి ఆస్తులు అక్కడే, ఏ ప్రాంత బస్సులు ఆ ప్రాంతానికే పరిమితం చే సే అవకాశం ఉన్నందున విభజన పెద్ద సమస్య కాబోదనే అభిప్రాయాన్ని కేంద్రమంత్రి వెలిబుచ్చినట్టు ఆయన తెలిపారు.
వారంరోజుల్లో రెండు రాష్ట్రాల సీఎస్‌లను పిలిపించి చర్చించినప్పుడు వీటన్నింటిపై నిర్ణయాలు తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. తాను గడ్కరీ వద్ద ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడారని, వారంలో విభజనకు వీలుగా చర్యలు తీసుకుంటానని సీఎంకు గడ్కరీ హామీ ఇచ్చారన్నారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద రావాల్సిన మరో 522 బస్సులు తొందరగా అందేలా చూడాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును శుక్రవారం కలసి విన్నవించాలని అనుకున్నామని, కానీ శుక్రవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉన్నందున ఆ భేటీని వాయిదా వేసుకున్నట్టు మహేందర్‌రెడ్డి చెప్పారు.
నితిన్‌గడ్కరీతో ఈ యూ నేతల భేటీ ...
ఇదిలాఉండగా, ఆర్టీసీని వెంటనే విభజించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఆర్టీసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ కోరింది. కేంద్ర రోడ్డు భద్రత చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన టీఎస్‌ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భాస్కరరావులు గురువారం గడ్కరీని కలసి ఈమేరకు విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ ఐదువేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని, దీనిని పూడ్చుకోవడానికి కేంద్రం సాయం చేయాలని వారు కోరారు. అలాగేప్రజారవాణాలో ఉన్న ఆర్టీసీకి రాయితీలు, మినహాయింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో విభజిస్తామని గడ్కరీ తమకు హామీ ఇచ్చారని వారు తెలిపారు. కాగా, జంతర్‌మంతర్ ధర్నాలో తమ యూనియన్ నుంచి 50 మంది పాల్గొన్నారని తెలిపారు.