goldstone prasad
-
‘గోల్డ్‌స్టోన్’ ప్రసాద్‌కు సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణం కేసుతో గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు సంబంధం లేదని, అతను కనీసం నిందితుడు కూడా కాదని ఉమ్మడి హైకోర్టుకు రాష్ట్రప్రభుత్వం సోమవారం నివేదించింది. అయితే ప్రసాద్ కుటుంబ సభ్యులు, సోదరులు, కంపెనీలు నిందితుల జాబితాలో ఉన్నారని వివరించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఆ వివరాల ఆధారంగా అవసరమైతే అదనపు చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపింది. వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. నిందితులకు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులిచ్చి ఎందుకు విచారించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిందితులను విచారించకుండా అత్యవసరంగా కింది కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాల్సిన అవసరమేమొచ్చిందని నిలదీసింది.చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితులకు కింది కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందో, లేదో వివరాలను తమ ముందుంచాలంది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, సీబీఐతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కుటుంబ సభ్యులు తదితరులను ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. మియాపూర్ భూ కుంభకోణంపై ప్రస్తుతం జరుగుతున్న పోలీసు దర్యాప్తును సీబీఐకి బదలాయించేలా ఆదేశాలివ్వాలంటూ బీజేపీ అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్‌రావు హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవా రం మరోసారి విచారణ జరిపింది.ఈ సందర్భంగా గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కుటుంబ సభ్యుల తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ వ్యాజ్యాన్ని రాజకీయ కారణాలతో దాఖలు చేశారని, పిటిషనర్ పత్రికా సమావేశాలు పెట్టి మరీ తన క్లయింట్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. మీడియాలో ఇష్టమొచ్చినట్లు కథనాలు వస్తున్నాయని ధర్మాసనం మండిపడింది. హైకోర్టు విభజనకు సంబంధించి ఇటీవల కొన్ని పత్రికల్లో, టీవీల్లో (సాక్షి కాదు) వచ్చిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారని, అది శుద్ధ అబద్ధమని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. -
అవి ముమ్మాటికీ ప్రభుత్వ భూములే
కొత్త మలుపు తిరిగిన కేకే భూముల వ్యవహారం ప్రభుత్వానికి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ప్రాథమిక నివేదిక సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుటుంబీకుల భూముల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలోని గోల్డ్‌స్టోన్ ప్రసాద్ నుంచి కొనుగోలు చేసిన 36 ఎకరాలు ప్రభుత్వ భూమేనని జిల్లా యంత్రాంగం తేల్చిచెప్పింది. ఈ భూమి కొను గోలుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీనిపై కేకే వివరణ ఇచ్చిన సం గతి తెలిసిందే. ప్రభుత్వ, రెవెన్యూ యంత్రాంగాల నిరభ్యంతర పత్రాల ఆధారం గానే తాను భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నానని కొన్ని పత్రాలను చూపించి ఆయన ఈ వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో ఇబ్రహీంపట్నం ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌పై తీసుకున్న చర్యలను ఖండించారు. ఇది ముమ్మాటికీప్రైవేటు భూమేనని నిర్ధారించుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని కేకే చెబుతుండగా.. మరోవైపు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం దీనికి విరుద్ధంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ భూములు 22 ఏ కింద ప్రకటించిన ప్రభుత్వ భూములని, రికార్డుల్లో కూడా అలాగే ఉందని స్పష్టం చేస్తూ రాష్ట్ర సర్కారుకు నివేదిక అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలను తీసుకోనుంది. ఈ ప్రాథమిక నివేదిక కేశవరావు కుటుంబీకులకు కొత్త కష్టాలు తెచ్చే విధంగా ఉంది. -
ప్రసాద్ దెబ్బకు బ్యాంకులు బోల్తా
- ఆయన నుంచి భూములు కొని బ్యాంకులకు తాకట్టు - ఏకంగా రూ.550 కోట్ల రుణం పొందిన ఓ వ్యాపారి సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌స్టోన్ ప్రసాద్ చేసిన భూమాయకు బ్యాంకులు కూడా బోల్తా పడ్డాయి. హైదర్‌నగర్ సర్వే నంబర్ 172లోని వివాదాస్పద భూమికి సైతం కోట్లాది రూపాయల రుణం ఇచ్చాయి. నిజాం వారసులు, పైగా, సైరస్ కుటుంబీకులకు సంబంధించిన భూ వివాదం కేసులో ఫైనల్ డిక్రీ రాకున్నా.. ఆ భూములను గోల్డ్‌స్టోన్ ప్రసాద్ అనుయాయులకు కట్టబెట్టడమే కాకుండా, ఇతరులకు కూడా దర్జాగా వాటిని విక్రయించారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్ చెబుతున్న జీపీఏ అసలు ఉందో లేదో పరిశీలించకుండానే కొందరు సబ్ రిజి స్ట్రార్లు ఎడాపెడా రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో భూ అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. మియాపూర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, హైదర్‌నగర్‌లలో వేలాది ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు ప్రైవేటు పరమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా హైదర్‌నగర్‌లోని సర్వే నంబరు 172లోని 196.20 ఎకరాలను దశలవారీగా ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్న వైనాన్ని ‘సాక్షి’ఆదివారం వెలుగులోకి తీసుకు వచ్చింది. ఈ కుంభకోణంలో మరిన్ని కొత్త కోణాలు బయటపడ్డాయి. ఇదీ రుణ మాయాజాలం.. హైదర్‌నగర్ సర్వే నంబరు 172లోని 48 ఎకరాలను గోల్డ్‌స్టోన్ ప్రసాద్ నుంచి నగరానికి చెందిన ఓ జ్యూయలరీ వ్యాపారి కొనుగోలు చేశాడు. ఈ భూమి మొత్తాన్ని తనకు చెందిన 13 సూట్ కేసు కంపెనీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి, ఆ భూములపై పంజాబ్‌కు చెందిన ఓ జాతీయ బ్యాంకు నుంచి రూ.550 కోట్లు రుణంగా పొందాడు. ఆ భూములను బ్యాంకు పేరిట మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్ చేయించాడు. దానిలో పేర్కొన్న వివరాల ప్రకారం గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు ముంబైకి చెందిన సైరస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి జీపీఏ ఉందని, దాని ద్వారా సంక్రమించిన హక్కుల మేరకు విక్రయించినట్లు పేర్కొన్నారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్ పేర్కొన్నట్టు ఆ జీపీఏ నకలు పత్రాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించలేదు. జీపీఏ రిజిస్ట్రేషన్ నంబర్ గానీ, జీపీఏ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగిందన్న వివరాలను కూడా దస్తావేజులో పేర్కొనలేదు. జీపీఏకు సంబంధించిన కనీస వివరాలనూ పరిశీలించకుండా కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడం, ఆ మార్ట్‌గేజ్‌తో జ్యూయలరీ వ్యాపారి బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవడం జరిగిపోయాయి. భూముల కొన్న జ్యూయలరీ వ్యాపారీ గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తేనని, మరికొన్ని భూ కుంభకోణాల్లోనూ అతని పాత్ర ఉందని సమాచారం. -
గోల్డ్‌స్టోన్ ప్రసాద్ మరో భూమాయ!
► హైదర్‌నగర్‌లో రూ.5 వేల కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్ ► 2006లో అసైన్మెంట్ డీడ్‌కు అప్పటి సబ్ రిజిస్ట్రార్ ఒప్పుకోకపోవడంతో రిజిస్ట్రేషన్ పెండింగ్ ► 2013లో సేల్‌డీడ్ కింద పెండింగ్ డాక్యుమెంట్‌ను క్లియర్ చేసిన కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌స్టోన్ ప్రసాద్ చేసిన మరో భూమాయ వెలుగు చూసింది. తాజాగా రూ. ఐదు వేల కోట్ల భూ కుంభకోణం బయటపడింది. హైదరాబాద్ శివారులోని మియాపూర్‌లో రూ. 12 వేల కోట్ల విలువైన 800 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు దండు మైలారం శివారులోని సుమారు రూ. వందల కోట్ల విలువైన రెండు వేల ఎకరాల అటవీ భూములను కాజేసేందుకు కూడా ప్రసాద్ స్కెచ్ వేసిన సంగతి తెలిసిందే.రంగారెడ్డి జిల్లా హైదర్‌నగర్‌లో 196.20 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని 2013 లో ఎంచక్కా తన అనుయాయులకు చెందిన సూట్ కేసు కంపెనీలకు గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ధారా దత్తం చేశాడు. ఆ భూములను తనకు నచ్చిన వారికి కట్టబెట్టాడు. కొంత భూమిని ఇతరులకు కూడా దర్జాగా విక్రయించాడు. ఈ ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు భారీ స్థాయిలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు ప్రాథమికంగా తేలడంతో దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు కమిషనర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ రెండ్రోజులుగా కూకట్పల్లి ఎస్సార్వోలో రికార్డుల ను పరిశీలించి కీలకమైన డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఆయన్ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్ ద్వారా ప్రయ త్నించగా స్విచ్చాఫ్ అని వచ్చింది. ఏడేళ్లుగా పెండింగ్‌లో రిజిస్ట్రేషన్ హైదర్‌నగర్‌లోని సర్వే నంబరు 172లో 192 ఎకరాల ప్రభుత్వ భూమి వివాదం(సీఎస్ 14/1958 భూ వివాదం కేసు)లో నిజాం వారసులు, సైరస్, పైగా కుటుంబీకుల ద్వారా తనకు హక్కులు సంక్రమించాయని, తనకు సంక్రమించిన హక్కులను ట్రినిటీ, సువిశాల్ తదితర కంపెనీలకు బదలాయిస్తూ అసైన్మెంట్ రిజిస్టర్ చేయాలని 2006లో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గోల్డ్‌స్టోన్ ప్రసాద్ 4 దస్తావేజులను సమర్పించాడు. సదరు దస్తావేజులను పరిశీలించిన అప్పటి సబ్ రిజి స్ట్రార్ అసైన్మెంట్ డీడ్‌కు ఉండాల్సిన అర్హతలు లేవని, సేల్డీడ్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అసైన్మెంట్ డీడ్ రిజిస్ట్రేషన్‌కు, సేల్‌డీడ్ రిజిస్ట్రేషన్‌కు మార్కెట్ వ్యాల్యూ, చెల్లించాల్సిన స్టాంప్‌డ్యూటీలో చాలా వ్యత్యాసం ఉండడంతో సదరు రిజిస్ట్రేషన్ల(సి 1,2,3,4/2006)ను పెండింగ్‌లో పెట్టారు. సేల్ డీడ్లుగా రిజిస్ట్రేషన్ చేసే పక్షంలో దాదాపు రూ.30 కోట్లదాకా స్టాంప్‌డ్యూటీ కింద ప్రభు త్వానికి చెల్లించాలి. ఈ విషయంలో ఉన్నతాధి కారులు కూడా సబ్ రిజిస్ట్రార్ అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్‌గా తనకు అనుకూలమైన వ్యక్తి (రాచకొండ శ్రీనివాస రావు) రావడంతో సదరు రిజిస్ట్రేషన్‌ను సేల్ డీడ్గానే చేయించుకున్నాడు. కేవలం 30.60 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించాడు. సబ్ రిజిస్ట్రార్ చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ ఫలితంగా సర్కారుకు సుమారు రూ. 29 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 4 దస్తావేజుల్లో 53 చోట్ల ట్యాంపరింగ్ అసైన్మెంట్ డీడ్లుగా ఏడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న 4 దస్తావేజులను సేల్డీడ్లుగా రిజిస్ట్రేషన్ చేసిన కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఆ దస్తావేజుల్లో 53 చోట్ల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌కు తాజాగా ఫిర్యాదు అందింది. -
ఇంతకీ గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఎక్కడ?
మియాపూర్ భూ కుంభకోణం కేసు విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం రూ. 10వేల కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు ఇప్పటివరకు గుర్తించారు. అయితే ఈ కేసులో మొత్తం అక్రమాలకు సూత్రధారి అయిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ మాత్రం ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతడి కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలింపు జరుపుతున్నారు. భూకుంభకోణం మొత్తం ఇతడి కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. తన భార్య ఇంద్రాణి, కోడలు మహిత, ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో మొత్తం వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను గోల్డ్‌స్టోన్ ప్రసాద్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించారు. కుంభకోణం వెలుగులోకి రాగానే అతడు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లాడు. అతడి భార్య ఇంద్రాణి, కోడలు మహితలపై కూడా కేసులు నమోదయ్యాయి. ట్రినిటీ, సువిశాల సంస్థలలో డైరెక్టర్లంతా ప్రసాద్ కుటుంబ సభ్యులేనని తెలుస్తోంది. గోల్డ్ స్టోన్ ప్రధాన కార్యాయలంలోనే ఈ రెండు సంస్థలు ఉన్నాయి. మెట్రో సంస్థ చెల్లించే పరిహారం కోసమే గోల్డ్‌స్టోన్ భూములను రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలిసింది. అమీరున్నీసా బేగంకు రూ. 10 లక్షలు మాత్రమే ఇచ్చి భూమి రిజిస్టర్ చేయించుకున్నారు. అలాగే సబ్ రిజిస్ట్రార్లకు రూ. 50 కోట్ల వరకు లంచం ఇచ్చి 693 ఎకరాలు రిజిస్టర్ చేయించుకున్నారు. ప్రధాన నగరాల్లో ప్రసాద్ కోసం గాలింపు జరుగుతోంది. మరో సబ్ రిజిస్ట్రార్ అరెస్టు ఇక ఇదే కేసులో బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ యూసుఫ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు మొత్తం ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. భూమాఫియాకు వీరు ముగ్గురు సహకరించారని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల మీద పోలీసులు దాడులు చేశారు. అప్లోడ్ కాని రిజిస్ట్రేషన్ల వివరాలు సేకరించారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. కిలో బంగారం స్వాధీనం సబ్ రిజిస్ట్రార్ రవిచంద్రారెడ్డి ఇంటి మీద ఏసీబీ దాడులు చేసింది. ఈ సందర్భంగా కిలో బంగారం, రూ. 2 లక్షల నగదు, విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన మియాపూర్ భూకుంభోకణంలో అరెస్టయ్యారు. -
‘మియాపూర్’ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు
-
‘మియాపూర్’ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై సీఐడీ విచారణ జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. మియాపూర్ భూ కుంభకోణం వ్యవహారంపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం రద్దు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని లొసుగులకు కళ్లెం వేయాలని సూచించారు. మరోవైపు బెయిల్ కోసం మియాపూర్ భూ కుంభకోణం కేసు నిందితులు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. కాగా, ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా వ్యవహరిస్తున్న గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కోసం 8 బృందాలతో పోలీసులు గాలింపు జరుపుతున్నారు. భార్య, కోడలు, కుటుంబ సభ్యుల పేరుతో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను ఆయన రిజిస్ట్రేషన్ చేయించినట్టు పోలీసులు గుర్తించారు.