Illegal registration
-
టీవీ 5 బీఆర్ నాయుడు నిర్వాకం.. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో అక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. సొసైటీ ప్రెసిడెంట్ బి. రవీంద్రనాథ్ (టీవీ–5 అధిపతి బీఆర్ నాయుడు), ట్రెజరర్ పి.నాగరాజులు సొసైటీ బైలాస్కు విరుద్ధంగా, కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా విలువైన స్థలాన్ని ప్రముఖ హీరో కొణిదెల చిరంజీవికి విక్రయించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లోని ప్లాట్ నంబర్–303–ఎన్లో చిరంజీవికి 3,333 గజాల స్థలంలో ఇల్లు ఉంది. దాన్ని ఆనుకొని వెనుక భాగంలో షేక్‌పేటలోని కొత్త సర్వే నంబర్ 120 (పాత సర్వే నంబర్ 403/1), హకీంపేట గ్రామంలోని సర్వే నంబర్ 102/1లోని 595 గజాల అదనపు స్థలాన్ని (అడిషినల్ ల్యాండ్) అక్రమంగా చిరంజీవికి రిజిస్ట్రేషన్ చేశారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ గజానికి రూ. 4 లక్షలపైనే పలుకుతుండగా ప్రభుత్వ ధర ప్రకారం రూ. 64 వేల చొప్పున రిజిస్ట్రేషన్ చేశారు. అంటే రూ. 23.80 కోట్లు విలువజేసే స్థలాన్ని కేవలం రూ. రూ. 3.80 కోట్లకే అప్పగించి ప్రతిఫలంగా మిగిలిన సొమ్ములో పెద్ద మొత్తంలోనే దండుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలక వర్గం అక్రమాలపై సొసైటీ సభ్యులు ప్రభాకర్‌రావు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌కు, విజిలెన్స్, కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్లకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం షేక్‌పేట మండల సర్వేయర్ సాయికాంత్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ రాజేశం క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు చేపట్టారు. సొసైటీ మీటింగ్‌లోనూ చెప్పలేదు ఇది ప్రభుత్వ స్థలమని, రోడ్డు ఆక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ప్రభాకర్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా సొసైటీలోని కొందరు అక్రమంగా ఈ రిజిస్ట్రేషన్ చేశారన్నారు. సబ్ రిజిస్ట్రార్‌కు తెలిసే ఈ తతంగం జరిగిందని, సొసైటీ లేఔట్‌ను పరిశీలించకుండానే దీన్ని రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఈ ప్రక్రియలో కో–ఆపరేటివ్ నిబంధనలను తుంగలో తొక్కారని ఆయన దుయ్యబట్టారు. సొసైటీ జనరల్ బాడీ మీటింగ్‌లోనూ రిజిస్ట్రేషన్ సంగతి సభ్యులకు ప్రెసిడెంట్, ట్రెజరర్ తెలియజేయలేదని ఆరోపించారు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఫిర్యాదు చేసినప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎవరు చేస్తున్నారో వాళ్ల నంబర్లు కూడా కనిపించట్లేదు. వెంటనే ఫిర్యాదు ఉపసంహరించుకోకపోతే ప్రాణాలకు ముప్పు ఉంటుందని బెదిరిస్తున్నారు. బెదిరింపు కాల్స్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తా. – ప్రభాకర్‌రావు, సొసైటీ సభ్యుడు -
వెలుగు చూసిన టీడీపీ నేతల దురా‘గతం’.. అసలేం జరిగిందంటే?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గత ప్రభుత్వ హయాంలో జరిగిన టీడీపీ నేతల కబ్జా బాగోతం ఇది. అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.కోట్ల విలువ చేసే భూమిని తెలుగు తమ్ముళ్లు కాజేశారు. అధికారులను భయపెట్టి ఆ స్థలంలో నిర్మాణాలూ చేపట్టారు. పన్నులూ వేయించారు. పన్ను రశీదుల ఆధారంగా వేరొకరికి అమ్మేందుకు తెగబడ్డారు. ఈ దురాగతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చదవండి: మంత్రి పేర్ని నానితో వర్మ భేటీకి డేట్ ఫిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి కూత వేటు దూరంలో ఉన్న తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని 351–3 సర్వే నంబరులో 32.50 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిలో 20 ఏళ్ల కిందట కొంతమంది పేదలకు 5 ఎకరాల మేర ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. మరో 10 ఎకరాలలో చెరువు ఉంది. ఇంకా 17.50 ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఇందులో 60 సెంట్ల భూమిపై అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత మాదల శ్రీను, తూణగంటి వెంకటరమణ, సింహాద్రి సాంబశివరావు కన్ను పడింది. 30 సెంట్లు కబ్జా చేసిన మాదల శ్రీను గత ప్రభుత్వ హయాంలో మాదల శ్రీను తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, మందడం గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడిగా పనిచేశారు. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని 351–3 సర్వే నంబర్లో ఉన్న సుమారు రూ.1.80 కోట్ల విలువైన 30 సెంట్ల భూమిని ఆక్రమించాడు. అప్పటి ప్రభుత్వంలో అధికారులను బెదిరించి ఇంటి పన్ను, నీటి పన్ను వేయించుకున్నాడు. రెండు నెలల కిందట ఈ స్థలాన్ని మరో వ్యక్తికి అమ్మి మందడం రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌కు యత్నించాడు. విషయం తెలుసుకున్న గ్రామ కార్యదర్శి ఇంటి పన్ను ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయకూడదని అభ్యంతరం తెలుపుతూ మందడం సబ్ రిజిస్టార్కు లేఖ రాశారు. దీంతో శ్రీను ఎనీవేర్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని అడ్డంపెట్టుకొని మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో కొంత భూమిని మరో వ్యక్తికి అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేసి మరో కొంత భూమిని నోటరీ చేశాడు. మాదల శ్రీనుకు అప్పటి తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. 2018లో ఈ భూమిలోని నిర్మాణానికి ఇంటి పన్ను వేయడం లేదంటూ మందడం పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి కార్యదర్శిపై మాదాల శ్రీను దాడి చేశాడు కూడా. దీనిపై తుళ్లూరు పోలిస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయింది. మాదాల శ్రీను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతాడనే ఆరోపణలు గ్రామంలో వినిపిస్తున్నాయి. మరో ఇద్దరి స్వాదీనంలో 30 సెంట్లు ఇదే సర్వేనంబర్‌లోని మరో 30 సెంట్ల భూమిని తెలుగుదేశం పార్టీ నేతలు తూణగంటి వెంకట రమణ, సింహాద్రి సాంబశివరావు ఆక్రమించారు. చెరొక 15 సెంట్లు స్వా«దీనం చేసుకున్నారు. దీనిలో రేకుల షెడ్డు వేశారు. వీరికి అప్పటి టీడీపీ పెద్దల అండ ఉండడంతో స్థలాన్ని వీరి పేరుపై రిజి్రస్టేషన్ కూడా చేసుకున్నారు. వీరిద్దరికీ ప్రస్తుతం స్థలం విషయంలో వివాదం వచ్చింది. దీంతో వారం కిందట తుళ్ళూరు పోలీసులను ఆశ్రయించారు. అది ప్రభుత్వ భూమే దీనిపై మందడం పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునరావును వివరణ అడగ్గా అది ప్రభుత్వ భూమి అని తెలిపారు. ఆక్రమిత స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరిక బోర్డు పెట్టినట్టు వెల్లడించారు. స్థలం అక్రమ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఉన్నతాధికారుల సూచనతో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 60సెంట్ల భూమి విలువ సుమారు రూ.3.60 కోట్లు ఉంటుందని అంచనా. -
నకిలీ ఆధార్‌తో రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: ఇరవై మూడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరిట నకిలీ ఆధార్ కార్డు సృష్టించి, ఆయన పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిపిన వైనం తాజాగా బయటపడింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ చిరంజీవులు చొరవతో ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు పట్టణంలోని హరినాథపురానికి చెందిన కె.ప్రకాశ్‌రావు 1996, మేలో చనిపోయారు. ఆయన మరణించినట్టు అదే ఏడాది జూన్‌లో మరణ ధ్రువీకరణ పత్రం కూడా రిజిస్టర్ అయింది. కానీ ఆయన బతికే ఉన్నట్టు ఆధార్ కార్డు సృష్టించిన అక్రమార్కులు దాని సాయంతో కూకట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సేల్‌డీడ్ నంబర్: 1953/2019 ద్వారా హైదరనగర్‌లోని 300 చదరపు గజాల ఫ్లాట్‌ను ఈ ఏడాది మార్చిలో రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత 45 రోజుల వ్యవధిలో అవే దస్తావేజులను మరో రెండు సార్లు రిజిస్టర్ చేశారు. విషయం ఐజీ చిరంజీవులు దృష్టికి తీసుకెళ్లడంతో కూకట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ జహంగీర్ చేత కూకట్పల్లి పీఎస్‌లో కేసు నమోదు చేయించారు. విచారణకు సహకరించేందుకు వీలుగా సదరు సబ్‌రిజిస్ట్రార్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో శామీర్‌పేట సబ్‌రిజిస్ట్రార్ శేషగిరిచంద్‌ను ఇన్చార్జిగా నియమించారు. పరిశీలించుకోండి: ఐజీ చిరంజీవులు ఈ ఘటన నేపథ్యంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస స్థలాలకు సంబంధించి క్రయ విక్రయ లావాదేవీలు జరిపినప్పుడు, ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించుకోవాలని ఐజీ చిరంజీవులు సూచించారు. అమ్మినవారు సరైన వారా కాదా అనే విషయాన్ని చూసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
గోల్డ్‌స్టోన్ ప్రసాద్ మరో భూమాయ!
► హైదర్‌నగర్‌లో రూ.5 వేల కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్ ► 2006లో అసైన్మెంట్ డీడ్‌కు అప్పటి సబ్ రిజిస్ట్రార్ ఒప్పుకోకపోవడంతో రిజిస్ట్రేషన్ పెండింగ్ ► 2013లో సేల్‌డీడ్ కింద పెండింగ్ డాక్యుమెంట్‌ను క్లియర్ చేసిన కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌స్టోన్ ప్రసాద్ చేసిన మరో భూమాయ వెలుగు చూసింది. తాజాగా రూ. ఐదు వేల కోట్ల భూ కుంభకోణం బయటపడింది. హైదరాబాద్ శివారులోని మియాపూర్‌లో రూ. 12 వేల కోట్ల విలువైన 800 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు దండు మైలారం శివారులోని సుమారు రూ. వందల కోట్ల విలువైన రెండు వేల ఎకరాల అటవీ భూములను కాజేసేందుకు కూడా ప్రసాద్ స్కెచ్ వేసిన సంగతి తెలిసిందే.రంగారెడ్డి జిల్లా హైదర్‌నగర్‌లో 196.20 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని 2013 లో ఎంచక్కా తన అనుయాయులకు చెందిన సూట్ కేసు కంపెనీలకు గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ధారా దత్తం చేశాడు. ఆ భూములను తనకు నచ్చిన వారికి కట్టబెట్టాడు. కొంత భూమిని ఇతరులకు కూడా దర్జాగా విక్రయించాడు. ఈ ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు భారీ స్థాయిలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు ప్రాథమికంగా తేలడంతో దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు కమిషనర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ రెండ్రోజులుగా కూకట్పల్లి ఎస్సార్వోలో రికార్డుల ను పరిశీలించి కీలకమైన డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఆయన్ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్ ద్వారా ప్రయ త్నించగా స్విచ్చాఫ్ అని వచ్చింది. ఏడేళ్లుగా పెండింగ్‌లో రిజిస్ట్రేషన్ హైదర్‌నగర్‌లోని సర్వే నంబరు 172లో 192 ఎకరాల ప్రభుత్వ భూమి వివాదం(సీఎస్ 14/1958 భూ వివాదం కేసు)లో నిజాం వారసులు, సైరస్, పైగా కుటుంబీకుల ద్వారా తనకు హక్కులు సంక్రమించాయని, తనకు సంక్రమించిన హక్కులను ట్రినిటీ, సువిశాల్ తదితర కంపెనీలకు బదలాయిస్తూ అసైన్మెంట్ రిజిస్టర్ చేయాలని 2006లో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గోల్డ్‌స్టోన్ ప్రసాద్ 4 దస్తావేజులను సమర్పించాడు. సదరు దస్తావేజులను పరిశీలించిన అప్పటి సబ్ రిజి స్ట్రార్ అసైన్మెంట్ డీడ్‌కు ఉండాల్సిన అర్హతలు లేవని, సేల్డీడ్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అసైన్మెంట్ డీడ్ రిజిస్ట్రేషన్‌కు, సేల్‌డీడ్ రిజిస్ట్రేషన్‌కు మార్కెట్ వ్యాల్యూ, చెల్లించాల్సిన స్టాంప్‌డ్యూటీలో చాలా వ్యత్యాసం ఉండడంతో సదరు రిజిస్ట్రేషన్ల(సి 1,2,3,4/2006)ను పెండింగ్‌లో పెట్టారు. సేల్ డీడ్లుగా రిజిస్ట్రేషన్ చేసే పక్షంలో దాదాపు రూ.30 కోట్లదాకా స్టాంప్‌డ్యూటీ కింద ప్రభు త్వానికి చెల్లించాలి. ఈ విషయంలో ఉన్నతాధి కారులు కూడా సబ్ రిజిస్ట్రార్ అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్‌గా తనకు అనుకూలమైన వ్యక్తి (రాచకొండ శ్రీనివాస రావు) రావడంతో సదరు రిజిస్ట్రేషన్‌ను సేల్ డీడ్గానే చేయించుకున్నాడు. కేవలం 30.60 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించాడు. సబ్ రిజిస్ట్రార్ చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ ఫలితంగా సర్కారుకు సుమారు రూ. 29 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 4 దస్తావేజుల్లో 53 చోట్ల ట్యాంపరింగ్ అసైన్మెంట్ డీడ్లుగా ఏడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న 4 దస్తావేజులను సేల్డీడ్లుగా రిజిస్ట్రేషన్ చేసిన కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఆ దస్తావేజుల్లో 53 చోట్ల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌కు తాజాగా ఫిర్యాదు అందింది. -
ఆ ఊళ్లో.. మూడొంతులు ఆయనదే!
- అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న సబ్ రిజిస్ట్రార్లు - మియాపూర్‌లో 70శాతం భూమి ఒక వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ - చుట్టూ ఉన్న మరో ఏడు గ్రామాలూ వారివేనట - హక్కుల బదలాయింపును రిజిస్ట్రేషన్ చేసిన బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ - 600 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ - సీరియస్‌గా స్పందించిన సీఎంవో.. అక్రమ రిజిస్ట్రేషన్లపై చర్యలకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్ శివార్లలోని మియాపూర్ గ్రామం.. ఆ గ్రామంలోని 70 శాతానికిపైగా భూములు ఒకే వ్యక్తికి చెందినవంటూ రిజిస్ట్రేషన్ చేసేశారు. అంతేకాదు పరిసరాల్లోని మరో ఏడు గ్రామాల్లోని భూములపైనా హక్కులు కల్పించారు.. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ ఎలాంటి సందేహం వ్యక్తం చేయకుండా రిజిస్ట్రేషన్ చేసేయడం.. చివరికి స్టాంపు డ్యూటీని కూడా మినహాయించారు.. వినడానికి చిత్రంగా ఉన్నా.. డాక్యుమెంట్లపరంగా ఇది పక్కా వాస్తవం. మియాపూర్ గ్రామంలోనే సుమారు 600 ఎకరాల ప్రభుత్వ భూమిని కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన సంగతి ఇటీవలే బయటపడడం గమనార్హం. ఎన్నో అవకతవకలు.. సనత్‌నగర్‌కు చెందిన హిమయతున్నిసా బేగం అనే మహిళ ఇటీవల బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రిజిస్ట్రేషన్లు చేయించారు. మియాపూర్ గ్రామంలోని 70 శాతం భూములతో పాటు పరిసర ఏడు గ్రామాలపై తమకు షనద్ హక్కులు ఉన్నాయని.. ఆ హక్కులను షఫ్లీగంజ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షఫిల్‌కు బదలాయిస్తున్నామని ఆ రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. పత్రాలను పరిశీలించిన బాలనగర్ సబ్ రిజిస్ట్రార్ ఎటువంటి సందేహాన్ని వ్యక్తం చేయకుండా గతేడాది జనవరి 18న రిజిస్ట్రేషన్ చేసేశారు. అంతేకాదు బుక్–1లో నమోదు చేయాల్సిన ఈ వివరాలను ఇతరులకు తెలియకుండా ఉండేందుకు బుక్–4లో నమోదు చేశారు. డాక్యుమెంట్ నంబర్ 23/బుక్4/2016 ప్రకారం సదరు ఆస్తి విలువను రూ.15 లక్షలుగా పేర్కొన్నారు. కానీ ఈ స్థిరాస్తికి మార్కెట్ విలువ ఏమీ లేదని చూపుతూ... స్టాంపుడ్యూటీని పూర్తిగా మినహాయించడం గమనార్హం. ఈ ఉదంతంపై సమాచారం అందిన రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్ల తీరుకు నివ్వెరపోతున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లపై సీఎంవో నజర్ కూకట్పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ల అక్రమాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కార్యాలయం చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. దీంతో సదరు అక్రమార్కులపై చర్యలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్చార్జి కమిషనర్ అనిల్‌కుమార్ ఉన్నతాధికారులతో చర్చించారు. బాలానగర్ ఉదంతంతో పాటు సీఎంవో నుంచి మరో 29 ఫిర్యాదులు అందాయని, వాటిపై తక్షణం విచారణ చేపట్టాలని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల డీఐజీలను ఆదేశించారు. సీఎంవో నుంచి అందిన ఫిర్యాదుల్లో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్‌పై 9, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్‌పై 15, ఎల్బీనగర్ మాజీ సబ్ రిజిస్ట్రార్‌పై 5 ఫిర్యాదులు ఉన్నట్లు తెలిసింది. ముమ్మరంగా తనిఖీలు: మహమూద్ అలీ రిజిస్ట్రేషన్ల శాఖ అక్రమాలను నిరోధించేం దుకు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. స్పెషల్ సీఎస్ బీఆర్ మీనా, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను తరచూ సందర్శించి.. రికార్డులను తనిఖీలు చేయాలని సూచించారు. బుక్–1లో చేయాల్సిన రిజిస్ట్రేష న్లను బుక్–4లో చేస్తూ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రిమినల్ కేసులు పెడతాం.. ‘‘రంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం కావడంపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాం. ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన అమీరున్నీసా బేగం, రిజిస్ట్రేషన్ చేయించుకున్న ట్రినిటీ ఇన్ఫ్రా ప్రతినిధి పార్థసారథి, సువిశాల్ పవర్ కంపెనీ ప్రతినిధి పీవీఎస్ శర్మలపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నాం..’’ – రఘునందన్రావురంగారెడ్డి జిల్లా కలెక్టర్