భట్టి విక్రమార్క (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో 60 ఏళ్ల కిందట అంతరించినపోయిన బాంచన్ దొర సంస్కృతిని ఆపధర్మ సీఎం కేసీఆర్ మళ్లీ తీసుకువచ్చారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో అమరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక నాయకులతో భట్టి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అమరులను కేవలం తన స్వార్థం కోసమే వాడుకున్నారని విమర్శించారు. ఆత్మబలిదానాలు చేసుకున్న ఉద్యమకారులు ఆశించిన ఫలితం మాత్రం రాలేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు లక్ష్యాలు, ఆశయాలు పూర్తిగా పక్కదారి పట్టాయని, కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం కలిగే విధంగా కేసీఆర్ పాలన ఉందన్నారు.
సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. ‘‘అమరుల ఆశయాలు నెరవేరాలంటే నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజలకు దక్కాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అవి దక్కుతాయి. గడిచిన నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. ఉద్యోగాలు అడిగిన విద్యార్థులపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీని ఓపెన్ జైలుగా మార్చారు. ఒక్క పరిశ్రమను కూడా స్థాపించలేదు. భారీ ప్రాజెక్టులు కట్టలేదు. అప్పులు భారీగా పెరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమర వీరుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment