‘గోల్డ్‌స్టోన్‌’ ప్రసాద్‌కు సంబంధం లేదు | Sarkar in the high court on Miyapur land scam | Sakshi
Sakshi News home page

‘గోల్డ్‌స్టోన్‌’ ప్రసాద్‌కు సంబంధం లేదు

Published Tue, Nov 28 2017 1:05 AM | Last Updated on Thu, May 9 2024 1:45 PM

Sarkar in the high court on Miyapur land scam

సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూ కుంభకోణం కేసుతో గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌కు సంబంధం లేదని, అతను కనీసం నిందితుడు కూడా కాదని ఉమ్మడి హైకోర్టుకు రాష్ట్రప్రభుత్వం సోమవారం నివేదించింది. అయితే ప్రసాద్‌ కుటుంబ సభ్యులు, సోదరులు, కంపెనీలు నిందితుల జాబితాలో ఉన్నారని వివరించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఆ వివరాల ఆధారంగా అవసరమైతే అదనపు చార్జిషీట్‌ దాఖలు చేస్తామని తెలిపింది. వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. నిందితులకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 కింద నోటీసులిచ్చి ఎందుకు విచారించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిందితులను విచారించకుండా అత్యవసరంగా కింది కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాల్సిన అవసరమేమొచ్చిందని నిలదీసింది.

చార్జిషీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితులకు కింది కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిందో, లేదో వివరాలను తమ ముందుంచాలంది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, సీబీఐతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ కుటుంబ సభ్యులు తదితరులను ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. మియాపూర్‌ భూ కుంభకోణంపై ప్రస్తుతం జరుగుతున్న పోలీసు దర్యాప్తును సీబీఐకి బదలాయించేలా ఆదేశాలివ్వాలంటూ బీజేపీ అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్‌రావు హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవా రం మరోసారి విచారణ జరిపింది.

ఈ సందర్భంగా గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ కుటుంబ సభ్యుల తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ వ్యాజ్యాన్ని రాజకీయ కారణాలతో దాఖలు చేశారని, పిటిషనర్‌ పత్రికా సమావేశాలు పెట్టి మరీ తన క్లయింట్‌ల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. మీడియాలో ఇష్టమొచ్చినట్లు కథనాలు వస్తున్నాయని ధర్మాసనం మండిపడింది. హైకోర్టు విభజనకు సంబంధించి ఇటీవల కొన్ని పత్రికల్లో, టీవీల్లో (సాక్షి కాదు) వచ్చిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారని, అది శుద్ధ అబద్ధమని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement