గోల్డ్‌స్టోన్ ప్రసాద్ మరో భూమాయ!
► హైదర్‌నగర్‌లో రూ.5 వేల కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్
► 2006లో అసైన్‌మెంట్ డీడ్‌కు అప్పటి సబ్ రిజిస్ట్రార్ ఒప్పుకోకపోవడంతో రిజిస్ట్రేషన్ పెండింగ్
► 2013లో సేల్‌డీడ్ కింద పెండింగ్ డాక్యుమెంట్‌ను క్లియర్ చేసిన కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌స్టోన్ ప్రసాద్ చేసిన మరో భూమాయ వెలుగు చూసింది. తాజాగా రూ. ఐదు వేల కోట్ల భూ కుంభకోణం బయటపడింది. హైదరాబాద్ శివారులోని మియాపూర్‌లో రూ. 12 వేల కోట్ల విలువైన 800 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు దండు మైలారం శివారులోని సుమారు రూ. వందల కోట్ల విలువైన రెండు వేల ఎకరాల అటవీ భూములను కాజేసేందుకు కూడా ప్రసాద్ స్కెచ్ వేసిన సంగతి తెలిసిందే.రంగారెడ్డి జిల్లా హైదర్‌నగర్‌లో 196.20 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని 2013 లో ఎంచక్కా తన అనుయాయులకు చెందిన సూట్ కేసు కంపెనీలకు గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ధారా దత్తం చేశాడు.
ఆ భూములను తనకు నచ్చిన వారికి కట్టబెట్టాడు. కొంత భూమిని ఇతరులకు కూడా దర్జాగా విక్రయించాడు. ఈ ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు భారీ స్థాయిలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు ప్రాథమికంగా తేలడంతో దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు కమిషనర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ రెండ్రోజులుగా కూకట్‌పల్లి ఎస్సార్వోలో రికార్డుల ను పరిశీలించి కీలకమైన డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఆయన్ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్ ద్వారా ప్రయ త్నించగా స్విచ్చాఫ్ అని వచ్చింది.
ఏడేళ్లుగా పెండింగ్‌లో రిజిస్ట్రేషన్
హైదర్‌నగర్‌లోని సర్వే నంబరు 172లో 192 ఎకరాల ప్రభుత్వ భూమి వివాదం(సీఎస్ 14/1958 భూ వివాదం కేసు)లో నిజాం వారసులు, సైరస్, పైగా కుటుంబీకుల ద్వారా తనకు హక్కులు సంక్రమించాయని, తనకు సంక్రమించిన హక్కులను ట్రినిటీ, సువిశాల్ తదితర కంపెనీలకు బదలాయిస్తూ అసైన్‌మెంట్ రిజిస్టర్ చేయాలని 2006లో కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గోల్డ్‌స్టోన్ ప్రసాద్ 4 దస్తావేజులను సమర్పించాడు.
సదరు దస్తావేజులను పరిశీలించిన అప్పటి సబ్ రిజి స్ట్రార్ అసైన్‌మెంట్ డీడ్‌కు ఉండాల్సిన అర్హతలు లేవని, సేల్‌డీడ్‌లుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అసైన్‌మెంట్ డీడ్ రిజిస్ట్రేషన్‌కు, సేల్‌డీడ్ రిజిస్ట్రేషన్‌కు మార్కెట్ వ్యాల్యూ, చెల్లించాల్సిన స్టాంప్‌డ్యూటీలో చాలా వ్యత్యాసం ఉండడంతో సదరు రిజిస్ట్రేషన్ల(సి 1,2,3,4/2006)ను పెండింగ్‌లో పెట్టారు. సేల్ డీడ్‌లుగా రిజిస్ట్రేషన్ చేసే పక్షంలో దాదాపు రూ.30 కోట్లదాకా స్టాంప్‌డ్యూటీ కింద ప్రభు త్వానికి చెల్లించాలి.
ఈ విషయంలో ఉన్నతాధి కారులు కూడా సబ్ రిజిస్ట్రార్ అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్‌గా తనకు అనుకూలమైన వ్యక్తి (రాచకొండ శ్రీనివాస రావు) రావడంతో సదరు రిజిస్ట్రేషన్‌ను సేల్ డీడ్‌గానే చేయించుకున్నాడు. కేవలం 30.60 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించాడు. సబ్ రిజిస్ట్రార్ చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ ఫలితంగా సర్కారుకు సుమారు రూ. 29 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
4 దస్తావేజుల్లో 53 చోట్ల ట్యాంపరింగ్
అసైన్‌మెంట్ డీడ్‌లుగా ఏడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న 4 దస్తావేజులను సేల్‌డీడ్‌లుగా రిజిస్ట్రేషన్ చేసిన కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఆ దస్తావేజుల్లో 53 చోట్ల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌కు తాజాగా ఫిర్యాదు అందింది.