తనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ డీఎస్పీ సునితారెడ్డి
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు
- పలు కంపెనీల్లో కోట్ల రూపాయల పెట్టుబడులు
- మొత్తం ఆస్తుల విలువ రూ.150 కోట్ల పైనే..
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాస్‌రావు ఇళ్లపై, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. మంగళవారం బోయిన్‌పల్లి, అల్వాల్‌లోని శ్రీనివాస్‌రావు నివాసాలతోపాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌రావు ఆయన కుమారుడు కనిష్క పలు కంపెనీలు స్థాపించి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారని ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. హాసిని పవర్ ప్రాజెక్ట్, జయశ్రీ ఎంటర్‌ప్రైజెస్, పద్మనాభ ఎంటర్ ప్రైజెస్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీలు స్థాపించినట్టు ఏసీబీ తెలిపింది. అక్రమార్జనను 12 బ్యాంకు ఖాతాల ద్వారా జరిపినట్టు బయటపెట్టింది.
హాసిని పవర్ ప్రాజెక్ట్‌లో రూ.1.90 కోట్లు, నార్త్ స్టార్ హోమ్స్ కంపెనీలో రూ.1.93 కోట్లు, మంజీరా హోల్డింగ్స్‌లో రూ.50 లక్షలు, ఐకాన్ కన్‌స్ట్రక్షన్‌లో రూ.8.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు ఏసీబీ తెలిపింది. శ్రీనివాస్‌రావు తన బినామీల పేరిట రూ.1.27 కోట్ల విలువైన ఆరు ఇళ్ల స్థలాలు కూడబెట్టారు. అదే విధంగా మూసాపేట్‌లో రూ.11లక్షల విలువైన 11 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా శ్రీనివాస్‌రావు ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ.150 కోట్ల వరకు ఉంటాయని ఏసీబీ అభిప్రాయపడింది.
భార్య మృతిచెందినా బ్యాంకు లావాదేవీలు
శ్రీనివాస్‌రావుకే చెందిన అల్వాల్ సత్యసాయి కాలనీలోని ఇంట్లో కూడా మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సునీతరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. సునీత తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్‌రావు ఇంట్లో నుండి పలు బ్యాంక్‌లకు చెందిన పాస్ పుస్తకాలు, దస్తావేజులు, 17 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌రావు భార్య జయశ్రీ మృతి చెందినప్పటికి ఆమె పేరుమీద ఇప్పటికీ బ్యాంక్ లావాదేవీలు జరగడం విశేషం. శ్రీనివాస్‌రావు భార్య, కొడుకు, తోడల్లుడు పేర్ల మీద డొల్ల కంపెనీలు సృష్టించారని తెలుస్తోంది.
సోదరుడి ఇంట్లోనూ సోదాలు
కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావు సోదరుడి ఇంట్లో కూడా మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేపీహెచ్‌బి కాలనీలో ఉన్న శ్రీనివాసరావు రెండవ సోదరుడు నాగేందర్ నివాసంలో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పలు ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఏసీబీ డీఎస్‌పీ, సీఐలతో పాటు పలువురు అధికారులు ఈ సోదాలలో పాల్గొన్నారు.