ఇక ఎవరి ‘దారి’ వారిదే | Today's official separation of the APSRTC | Sakshi
Sakshi News home page

ఇక ఎవరి ‘దారి’ వారిదే

Published Wed, Jun 3 2015 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

ఇక ఎవరి ‘దారి’ వారిదే

ఇక ఎవరి ‘దారి’ వారిదే

నేడు అధికారికంగా ఏపీఎస్‌ఆర్టీసీ విభజన
స్థానికత ఆధారంగా అధికారులు, సిబ్బంది కేటాయింపు

 
హైదరాబాద్: ఇక ఎవరి దారి వారిదే. ఆర్టీసీ విభజన వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీ రెండుగా మారబోతోంది. బుధవారం నుంచి అధికారికంగా ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీలు ఏర్పాటవుతున్నాయి. ఆస్తులు, అప్పులు మినహా అధికారుల, సిబ్బంది విడివిడిగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ఆర్టీసీలోకి మారబోతున్నారు. దీనికి సంబంధించి రెండు నెలల క్రితం ‘స్థానికత’ ఆధారంగా జరిగిన కేటాయింపునే ఖరారు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఆప్షన్ల జోలికి వెళ్లొద్దని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తొలుత స్థానికత ఆధారంగానే అధికారులు, సిబ్బందిని విభజించిన ప్పటికీ గత నెలలో ఆప్షన్లను ఎండీ సాంబశివరావు తెరపైకి తేవటంతో తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.

దీనిపై తెలంగాణ ఆర్టీసీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఎండీ కాస్త వెనక్కు తగ్గారు.  స్థానికత ఆధారంగా జరిగిన విభజన ఆధారంగా బుధవారం పోస్టింగులు ఇవ్వనున్నారు. ఏపీకి మొత్తం ఆరుగురు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు అవసరమవుతారు. ఇందులో బస్‌భవన్‌లో ఇద్దరు పనిచేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం బస్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వెంకటేశ్వరరావు, జయరావు, కోటేశ్వరరావులు ఈడీలుగా ఉన్నారు. ఫీల్డ్‌లో నలుగురు ఉండాల్సి ఉండగా కడప, విజయవాడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  గతంలో ఓ అధికారిని తెలంగాణకు కేటాయించే ఉద్దేశంతో అప్పట్లో ఐటీ సెక్షన్‌ను విడదీసి మరో ఈడీకి హెడ్‌ఆఫీసులో కుర్చీ వేశారు. దీనిపై వ్యతిరేకత వచ్చినా అప్పట్లో పట్టించుకోలేదు.  ఇక తెలంగాణకు సంబంధించి హెడ్‌ఆఫీసులో రెండు ఈడీ పోస్టులుండగా ప్రస్తుతం రవీందర్ ఒక్కరే ఉన్నారు. ఇటీవలే విజయవాడ నుంచి వచ్చిన నాగరాజు, ప్రస్తుతం కరీంనగర్‌లో పనిచేస్తున్న పురుషోత్తమనాయక్‌లో ఒకరికి హెడ్‌ఆఫీసులో పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఫీల్డులో పోస్టు భర్తీకి సికింద్రాబాద్ ఆర్‌ఎంగా ఉన్న సత్యనారాయణకు ఈడీగా పదోన్నతి కల్పించాలని నిర్ణయించారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన డీఎం స్థాయి అధికారులు కొందరు ఏపీకి మారనున్నారు.
 
ఆర్టీసీ కార్మికుల డిప్యుటేషన్ గడువు పొడిగింపు
ఆర్టీసీ పూర్తి స్థాయి విభజన ప్రక్రియ జాప్యం జరుగుతుండటంతో ఏపీ, తెలంగాణల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారికి మరో ఏడాది గడువు పొడిగించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు డిప్యుటేషన్‌ను 2016 మే 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ రీజియన్ ట్రాన్స్‌ఫర్ సమస్యను పరిష్కరించాలని ఇటీవలే కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై గుర్తింపు సంఘాలతో ఓ కమిటీ వేశారు. దీంతో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులకు ఏడాది కాలం పొడిగించక తప్పలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement