
ఆర్టీసీ విభజన మళ్లీ ఆగింది
వాయిదా వేస్తున్నట్టు మెమో జారీ చేసిన ఎండీ
‘ఆప్షన్ల’ ఆధారంగా జాబితా రూపొందించాలంటూ జేఎండీకి సూచన
హైదరాబాద్: ఆర్టీసీ విభజన వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఆర్టీసీలో పని విభజనకు వీలుగా స్థానికత ఆధారంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర సిబ్బందిని కేటాయించనున్నట్లు ప్రకటించి చర్యలు చేపట్టిన సంస్థ ఎండీ సాంబశివరావు.. విభజనకు 2 రోజుల ముందు ఆ ప్రక్రియ వాయిదా వేశారు. అనూహ్యంగా ‘ఆప్షన్ల’ను తెరపైకి తెచ్చారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. స్థానికత ప్రాతిపదికన పంపిణీ ఉంటుందని చెప్పి, ఇప్పుడు ఆప్షన్లకు తెరలేపడంపై తెలంగాణ ప్రాంత అధికారులు మండిపడుతున్నారు. ఆంధ్రా అధికారులకు తెలంగాణలో పోస్టింగ్ ఇచ్చే కుట్రలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు.
హడావుడిగా మెమో: ఆర్టీసీలోని అన్ని కేటగిరీల అధికారులను స్థానికత ఆధారంగా గత నెలలోనే విభజించారు. తర్వాత ఆప్షన్లకు అవకాశం కల్పిస్తూ, తుది విభజన ఆదేశాలను మే 16న జారీ చేయనున్నట్టు ఎండీ అప్పట్లో ప్రకటించారు. అనంతరం ఆ తేదీని మే 28కి మార్చారు. దాని ప్రకారం గురువారం తుది పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ మంగళవారం మెమో జారీ చేశారు. ఆప్షన్ల ఆధారంగా తెలంగాణలోని అధికారుల విభజన జాబితాను అందజేయాల్సిందిగా జేఎండీ, ఈడీ(ఎ)లకు సూచించారు. జూన్ మొదటివారంలోగా జాబితాను అందజేయాలని, లేకుంటే విభజన బాగా జాప్యమవుతుందని పేర్కొన్నారు. వెరసి ఆప్షన్ల ఆధారంగా అధికారుల పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఆర్టీసీలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
ప్రాతిపదిక ఏమిటీ?: అధికారులు ఏ రాష్ట్రం పరిధిలో పనిచేయాలనుకుంటున్నదీ ఆప్షన్ ద్వారా తెలిపే అవకాశాన్ని ఎండీ కల్పించారు. ఈ ఆప్షన్లను ఆమోదించటమా, తిరస్కరించటమా అన్న దానికి మాత్రం ఇప్పటివరకు ఏ ప్రాతిపదికనూ రూపొందించలేదు. కానీ తాజాగా ఆప్షన్ల ఆధారంగా పంపిణీ ఉంటుందనే సంకేతాలు రావడంతో... ఏ ప్రాతిపదికన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటారనే అంశం చర్చనీయాంశమైంది. స్పౌజ్, ఆరోగ్య సమస్యలు వంటి వాటినే ఆప్షన్లకు ప్రాతిపదికగా చేసుకోవాలని టీ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ స్కేల్ కేడర్‌లో దాదాపు 11 మంది ఆంధ్రా అధికారులు తెలంగాణ ఆప్షన్ ఇచ్చిన నేపథ్యంలో.. వారందరినీ తెలంగాణకు కేటాయిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు బుధవారం జరగాల్సి ఉన్న ఆర్టీసీ పాలక మండలి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎండీ మరో మెమో జారీ చేశారు.