ఆర్టీసీ విభజనకు కసరత్తు
⇒ రెండు రాష్ట్రాల సీఎంలతో కొత్త ఎండీ సాంబశివరావు విడివిడిగా భేటీ
⇒ సంస్థను విభజిస్తేనే అభివృద్ధికి అవకాశమని వెల్లడి
⇒ వెంటనే ప్రణాళిక రూపొందించాలని ఇద్దరు ముఖ్యమంత్రుల ఆదేశం
⇒ మూడునాలుగు రోజుల్లో నివేదిక సిద్ధం చేస్తానన్న ఆర్టీసీ ఎండీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని వేగంగా విభజించేందుకు ఆ సంస్థ కొత్త ఎండీ సాంబశివరావు రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన ప్రణాళిక రూపొందించే క్రమంలో మంగళవారం ఆయన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు నాయుడుతో విడివిడిగా భేటీ అయ్యారు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్న నేపథ్యంలో దాన్ని చక్కదిద్దేందుకు వెంటనే చర్యలు చేపట్టాల్సి ఉందని, లేనిపక్షంలో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ఇరువురి దృష్టికి తెచ్చారు.
ఈ నేపథ్యంలో సంస్థ విభజన పూర్తి కావాల్సి ఉందని, రెండు కార్పొరేషన్లు ఏర్పాటైతేనే ఆయా రాష్ట్రాల పరిస్థితిని బట్టి విడివిడిగా ప్రణాళికలు రూపొందించేందుకు వెసులుబాటు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ విషయంలో చొరవ చూపించి త్వరగా విభజన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సాంబశివరావును ఇద్దరు ముఖ్యమంత్రులు ఆదేశించారు. తొలుత చంద్రబాబుతో భేటీ అయిన ఆర్టీసీ ఎండీ అనేక అంశాలపై చర్చించారు. ఆంధ్రాలోని పుష్కల వనరులను సద్వినియోగం చేసుకుని ఆర్టీసీని గాడినపెట్టే దిశగా ఆలోచించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.
అయితే విభజన తంతు పూర్తికాకపోవటం వల్ల అధికారులు, సిబ్బంది గందరగోళంలో ఉన్నారని, అది పూర్తికాగానే సంస్థను లాభాల బాట పట్టించే అంశంపై కసరత్తు చేస్తానని సాంబశివరావు హామీ ఇచ్చారు. విభజన విషయంలో స్వేచ్ఛగా వ్యవహరించవచ్చని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆర్టీసీ ఎండీ కలిశారు. సంస్థ బాగుపడాలన్నదే తన ఉద్దేశమని, ఇందుకు విభజనతో మార్గం సుగమమవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇక జాప్యం తగదని సూచించారు. దీనికి ఎండీ స్పందిస్తూ.. వెంటనే విభజనపై దృష్టిసారించి మూడు నాలుగు రోజుల్లో ప్రణాళిక రూపొందించనున్నట్టు కేసీఆర్‌కు స్పష్టం చేశారు. ఇటీవలే కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యదర్శితో రెండు రాష్ట్రాల సీఎస్‌లు రాజీవ్‌శర్మ, ఐవైఆర్ కృష్ణారావు సమావేశమైన విషయం తెలిసిందే. ఆస్తులు-అప్పుల పంపకంతో సంబంధం లేకుండా తొలుత రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. అందుకు ఉమ్మడిగా ఓ నివేదికను అందజేయాల్సిందిగా కోరింది. ఇప్పుడు దాన్ని రూపొందిస్తున్నామని సాంబశివరావు ‘సాక్షి’తో చెప్పారు.