హోదాను దిగజార్చుతున్న సీఎం
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క
మధిర: ప్రతిప్రక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. హోదాను దిగజారుస్తూ సీఎం కేసీఆర్ వీధిరౌడీలా మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో రూ.2 లక్షల కోట్లకు స్కీములు తయారు చేశారని, వాటి అమలు కోసం అనేక కార్పొరేషన్లను ప్రవేశపెట్టి ఆర్థిక సంస్థలు, బ్యాంకుల వద్ద అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ.28వేల కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తే.. రీ డిజైనింగ్ పేరుతో ప్రస్తుత ప్రభుత్వం రూ.90వేల కోట్లకు పెంచిందన్నారు. రూ.875కోట్లతో పూర్తయ్యే రాజీవ్‌సాగర్ ప్రాజెక్టును రూ.10వేల కోట్లకు, రూ.2 వేల కోట్లతో పూర్తయ్యే కంతనపల్లి ప్రాజెక్టును రూ.9 వేల కోట్లకు పెంచుతూ రీ డిజైన్ చేసినట్లు తెలిపారు. వీటికి సమాధానాలు అడుగుతుంటే కాంగ్రెస్ వాళ్లు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని, ప్రగతి నిరోధకులని సీఎం మాట్లాడటం సమంజసం కాదన్నారు.