ఆ ఊళ్లో.. మూడొంతులు ఆయనదే!
- అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న సబ్ రిజిస్ట్రార్లు
- మియాపూర్‌లో 70శాతం భూమి ఒక వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్
- చుట్టూ ఉన్న మరో ఏడు గ్రామాలూ వారివేనట
- హక్కుల బదలాయింపును రిజిస్ట్రేషన్ చేసిన బాలానగర్ సబ్ రిజిస్ట్రార్
- 600 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్
- సీరియస్‌గా స్పందించిన సీఎంవో.. అక్రమ రిజిస్ట్రేషన్లపై చర్యలకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్ శివార్లలోని మియాపూర్ గ్రామం.. ఆ గ్రామంలోని 70 శాతానికిపైగా భూములు ఒకే వ్యక్తికి చెందినవంటూ రిజిస్ట్రేషన్ చేసేశారు. అంతేకాదు పరిసరాల్లోని మరో ఏడు గ్రామాల్లోని భూములపైనా హక్కులు కల్పించారు.. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ ఎలాంటి సందేహం వ్యక్తం చేయకుండా రిజిస్ట్రేషన్ చేసేయడం.. చివరికి స్టాంపు డ్యూటీని కూడా మినహాయించారు.. వినడానికి చిత్రంగా ఉన్నా.. డాక్యుమెంట్లపరంగా ఇది పక్కా వాస్తవం. మియాపూర్ గ్రామంలోనే సుమారు 600 ఎకరాల ప్రభుత్వ భూమిని కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన సంగతి ఇటీవలే బయటపడడం గమనార్హం.
ఎన్నో అవకతవకలు..
సనత్‌నగర్‌కు చెందిన హిమయతున్నిసా బేగం అనే మహిళ ఇటీవల బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రిజిస్ట్రేషన్లు చేయించారు. మియాపూర్ గ్రామంలోని 70 శాతం భూములతో పాటు పరిసర ఏడు గ్రామాలపై తమకు షనద్ హక్కులు ఉన్నాయని.. ఆ హక్కులను షఫ్లీగంజ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షఫిల్‌కు బదలాయిస్తున్నామని ఆ రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. పత్రాలను పరిశీలించిన బాలనగర్ సబ్ రిజిస్ట్రార్ ఎటువంటి సందేహాన్ని వ్యక్తం చేయకుండా గతేడాది జనవరి 18న రిజిస్ట్రేషన్ చేసేశారు. అంతేకాదు బుక్–1లో నమోదు చేయాల్సిన ఈ వివరాలను ఇతరులకు తెలియకుండా ఉండేందుకు బుక్–4లో నమోదు చేశారు. డాక్యుమెంట్ నంబర్ 23/బుక్4/2016 ప్రకారం సదరు ఆస్తి విలువను రూ.15 లక్షలుగా పేర్కొన్నారు. కానీ ఈ స్థిరాస్తికి మార్కెట్ విలువ ఏమీ లేదని చూపుతూ... స్టాంపుడ్యూటీని పూర్తిగా మినహాయించడం గమనార్హం. ఈ ఉదంతంపై సమాచారం అందిన రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్ల తీరుకు నివ్వెరపోతున్నారు.
అక్రమ రిజిస్ట్రేషన్లపై సీఎంవో నజర్
కూకట్‌పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ల అక్రమాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కార్యాలయం చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. దీంతో సదరు అక్రమార్కులపై చర్యలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌చార్జి కమిషనర్ అనిల్‌కుమార్ ఉన్నతాధికారులతో చర్చించారు. బాలానగర్ ఉదంతంతో పాటు సీఎంవో నుంచి మరో 29 ఫిర్యాదులు అందాయని, వాటిపై తక్షణం విచారణ చేపట్టాలని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల డీఐజీలను ఆదేశించారు. సీఎంవో నుంచి అందిన ఫిర్యాదుల్లో కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్‌పై 9, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్‌పై 15, ఎల్బీనగర్ మాజీ సబ్ రిజిస్ట్రార్‌పై 5 ఫిర్యాదులు ఉన్నట్లు తెలిసింది.
ముమ్మరంగా తనిఖీలు: మహమూద్ అలీ
రిజిస్ట్రేషన్ల శాఖ అక్రమాలను నిరోధించేం దుకు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. స్పెషల్ సీఎస్ బీఆర్ మీనా, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను తరచూ సందర్శించి.. రికార్డులను తనిఖీలు చేయాలని సూచించారు. బుక్–1లో చేయాల్సిన రిజిస్ట్రేష న్లను బుక్–4లో చేస్తూ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
క్రిమినల్ కేసులు పెడతాం..
‘‘రంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం కావడంపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాం. ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన అమీరున్నీసా బేగం, రిజిస్ట్రేషన్ చేయించుకున్న ట్రినిటీ ఇన్‌ఫ్రా ప్రతినిధి పార్థసారథి, సువిశాల్ పవర్ కంపెనీ ప్రతినిధి పీవీఎస్ శర్మలపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నాం..’’
– రఘునందన్‌రావురంగారెడ్డి జిల్లా కలెక్టర్