‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ రద్దు
⇒ భూమాయపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం
⇒ మరో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లపై వేటు
⇒ రిజిస్ట్రేషన్ల దందాపై ఉన్నతస్థాయిలో సమీక్షించిన సీఎం కేసీఆర్
⇒ మియాపూర్‌లో 796 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ అయినట్లు వెల్లడి
⇒ బాధ్యులపై కఠిన చర్యలు.. సీఐడీ దర్యాప్తునకు ఆదేశం
⇒ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లకు సెక్షన్ 47(ఎ) విచక్షణాధికారాల తొలగింపు
⇒ కార్యాలయాలపై ఏసీబీ నిఘా.. తనిఖీలకు ఆదేశం
⇒ 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై నేటి నుంచి దాడులు..
⇒ రంగంలోకి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు
⇒ అప్‌లోడ్ చేయకుండా దాచిన డాక్యుమెంట్ల స్వాధీనానికి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్
భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని నిర్ణయించడంతోపాటు అక్రమాలకు ఆస్కారమిస్తున్న ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్ (రాష్ట్రంలో ఎక్కడైనా భూముల రిజిస్ట్రేషన్)’విధానాన్ని రద్దు చేసింది. ఆస్తులు ఏ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తాయో అక్కడే వాటి రిజిస్ట్రేషన్ జరగాలని స్పష్టం చేసింది. జిల్లా రిజిస్ట్రార్లకు ఉన్న సెక్షన్ 47(ఎ) విచక్షణాధికారాలను తొలగించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై నిఘా పెట్టాలని, ఎక్కడ అవినీతి కనిపించినా వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏసీబీని ఆదేశించింది.
సీఎం తీవ్ర అసంతృప్తి
మియాపూర్‌లో రూ.వేల కోట్ల విలువైన 796 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడే కాకుండా మరికొన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వెల్లడైంది. దీంతో ఈ అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో ఐదు గంటలకుపైగా సమీక్షించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి జగదీశ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కవిత, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, డీజీపీ అనురాగ్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ల విషయంలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి, అక్రమాలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కఠిన నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ‘డబ్బులిస్తేనే తప్ప రిజిస్ట్రేషన్లు కావనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ పరిస్థితి పోవాలి. రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలు జరగాలి. పూర్తి ప్రక్షాళన అవసరం..’అని పేర్కొన్నారు. అవినీతికి తావు లేనివిధంగా రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయాలని సూచించారు. దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్నవారిని వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు.
గట్టి నిఘా.. అధికారాల కుదింపు
రాష్ట్రంలోని అన్ని జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై నిఘా పెట్టాలని, ఎక్కడ అవినీతి కనిపించినా వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సెక్షన్ 47ఏ ద్వారా సబ్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రార్లకు కల్పించిన విచక్షణాధికారాలను తొలగించాలని ఆదేశించారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
ప్రభుత్వ స్థలం ఎక్కడికీ పోలేదు
ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందనే ప్రచారం అవాస్తమని కేసీఆర్ వివరణ ఇచ్చారు.‘‘మియాపూర్ పరిధిలో ఒక్క గజం ప్రభుత్వ స్థలం కూడా వేరే వ్యక్తులకు పోలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రభుత్వ స్థలం సర్వే నంబర్లు వేసి 2016లో ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించారు. కొందరు అధికారులు వారికి సహకరించారు. ఇటీవలే ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించి ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేశాం. ఈ వ్యవహారంలో ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటాం. అసలు ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధం. చేసినా అవి చెల్లవు. మియాపూర్‌లో ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ జరిగినా దానికి చట్టబద్ధత లేదు. భూబదలాయింపు జరగలేదు. ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందనే ప్రచారం తప్పు..’’అని పేర్కొన్నారు.
వెంటనే తనిఖీలు
బినామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మరో అక్రమ దందా సాగుతోందని సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించిన వారితో అధికారులు కుమ్మక్కై ఆ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం లేదని సమాచారం అందింది. దీంతో వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై దాడులు చేసి.. అప్‌లోడ్ కాని రిజిస్ట్రేషన్ల వివరాలు సేకరించాలని, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలని పోలీసు శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో పోలీస్ శాఖ వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది. అన్ని రికార్డులు పరిశీలించి, అవకతవకలు బయటపడితే వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. బు«ధవారం నుంచే ఈ స్క్వాడ్‌లు రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేయనున్నాయి.
సెక్షన్ 47–ఎ అధికారాలు కట్
రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 47–ఎ ప్రకారం జిల్లా రిజిస్ట్రార్లకు ఉన్న అధికారాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సెక్షన్ ప్రకారం ఏదైనా ప్రాంతంలో భూమి రిజిస్ట్రేషన్ విలువ మార్కెట్ రేటుకంటే ఎక్కువగా ఉన్నట్లయితే.. విలువ తగ్గింపు కోసం సదరు భూమి అమ్మకం దారు లేదా కొనుగోలుదారులు జిల్లా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ అభ్యర్థనను పరిశీలించి ఆ భూమి రిజిస్ట్రేషన్ విలువను 50 శాతం వరకు తగ్గించేందుకు జిల్లా రిజిస్ట్రార్‌కు అధికారం ఉంటుంది. ఇలా భూమి విలువ తగ్గింపుతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపుడ్యూటీ కూడా తగ్గుతుంది. దీనిని సావకాశంగా తీసుకుని కొందరు జిల్లా రిజిస్ట్రార్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో జిల్లా రిజిస్ట్రార్లకున్న ఈ అధికారాలపై సర్కారు కోత వేసింది. ఇకపై ఈ అధికారాలు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు మాత్రమే ఉంటాయి.
మరో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లపై కేసులు
అటు సీఎం సమీక్ష కొనసాగుతుండగానే.. ఇటు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులపై చర్యలు ప్రారంభమయ్యాయి. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ యూసఫ్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేశ్ చంద్రారెడ్డిలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరిద్దరితో పాటు ఇప్పటికే సస్పెండైన కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మహ్మద్ యూసఫ్, రమేశ్ చంద్రారెడ్డి పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నట్లు తెలిసింది.
‘ఎనీవేర్’రద్దును స్వాగతిస్తున్నాం: సబ్ రిజిస్ట్రార్ల సంఘం
అక్రమాలకు నెలవుగా మారిన ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’విధానం రద్దును స్వాగతిస్తున్నామని రాష్ట్ర సబ్ రిజిస్ట్రార్ల సంఘం పేర్కొంది. కొందరు అధికారులు చేసే తప్పుల వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని, అక్రమార్కులపై విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని కోరింది. ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రిజిస్ట్రేషన్లలో జరిగిన అక్రమాలను నిర్భయంగా బయట పెట్టిన ఆడిట్ అధికారులను అభినందిస్తున్నామని.. అక్రమాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖలో సిబ్బంది కొరత, సదుపాయాల కొరతను తొలగించడానికి చర్యలు చేపట్టాలని కోరారు.