
25న ఆర్టీసీ విభజన
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ శాశ్వత విభజనకు ఈ నెల 25న అపాయింటెడ్ డేగా నిర్ణయించాలని రెండు తెలుగు రాష్ట్రాలు పట్టుదలగా ముందుకెళుతున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన జరిగి ఏడాది కావస్తున్నా, ఇంత వరకు ఆర్టీసీ విభజన జరగలేదు. ఆస్తుల పంపిణీలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో షీలాబిడే కమిటీ విభజన ప్రక్రియ పూర్తి చేయలేదు. ఆర్టీసీ ఆస్తులు, అప్పులు మదింపునకు గతంలోనే జవహర్ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆస్తులకు సంబంధించి తొలుత రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. 14 ఆస్తులు ఉమ్మడిగా చెందాలని ఏపీ కార్మిక సంఘాల నేతలు, మూడు ఆస్తులు మాత్రమే ఉమ్మడిగా, అదీ పదేళ్ల పాటు మాత్రమే హక్కులు వర్తిస్తాయని తెలంగాణ కార్మిక సంఘాలు వాదించాయి. చివరకు ఈడీ కమిటీ సైతం తార్నాక ఆస్పత్రి, బస్ బాడీ బిల్డింగ్ యూనిట్, బస్‌భవన్ మాత్రమే ఉమ్మడి ఆస్తులుగా పేర్కొంది.
జవహర్ కన్సల్టెన్సీ కూడా ఇదే తేల్చి చెప్పింది. అయితే మూడు ఉమ్మడి ఆస్తుల విషయంలోనూ శాశ్వతంగా, తాత్కాలికంగా అంటూ రెండు రాష్ట్రాల నడుమ విభేదాలు తలెత్తాయి. అప్పట్లో జవహర్ కన్సల్టెన్సీ నివేదికను ఆమోదింప చేసుకునేందుకు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయగా, తెలంగాణ కార్మిక సంఘాల నేతలు బహిష్కరించారు. అప్పటి నుంచి బోర్డు మీటింగ్‌లో ఆస్తుల తాలూకు కన్సల్టెన్సీ నివేదిక ఊసే లేదు. అయితే తాజాగా ఆర్టీసీని పరిపాలన పరంగా విభజించారు. మే 14 నుంచే రెండు ప్రభుత్వాలు వేర్వేరుగా పరిపాలన నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ విభజనకు అపాయింటెడ్ డేగా ఈ నెల 25ని ప్రకటించాలని కేంద్రాన్ని కోరనున్నారు. దీనిపై 23న బస్‌భవన్‌లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.