‘మియాపూర్’ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై సీఐడీ విచారణ జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. మియాపూర్ భూ కుంభకోణం వ్యవహారంపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం రద్దు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని లొసుగులకు కళ్లెం వేయాలని సూచించారు.
మరోవైపు బెయిల్ కోసం మియాపూర్ భూ కుంభకోణం కేసు నిందితులు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. కాగా, ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా వ్యవహరిస్తున్న గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కోసం 8 బృందాలతో పోలీసులు గాలింపు జరుపుతున్నారు. భార్య, కోడలు, కుటుంబ సభ్యుల పేరుతో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను ఆయన రిజిస్ట్రేషన్ చేయించినట్టు పోలీసులు గుర్తించారు.