
సాక్షి, హైదరాబాద్: ఇరవై మూడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరిట నకిలీ ఆధార్ కార్డు సృష్టించి, ఆయన పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిపిన వైనం తాజాగా బయటపడింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ చిరంజీవులు చొరవతో ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు పట్టణంలోని హరినాథపురానికి చెందిన కె.ప్రకాశ్‌రావు 1996, మేలో చనిపోయారు. ఆయన మరణించినట్టు అదే ఏడాది జూన్‌లో మరణ ధ్రువీకరణ పత్రం కూడా రిజిస్టర్ అయింది. కానీ ఆయన బతికే ఉన్నట్టు ఆధార్ కార్డు సృష్టించిన అక్రమార్కులు దాని సాయంతో కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సేల్‌డీడ్ నంబర్: 1953/2019 ద్వారా హైదరనగర్‌లోని 300 చదరపు గజాల ఫ్లాట్‌ను ఈ ఏడాది మార్చిలో రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత 45 రోజుల వ్యవధిలో అవే దస్తావేజులను మరో రెండు సార్లు రిజిస్టర్ చేశారు. విషయం ఐజీ చిరంజీవులు దృష్టికి తీసుకెళ్లడంతో కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ జహంగీర్ చేత కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు చేయించారు. విచారణకు సహకరించేందుకు వీలుగా సదరు సబ్‌రిజిస్ట్రార్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో శామీర్‌పేట సబ్‌రిజిస్ట్రార్ శేషగిరిచంద్‌ను ఇన్‌చార్జిగా నియమించారు.
పరిశీలించుకోండి: ఐజీ చిరంజీవులు
ఈ ఘటన నేపథ్యంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస స్థలాలకు సంబంధించి క్రయ విక్రయ లావాదేవీలు జరిపినప్పుడు, ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించుకోవాలని ఐజీ చిరంజీవులు సూచించారు. అమ్మినవారు సరైన వారా కాదా అనే విషయాన్ని చూసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment