miyapur land scam
-
‘మియాపూర్’పై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మియాపూర్ భూకుంభకోణం కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములపై సీల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తక్షణమే ఆ ఉత్తర్వులను నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంలో ఉన్న కేసులు పరిష్కారం అయ్యేవరకు స్టే విధించింది. మియాపూర్ భూములను యధావిధిగా ఉంచాలని స్టే ఆర్డర్ ఇచ్చింది. కోర్టులో పరిష్కారం అయ్యేంతవరకు మియాపూర్ భూములను ప్రభుత్వం కొనడం కానీ, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం కానీ చేయకూడదని తేల్చి చెప్పింది. చట్టాన్ని దుర్వినియోగం చేసేవారిపట్ల కోర్టుకు సానుభూతి ఉండదని హైకోర్టు తెలిపింది. -
‘గోల్డ్‌స్టోన్’ ప్రసాద్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న పీఎస్ ప్రసాద్ (గోల్డ్‌స్టోన్ ప్రసాద్), అతని కుటుంబసభ్యులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన భూముల విషయంలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్(జేసీ) జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. రంగారెడ్డి జిల్లా బాలానగర్ మండలం హస్మత్‌పేట సర్వే నంబర్ 1లోని 74.08 ఎకరాలు, సర్వే నంబర్ 57లోని 39 ఎకరాల భూమిపై ప్రసాద్, అతని కుటుంబసభ్యులు, కంపెనీలు, ఇతరులకు హక్కు కల్పిస్తూ పేర్లను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయొ ద్దని సంబంధిత తహసీల్దార్‌ను ఆదేశించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వందల ఎకరాల భూమిపై 1958 నుంచి కొనసాగుతున్న వివాదంలో తుది తీర్పు వచ్చేవరకు వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. స్పష్టత వచ్చే వరకు ఆ భూములపై హక్కులు కోరజాలరని ప్రసాద్ తదితరులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రసాద్ తదితరులు చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. కోర్టు తుది తీర్పు ఇవ్వకపోయినా, ఇచ్చినట్లు ప్రసాద్ తదితరులు చేస్తున్న వాదన పిడికెడు బియ్యంలో గంపెడు గుమ్మడికాయను దాచే ప్రయత్నంలా ఉందని ఆక్షేపించింది. 113 ఎకరాల భూమి విషయంలో కోర్టు తమకు అనుకూలంగా తుది తీర్పునిచ్చిందంటూ ప్రసాద్, అతని కుటుంబ సభ్యులు హక్కులు కోరారు. దీంతో బాలా నగర్ తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లను చేరుస్తూ 2011లో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు జేసీ ముందు రివిజన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన జేసీ 2018లో తహసీల్దార్ ఉత్తర్వులను రద్దు చేశారు. ఈ వ్యవహారంపై తిరిగి విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేయాలని తహసీల్దార్‌ను జేసీ ఆదేశించారు. జేసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రసాద్, అతని కుటుంబసభ్యులు, అతని కంపెనీలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా ధర్మాసనం విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది. -
కుంభకోణాలపై విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: పాత కేసులను తిరగదోడటం కన్నా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై ముందు విచారణ జరిపించాలని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎంసెట్, మియాపూర్ భూముల కుంభకోణం, నయీం ఎన్కౌంటర్ స్కాం.. ఇలా చాలా స్కాములు వెలుగులోకి వచ్చాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాజకీయ ఎజెండాలో భాగంగానే కాంగ్రెస్ నేతలపై మళ్లీ కేసులు పెట్టాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అమలవుతున్న సబ్సిడీ పథకాల్లో జరుగుతున్న కుంభకోణంపై విజిలెన్స్ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. విభజన చట్టం హామీలపై సుప్రీంకోర్టులో తాను వేసిన కేసు మూడోసారి విచారణకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదని విమర్శించారు. విభజన హామీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేసులో ఇంప్లీడ్ కావాలని కోరారు. -
‘గోల్డ్‌స్టోన్’ ప్రసాద్‌కు సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణం కేసుతో గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు సంబంధం లేదని, అతను కనీసం నిందితుడు కూడా కాదని ఉమ్మడి హైకోర్టుకు రాష్ట్రప్రభుత్వం సోమవారం నివేదించింది. అయితే ప్రసాద్ కుటుంబ సభ్యులు, సోదరులు, కంపెనీలు నిందితుల జాబితాలో ఉన్నారని వివరించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఆ వివరాల ఆధారంగా అవసరమైతే అదనపు చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపింది. వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. నిందితులకు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులిచ్చి ఎందుకు విచారించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిందితులను విచారించకుండా అత్యవసరంగా కింది కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాల్సిన అవసరమేమొచ్చిందని నిలదీసింది.చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితులకు కింది కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందో, లేదో వివరాలను తమ ముందుంచాలంది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, సీబీఐతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కుటుంబ సభ్యులు తదితరులను ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. మియాపూర్ భూ కుంభకోణంపై ప్రస్తుతం జరుగుతున్న పోలీసు దర్యాప్తును సీబీఐకి బదలాయించేలా ఆదేశాలివ్వాలంటూ బీజేపీ అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్‌రావు హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవా రం మరోసారి విచారణ జరిపింది.ఈ సందర్భంగా గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కుటుంబ సభ్యుల తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ వ్యాజ్యాన్ని రాజకీయ కారణాలతో దాఖలు చేశారని, పిటిషనర్ పత్రికా సమావేశాలు పెట్టి మరీ తన క్లయింట్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. మీడియాలో ఇష్టమొచ్చినట్లు కథనాలు వస్తున్నాయని ధర్మాసనం మండిపడింది. హైకోర్టు విభజనకు సంబంధించి ఇటీవల కొన్ని పత్రికల్లో, టీవీల్లో (సాక్షి కాదు) వచ్చిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారని, అది శుద్ధ అబద్ధమని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. -
693 ఎకరాలు.. నాలుగే తప్పుడు రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: అత్యంత ఖరీదైన మూడు జాగీర్దార్ గ్రామాల్లోని 693 ఎకరా లకు సంబంధించి నాలుగు రిజిస్ట్రేషన్లు మాత్రమే అక్రమమని రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టుకు తెలియజేసింది. ఆ నాలుగు రిజిస్ట్రేషన్లను రద్దు చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా కోర్టులో దాఖలు చేసిన అఫిడవి ట్లో పేర్కొన్నారు. ‘మియాపూర్‌లోని సర్వే నం.20, 28లో 376 ఎకరాలు, సర్వే నం.100, 101ల్లోని 445.34 ఎకరాలను ప్రభుత్వం 2003–2007లో హుడాకు ఇవ్వ గా ఆ భూములను హుడా ప్లాట్లు వేసి విక్ర యించింది. ఆ సర్వే నంబర్లలోని భూములు ప్రభుత్వానివే. సర్వే నం.159 లోని 67.34 ఎకరాలు కూడా హుడా ప్లాట్లు వేసి విక్ర యించినవే. అయితే, 693.04 ఎకరాలకు సంబంధించి నాలుగు రిజిస్ట్రేషన్లే అక్రమం. వీటిని రద్దు చేశాం. హైదర్‌నగర్ లోని సర్వే నం.172, 145లోని భూముల్ని రైతులకు పట్టాలు ఇచ్చాం. మియాపూర్ భూముల రక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. పీఎస్ ప్రసాద్ భూముల్ని ఆక్రమిస్తే కూకట్పల్లి పీఎస్‌లో కేసు నమోదు చేశారు, నిందితుల అరెస్టు జరిగింది. ఇందులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరం లేదు’ అని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. మియాపూర్ భూకుంభకోణంలో పెద్దలు న్నారని, దర్యాప్తు కుంటుపడినందున సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. కింది కోర్టులో చేసిన అభియోగాలు, ఇక్కడ దాఖలు చేసిన అఫిడవిట్‌ను పిటిషనర్‌కు అందజేయాలని ధర్మాసనం ఏజీని అదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. -
దర్యాప్తు రికార్డులను మా ముందుంచండి
సాక్షి, హైదరాబాద్ : మియాపూర్ భూ కుంభకోణం కేసులో ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు రికార్డులను తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ఈ కుంభకోణంలో కొందరు రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్ల పాత్ర ఉందని వారిని సస్పెండ్ చేశారు. అంటే దీనర్థం అక్రమాలు జరిగా యని నిర్ధారించడమే. 693 ఎకరాలు అన్యాక్రాంతమైతే ఇప్పటి వరకు మీరు ఏం చర్యలు తీసుకున్నారు?’ అని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. ఈ కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మియాపూర్ భూ కుంభకోణంపై ప్రస్తుత దర్యాప్తును సీబీఐకి బదలాయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీజేపీ అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్‌రావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో పిటిషనర్ రఘునందన్‌రావు వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ.. మియాపూర్‌లోని సర్వే నంబర్లు 20,28,100,101లోని 693 ఎకరాల రిజిస్ట్రేషన్లను రద్దు చేశామని చెప్పిందన్నారు. దీంతోపాటు దండు మైలార్లో ఎంపీ కేకేకు చెందిన 70 ఎకరాలసేల్డీడ్లను కూడా రద్దు చేసినట్లు పేర్కొందని.. అయితే, సేల్డీడ్లను రద్దు చేసే అధికారం రెవెన్యూ అధికారులకు లేదని, ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానాలు స్పష్టం చేశాయన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదన్నారు. ఈ సమయంలో ప్రతివాదుల తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని కోరారు. దీంతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్‌ను కేసుల పురోగతి గురించి ధర్మాసనం ఆరా తీసింది. దీనికి ఆయన స్పందిస్తూ, పిటిషనర్ చెబుతున్న సర్వే నంబర్లకు, మియాపూర్ భూ కుంభకోణానికి సంబంధం లేదని చెప్పారు. అయితే రిజిస్ట్రార్లను ఎందుకు సస్పెండ్ చేశారు? కేసులెందుకు నమోదు చేశారు? అని ధర్మాసనం ప్రశ్నించింది. -
బెయిల్ రద్దు చేయండి
మియాపూర్ భూకుంభకోణం నిందితులపై ఏసీబీ సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంలో నిందితులుగా ఉన్న బాలా నగర్, కూకట్పల్లి సబ్రిజిస్ట్రార్లు మహ్మద్ యూసఫ్, రాచకొండ శ్రీనివాసరావు, మేడ్చల్ సంయుక్త సబ్‌రిజిస్ట్రార్ టీవీ రమేశ్‌చందర్‌రెడ్డిల బెయిల్‌ను రద్దు చేయా లని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రతివాదులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్‌చౌదరి సోమవారం నోటీసులు జారీ చేశారు. విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. ఆదాయానికి మించి ఆస్తుల్ని కూడబెట్టారన్న కేసులో ఈ ముగ్గురూ నిందితులుగా ఉన్నారని, బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఏసీబీ వాదించింది. నిందితుల నుంచి మరింత సమా చారం రాబట్టాల్సి ఉందని తెలిపింది. కనుక కింది కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ హైకోర్టును కోరింది. -
భూకుంభకోణం... సీబీఐకి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూకుంభకోణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, సీబీఐకి, ప్రతివాదులకు ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ కుంభకోణం పరిధి మియాపూర్‌ను దాటి విస్తరించిందని, ప్రముఖుల పాత్ర ఉందని, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత, న్యాయవాది రఘునందన్‌రావు వేసిన పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం మరోసారి విచారణ జరిపింది. కేంద్ర, రాష్ట్రాలు, సీబీఐ, ప్రతివాదులు తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించింది. -
ఆ భూకుంభకోణంపై చర్యలేవీ?
మియాపూర్ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన మియాపూర్ భూముల కుంభకోణం వ్యవహారంలో తీసుకున్న చర్యలేమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రిజిస్టరైన భూముల విస్తీర్ణమెంత, ఎవరిపేర్లపై రిజిస్ట్రేషన్ జరిగింది, బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలేమిటి.. తదితర పూర్తి వివరాలు తమ ముందుంచాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ టి.రజనిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించినా.. మియాపూర్ భూముల కుంభకోణంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశించాలంటూ బీజేపీ అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్‌రావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రఘునందన్‌రావు వాదనలు వినిపిస్తూ... కొందరు ప్రైవేటు వ్యక్తులు దాదాపు 700 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను తమ సంస్థల పేర్ల మీద అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారని.. తర్వాత వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు రుణాలుగా పొందారని కోర్టుకు తెలిపారు. అసలు ఆయా భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని 2014 అక్టోబర్ 31వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని... ఆ ఆదేశాలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్ జరిగిందని, ఇందుకు కొందరు సబ్ రిజిస్ట్రార్లు సహకరించారని వివరించారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని.. పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే కేసును సీబీఐకి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎ.సంజీవ్‌కుమార్ వాదనలు వినిపించారు. మియాపూర్ వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని, బాధ్యులైన సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసి, కేసులు నమోదు చేసిందని కోర్టుకు తెలిపారు. విచారణ కొనసాగుతోందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడానికి ముందు ప్రభుత్వం నుంచి కొన్ని వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. అసలు అక్రమంగా రిజిస్టరైన భూముల విస్తీర్ణమెంత, ఎవరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగింది, ఎవరు చేశారు, ఎంత మొత్తాలు చెల్లించారు, బాధ్యులైన అధికారుల పేర్లు, వారిపై తీసుకున్న చర్యలు.. ఇలా పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది. -
కిరీటాలు..పీఠాలు అడగడం లేదు: కోదండరాం
సంగారెడ్డి జిల్లా: తెలంగాణ ప్రభుత్వంపై టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నిప్పులు చెరిగారు. ‘నెత్తి మీద కిరీటాలు.. కింద పీఠాలు.. దండలు కోరుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని మాత్రమే ప్రశ్నిస్తున్నం’అని కోదండరాం అన్నారు. తెలంగాణ జేఏసీ చేపట్టిన ‘అమరుల స్ఫూర్తియాత్ర’ను బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కోదండరాం మాట్లాడుతూ ‘తెలంగాణ వచ్చింది.. నువ్వెవరు? అని అడుగుతున్నారు.. అయినా మేం గుర్తింపు కోరుకోవడం లేదు’అన్నారు. ‘లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడికి పోయింది. రైతు ఆత్మహత్యల్లో రెండోస్థానం, నిరక్షరాస్యతలో అట్టుడుగున ఉన్నాం. దళితులకు ఇప్పుడు ఇస్తున్నట్లే భూమి పంపిణీ చేస్తే.. అందరికీ లబ్ధి కలగాలంటే ఇంకో 230 ఏళ్లు పడుతుంది. ఇదేం పద్ధతి.. మీకు అవసరమైతే భూములు దొరుకుతున్నాయి. మియాపూర్ భూములు పంచుకోవడం, కాంట్రాక్టులు తెచ్చుకోవడం, పైసలు దండుకోవడంలోనే నాయకులు మునిగి తేలుతున్నారు. ఎవరిపైనైతే కొట్లాడినమో.. వారికే పైసలు దొరుకుతున్నయి. ఓట్లు అడిగేందుకు మాత్రమే ప్రజలు అక్కరకు వస్తారా..? మన వల్లే ప్రభుత్వం పుట్టింది’అని కోదండరాం ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పాం. మూడేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. 20 వేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఐదు రూపాయల భోజనం తింటూ నిరుద్యోగులు పరీక్షలకు సిద్ధమవుతున్నా.. ఒక్క ఉద్యోగానికి కూడా సక్రమంగా నోటిఫికేషన్ ఇవ్వడం లేదు’అని కోదండరాం విమర్శించారు. డబ్బులుంటే వైద్యం అందడం లేదు. గ్రామాల్లో వృత్తుల మీద ఆధారపడిన వారికి ఆదాయం లేదు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. -
భూకుంభకోణంపై విచారణ జరపాలి
ప్రొఫెసర్ కోదండరాం సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై ప్రభుత్వం తగిన చర్య లు తీసుకోకపోతే అన్ని దస్తావేజులతో బహిరంగ విచారణ జరుపుతామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. జేఏసీ కోచైర్మన్ గోపాలశర్మ అధ్యక్షతన శనివారం ఇక్కడ ‘మియాపూర్ భూకుంభ కోణం’పై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ మే, సంపన్నులకు అక్రమంగా కట్టబెడుతున్న దన్నారు. కాగితాల్లోనే భూములు మారాయని, ఎక్కడి భూములు అక్కడే ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్ప టికే ఆ భూముల్లో భారీ విల్లాలు, అపార్టుమెం ట్లను నిర్మించారని, వాటిని బడా బాబులు కొనుక్కున్నట్టు స్థానికులు చెబుతున్నారని అన్నా రు. ఈ భూముల కుంభకోణంలో వాస్త వాలను చెప్పడానికి కరపత్రాలను వేస్తామన్నారు. ప్రభుత్వ భూములపై అధ్యయనం చేసిన ఎస్.కె.సిన్హా కమిటీ నివేదికను బయట పెట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా ప్రభు త్వం గుర్తించిన భూముల వివరా లను బయటపెట్టాలని, వాటిని సంరక్షిం చడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. భూముల అక్రమాలపై న్యాయ విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దామోదర్‌రావు మాట్లాడుతూ తెలం గాణలో నిజాంకాలం నాటి నుంచి ఉన్న ప్రభుత్వ భూములు, వాటి స్వరూపం గురించి వివరిం చారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రామకృష్ణారెడ్డి మాట్లాడు తూ ప్రభుత్వ భూమి ఎంత ఉందో ఇప్పటికీ సరైన లెక్కలు లేవన్నారు. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో, ఎంత ఉందో తెలుసుకోవడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. టీజేఏసీ నేతలు భైరి రమేశ్, మాదు సత్యం, పలువురు న్యాయ నిపుణులు పాల్గొన్నారు. -
భూ కుంభకోణాలపై ప్రజా విచారణ చేపడతాం
- టీజేఏసీ చైర్మన్ కోదండరాం హైదరాబాద్: మియాపూర్ భూములపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే అన్ని దస్తావేజులతో బహిరంగంగా ప్రజా విచారణ జరుపుతామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం హెచ్చరించారు. జేఏసీ కోచైర్మన్ గోపాలశర్మ అధ్యక్షతన మియాపూర్ భూకుంభకోణంపై హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే సంపన్నులకు అక్రమంగా కట్టబెడుతున్నదని విమర్శించారు. కాగితాల్లోనే భూములు మారాయని, ఎక్కడి భూములు అక్కడే ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే ఆ భూముల్లో భారీ విల్లాలు, అపార్టుమెంట్లు నిర్మాణమైనాయని, వాటిని పెద్దపెద్ద వ్యక్తులు కొన్నారని స్థానికులు చెబుతున్నారన్నారు. ఈ కుంభకోణంలో వాస్తవాలను వెలికి తెచ్చేందుకు కరపత్రాలు వేస్తామన్నారు. ప్రభుత్వ భూములను అధ్యయనం చేసిన ఎస్.కె.సిన్హా కమిటీ నివేదికను బయటపెట్టాలని, కుంభకోణంపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా ప్రభుత్వం గుర్తించిన భూముల వివరాలను బయటపెట్టాలని, వాటిని సంరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. భూములు కబ్జా కాలేదని, స్కాం లేదని సీఎం చేసిన ప్రకటనతోనే భూకబ్జాదారులకు బెయిల్ దొరికిందనే వార్తలు రావడం గమనార్హమని కోదండరాం అన్నారు. పేదలకు ఇళ్లు కట్టించడానికి, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడానికి భూములు లేవని చెబుతున్న ప్రభుత్వం వందలాది ఎకరాలను సంపన్నులకు కట్టబెడుతున్నదనిఘాయన విమర్శించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దామోదర్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో నిజాంకాలం నాటి నుంచి ఉన్న ప్రభుత్వ భూములు, వాటి స్వరూపం గురించి వివరించారు. ప్రజల అవసరాలను గుర్తించి భావితరాల అవసరాల కోసం ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం తగిన చర్యలను తీసుకున్నారని వివరించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూమి ఎంతో సరైన లెక్కలు ఇప్పటికీ లేవన్నారు. భూమి ఎక్కడ ఉందో, ఎంత ఉందో తెలుసుకోవడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. హైకోర్టు న్యాయవాది గోపాలశర్మ మాట్లాడుతూ ప్రభుత్వంలోని పెద్దలకు దగ్గరగా ఉన్నవారికి ప్రభుత్వ భూములను పంచిపెట్టినా ఎవరూ అడ్డుకోలేరనే అహంకారంతో వ్యవహరిస్తున్న పాలకులకు బుద్ది చెప్పాలన్నారు. సమావేశంలో జేఏసీ నేతలు భైరి రమేశ్, మాదు సత్యం, న్యాయ నిపుణులు పాల్గొన్నారు. -
క్లీన్‌చిట్‌పై అనుమానాలు: నాగం
సాక్షి, హైదరాబాద్: భూకుంభకోణాలపై ప్రభుత్వపరంగా ఎలాంటి నివేదికలు ఇవ్వ కుండానే ఒక్క గజం కబ్జా కాలేదని సీఎం చేసిన ప్రకటన అనేక అనుమానాలకు తావిస్తోందని బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటన ఆధారంగానే మియాపూర్ భూ బకాసురులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఆరోపించారు. అధికార పార్టీ నేతలను, తన ఆత్మగా ఉన్న వ్యక్తిని కాపాడేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు. -
భూస్కాంలో కాంగ్రెస్ నేతలెవరో తేల్చాలి
హరీశ్‌కు షబ్బీర్ సవాల్ సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూములతో పాటు కాంగ్రెస్ నేతలు ఎక్కడెక్కడ భూ కుంభకోణాలకు పాల్పడ్డారో తేల్చాలని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ సవాల్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, భూకుంభకోణంలో కాంగ్రెస్ నేతల హస్తముందని హరీశ్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, కుంభకోణంలో కాంగ్రెస్‌తోపాటు ఏ పార్టీ నేతలున్నా పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతీదానికి కాంగ్రెస్‌ను నిందించడం టీఆర్ఎస్ నేతలకు, మంత్రులకు అలవాటైందని మండిపడ్డారు. మియాపూర్ భూ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, సీబీఐ విచారణ చేస్తే అన్ని ఆధారాలను అందిస్తామని తెలిపారు. భూముల పరిరక్షణ కోసం, నకిలీ విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి సెక్షన్లు మార్చితే సరిపోదని, ప్రత్యేకంగా అసెంబ్లీలో చట్టాన్ని పెట్టాలని సూచించారు. కేటీఆర్ అధికార అహంకారంతో నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. -
ట్రినిటీ పార్థసారథి, సువిశాల్ శర్మకు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: మియాపూర్ భూ కుంభకోణం కేసులో ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పార్థసారథికి, సువిశాల్ పవర్ జెన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ నిరాకరించ డంతో నిందితులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్ ఆర్కె అగర్వాల్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిం చింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్, కేటీఎస్ తులసి వాదనలు వినిపిస్తూ.. సివిల్ లిటిగేషన్ కేసును క్రిమినల్ లిటిగేషన్ కేసుగా మార్చడం తగదని చెబుతూ.. గతంలో పలు కేసుల్లో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను చదివి వినిపించారు. ఈ కేసులో ఫోర్జరీ జరగలేదని, ప్రభు త్వానికి నష్టం జరిగి ఉంటే సంబంధిత భూములను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని వివరించారు. అయితే ఈ భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని ముఖ్య మంత్రి కేసీఆర్ కూడా పలుమార్లు వివరణ ఇచ్చా రని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఏమైనా ఉల్లంఘనలు జరిగి ఉంటే పెనాల్టీ విధింపునకు రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద నిబంధనలు ఉన్నాయని వివరించారు. తమ వాదనలతో ఏకీభవించిన ధర్మా సనం నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ కింది కోర్టు షరతులు వర్తిస్తాయని పేర్కొన్నట్లు రవిశంకర్ మీడియాకు తెలిపారు. -
పోరాడలేకుంటే వైదొలగండి: కేఎల్ఆర్
వట్టి మాటలొద్దని జానారెడ్డి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంపై కాంగ్రెస్ ముఖ్యనేతలు గట్టిగా పోరాడాలని, లేదంటే తమ పదవుల నుంచి వైదొలగాలని ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్) డిమాండ్ చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. మియాపూర్ భూముల కుంభకోణంలో కాంగ్రెస్‌పార్టీ నేతలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోందని, దీనికి తోడు పార్టీ ముఖ్యనేతలు కూడా సరిగ్గా స్పందించడంలేదని, దీనివల్ల తమలాంటి నాయకులకు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. టీఆర్ఎస్లోకి వెళ్లిన పీసీసీ మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు, డి.శ్రీనివాస్ ఇద్దరూ దొంగలని ఆరోపించారు. మియాపూర్ భూముల కుంభకోణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, దీనిపై క్రమపద్ధతిలో గట్టిగా పోరాడుతున్నామని సీఎల్పీ నేత కె.జానారెడ్డి స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశం అనంతరం తనను కలసిన మీడియా ప్రతినిధులతో జానారెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా జానారెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘ప్రభుత్వ అక్రమాలను, అవినీతిని గట్టిగా ఎదిరిస్తున్నాం. మియాపూర్ భూములపైనా పోరాడుతున్నాం. ఆ భూముల్లో కాంగ్రెస్ నేతల భూములు ఉన్నా ఊరుకోవద్దు. వట్టిమాటలు, అనుమానాలు, ఆధారాల్లేని ప్రచారం వద్దు. ఎవరిౖMðనా భూములు ఉన్నట్టుగా ఆధారాలుంటే నిర్దిష్టంగా బయటపెట్టాలి’ అని అన్నారు. -
గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గురువారం కలిశారు. హైదరాబాద్‌లో జరిగిన భూ కుంభకోణాలకు బాధ్యులు చేస్తూ టీఆర్ఎస్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నర్‌ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్, చుట్టు పక్కల భూములు ఉమ్మడి ఏపీ కంటే.. ఎక్కువ అన్యాక్రాంతం అయ్యాయని అన్నారు. అనుమానాలు, ఆధారాలు, సీఎం పేషీ ఉద్యోగుల వివరాలు, ఇతరుల ఆధారాలను గవర్నర్‌కు సమర్పించామని తెలిపారు. మియాపూర్ భూకుంభకోణం విలువ రూ.15 వేల కోట్లు అని, మంత్రి పేషీలో , సీఎంఓ లో కబ్జా చేసిన వారికి బంధువులు ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఇబ్రహీం పట్నంలో భూములు వదులుకోవడం దేనికి సంకేతమని, ఏం మతలబు ఉందని ప్రశ్నించారు. మొదటి సమీక్ష సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ఎలా కూర్చున్నారు తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఎస్కే సిన్హా రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలకు కూడా భూములు కట్టబెట్టారని వెల్లడించారు. కేసును సీఐడీకి అప్పగించడం హాస్యాస్పదమన్నారు. ఇంత పెద్ద స్కాం ఎప్పుడూ జరగలేదని, గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. -
దాచిపెట్టి ఎవరి కళ్లు మూస్తారు?
మియాపూర్ భూ స్కాంపై టీటీడీపీ నేత రేవంత్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ.15వేల కోట్ల విలువైన భారీ కుంభకోణంవల్ల ప్రభుత్వానికి నష్టం ఏమీ లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన చేయడం ద్వారా ఎవరి కళ్లు మూస్తారని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మియాపూర్ కుంభకోణంపై ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుధవారం బహిరంగలేఖ రాశారు. భూముల కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నా ఇప్పటిదాకా నోరు మెదపకుండా ప్రతిపక్షాలు, ప్రజల ఒత్తిడికి తలొంచి చేసిన ప్రకటన వాస్తవాలను దాచిపెట్టేవిధంగా ఉందని రేవంత్ విమర్శించారు. మియాపూర్ భూముల కుంభకోణాన్ని ప్రభుత్వమే బయటపెట్టిందని గొప్పలు చెప్పుకుంటున్న వారే ఇప్పుడు కుంభకోణం ఏమీలేదని చెప్పడం ద్వారా అనుమానాలను మరింత పెంచారని ఆయన పేర్కొన్నారు. కుంభకోణం ఏమీ లేకుంటే అధికారులపై కేసులు ఎందుకు పెట్టారని, ఒకేసారి 72 మంది సబ్ రిజిష్ట్రార్లను ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. పలువురు అధికారులపై ఏసీబీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో సీఎం సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, డి.శ్రీనివాస్‌లపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడానికి సీఎం కేసీఆర్‌కు ఉన్న అభ్యంతరం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం అంతు తేలేదాకా ప్రజాక్షేత్రంలో పోరాడుతామని స్పష్టంచేశారు. -
భూ కుంభకోణం నిందితులకు హైకోర్టు షాక్
- పార్థసారథి, శర్మకు బెయిల్ నిరాకరణ - భూమి మానవుడికి ప్రకృతి ప్రసాదించిన వరం - దానిని ఆక్రమణదారుల నుంచి కాపాడాలి - దర్యాప్తు కీలక దశలో ఉంది.. కాబట్టి బెయిల్ సాధ్యం కాదు - మియాపూర్ భూ కుంభకోణంపై తేల్చి చెప్పిన న్యాయమూర్తి సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంలో నిందితులుగా ఉన్న ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పీఎస్ పార్థసారథి, సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మలకు ఉమ్మడి హైకోర్టు షాకిచ్చింది. వారికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్లను కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భూముల కుంభకోణంలో పిటిషనర్లకు పాత్ర ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసు రూ.700 కోట్ల విలువైన భూములతో ముడిపడి ఉందన్నారు. భూమి మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరమని, దానిని దురాక్రమణదారుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించారు. అంతేకాక పిటిషనర్లకు చెందిన కంపెనీలు నిజమైనవా? లేక డొల్ల కంపెనీలా అన్న విషయం తేలాల్సి ఉందన్నారు. మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పార్థసారథి, శర్మలకు కూకట్పల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై మంగళవారం వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ దశలో పిటిషనర్లకు బెయిలిస్తే వారు మరిన్ని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. పూర్తిస్థాయి దర్యాప్తు ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఇది పోలీసులు చెబుతున్నంత తీవ్రమైన కేసు కాదన్న పిటిషనర్ల వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ కేసుతో రూ.700 కోట్ల విలువైన భూములు ముడిపడి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ, ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదంటూ వారి పిటిషన్లను కొట్టేశారు. -
పార్థసారథి, శర్మల బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు
- మియాపూర్ భూముల కుంభకోణం కేసులో - నిర్ణయాన్ని నేటికి వాయిదా వేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంలో నిందితులు ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పీఎస్ పార్థసారథి, సువిశాల పవర్ జనరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఉమ్మడి హైకోర్టులో వాదనలు ముగిశాయి. మంగళవారం ఈ మేరకు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు తన నిర్ణయాన్ని బుధవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పార్థసారథి, శర్మలకు కూకట్పల్లి కోర్టు బెయిల్ నిరాకరించడంతో.. వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో ఓ సేల్‌డీడ్ తయారు చేశారని, అంతకుమించి ఏమీ జరగలేదని విన్నవించారు. పోలీసులు చెబుతున్నంత తీవ్రమైన కేసు కాదన్నారు. ఇప్పటికే పిటిషనర్ల కస్టడీ కూడా ముగిసిందని, అందువల్ల వారు జైలులో ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి జరిగిన నష్టమేమీ లేదని వివరించారు. అయితే ఈ వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి తోసిపుచ్చారు. నేరపూరిత దురుద్దేశాలతో సేల్డీడ్లు తయారు చేశారని, దీని వల్ల ప్రభుత్వానికి రూ.కోట్ల మేర నష్టం వాటిల్లిందని కోర్టుకు విన్నవించారు. పెద్ద మొత్తంలో స్టాంప్ డ్యూటీ ఎగవేశారని తెలిపారు. ప్రభుత్వ భూములను స్వాహా చేయాలన్న దురుద్దేశంతోనే పిటిషనర్లు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇందులో సబ్ రిజిస్ట్రార్ల సాయం తీసుకున్నారని వివరించారు. ఇది చాలా భారీ కుంభకోణమని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, చార్మినార్‌ను అమ్మినంత మాత్రాన దానిపై ఎవరికైనా హక్కులు సంక్రమిస్తాయా అంటూ ప్రశ్నించారు. వ్యక్తి వేరు, ప్రభుత్వం వేరని ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి నష్టం కలిగించడమంటే ప్రజలకు నష్టం కలిగించడమేనని వివరించారు. -
సీబీఐ విచారణ అవసరం లేదు: కేసీఆర్
హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణం వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. భూ కుంభకోణం వ్యవహారంపై సీబీఐ విచారణ అవసరం లేదని కేసీఆర్ తేల్చారు. అసలు మియాపూర్‌లో భూకుంభకోణం జరిగినట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. అక్కడ ఎలాంటి కుంభకోణం జరగలేదని, విపక్షాలు ఈ వ్యవహారంలో రాజకీయాలు చేయడం తగదని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో భూముల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ శివార్లలోని మియాపూర్‌లో వేల కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని, దీని వెనుక పలువురు రాజకీయ నాయకులు, బడా రియల్టర్ల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. -
22 నుంచి తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ
హైదరాబాద్ : ఈ నెల 22న హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు టీ.వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ 8వేల మందితో ప్లీనరీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ బలోపేతం, కేసీఆర్ పాలనా వైఫల్యాలపై చర్చిస్తామని గట్టు శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. మియాపూర్ భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఎనీవేర్ కరప్షన్గా మారిందన్నారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యం వల్లే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్‌కు షాక్
హైదరాబాద్: మియాపూర్ భూకోణంలో దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఇంటిపై మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడి చేశారు. బోయిన్‌పల్లిలోని శ్రీనివాసరావు ఇంటితో పాటు ఆయన బంధువులకు చెందిన 11 ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున నగదు, నగలతో పాటు పలు ప్రాంతాలలో భూములు, భవంతులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయని తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని మియాపూర్‌లో రూ.10 వేల కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో శ్రీనివాసరావు ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక పలువురు రాజకీయ నాయకులు, బడా రియల్టర్ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత విలువైన ఈ ప్రభుత్వ భూములపై కన్నేసిన పలువురు రియల్టర్లు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన రాజకీయ నేతలు కలసి రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెర తీసినట్లు సమాచారం. ఈ కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. కాగా, ఈ నెల 1న హెచ్ఎండీఏ పరిధిలో 14 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ దాడులు చేసింది. -
సీఎం నోరెందుకు విప్పడంలేదు?
మియాపూర్ భూ కుంభకోణంపై రేవంత్, రమణ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మియాపూర్ ప్రభుత్వ భూముల కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించి సీఎం కేసీఆర్ తన చిత్త శుద్ధి నిరూపించుకోవాలని టీటీడీపీ అధ్యక్షు డు ఎల్.రమణ డిమాండ్ చేశారు. 700 ఎకరాల ప్రభుత్వ భూకుంభకోణం వెలుగు లోకి వచ్చి 20 రోజులు గడుస్తున్నా సీఎం ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తే కేసు నీరుగార్చినట్లేనన్నారు. సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో మియాపూర్ భూ కుంభకోణం నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వ అండదండలతోనే గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అక్రమాల్లో సీఎం పేషీలోని ఆయన సమీప బంధువు కీలకంగా వ్యవహరించారన్నారు. ఎంసెట్ లీకేజీ, నయీమ్ కేసులను అట కెక్కించిన సీఎం.. తాజాగా మియాపూర్ భూముల వ్యవహారాన్ని కూడా బుట్టదాఖలు చేసే యత్నం చేస్తున్నారన్నారు. మియాపూర్ భూ కుంభకోణం రూ.15 వేల కోట్లని, ఇవే కాకుండా.. మణికొండలోని కాందీశీకుల భూములనూ కాజేశారన్నారు. -
బీసీలను ఓట్లేసే మిషన్లుగానే చూశాయి: కర్నె
హైదరాబాద్: ప్రముఖ రచయత, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత సి.నారాయణరెడ్డి మృతికి టీఆర్ఎస్ఎల్పీ తరపున ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతి సాహితీ రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. గత పాలకులంతా బీసీలను ఓటేసే మర యంత్రాలుగా చూశారని, ఓబీసీ కమీషణ్‌కు చట్టబద్దత తేవాలని ప్రయత్నిస్తే రాజ్యసభలో బిల్లును అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు. టీఆర్ఎస్ బీసీ ఉన్నతికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా 119 బీసీ గురకుల పాఠశాలలు ప్రారంభిస్తుండడం చారిత్రాత్మకం అన్నారు. కాంగ్రెస నేతలది మాత్రం ఓట్ల రాజకీయ విద్యార్థులకు నీతి పాఠాలు చెప్పాల్సిన కోదండరాం అపద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోదండరాం ఏఆధారాలతో ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని ప్రశ్నించారు. కోదండరాం మాటలు కాంగ్రెస్ మాటలకు జిరాక్స్‌లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మియాపూర్ కుంభకోణాన్ని ప్రభుత్వమే వెలుగులోకి తెచ్చిందన్నారు. ఇందులో ఎలాంటి వారు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
దేశంలోనే అతి పెద్ద భూ కుంభకోణం
హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన మియాపూర్ భూ కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అధికారులపై సస్పెన్షన్‌తో ఏమీ కాదని, సమగ్ర విచారణ జరిపించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. భూ కుంభకోణానికి పాల్పడిన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన దీన్ని సీబీఐకి కాకుండా సీఐడీకి అప్పగించడంలో రహస్యమేంటని ప్రశ్నించారు. రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసి, మరి కొంతమంది రిజిస్ట్రార్లను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కాగా మియాపూర్ భూ కుంభకోణం నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. -
భూ కుంభకోణంపై కేసీఆర్ స్పందించాలి: కాంగ్రెస్
హైదరాబాద్: నగర చుట్టుపక్కన విలువైన భూములు కుంభకోణంపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు. ఆయన శనివారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భూ కుంభకోణం పై దిగ్విజయ్ సింగ్ సీబీఐ విచారణకు డిమాండ్ చేసినా సీఎం స్పందించడం లేదు. ఇప్పుడు తాజాగా కేశవరావు, ఆయన కుమార్తె, నమస్తే తెలంగాణ దామోదర్ రావు, సీఎం పేషీ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైన సీఎం స్పందించి వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి. తెలంగాణ సర్కార్ దున్నపోతులా తయారైందని రైతులు సచివాలయంలోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. మరో నేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు అమ్ముకున్న ధాన్యానికి కనీసం డబ్బులు చెల్లించలేకపోయారు. వచ్చిన కొన్ని డబ్బులు కూడా బ్యాంకర్స్ విడతల వారిగా ఇస్తున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి వెంటనే రైతులను పట్టించుకోవాలన్నారు. -
భూకుంభకోణంపై ప్రధానికి ఫిర్యాదు: టీడీపీ
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామని, అపాయింట్మెంట్ దొరికితే రాష్ట్రపతిని కూడా కలుçస్తామని టీటీడీపీ నేతలు ఎల్.రమణ, ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరగడంతో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నాయని, మియాపూర్ భూ కుంభకోణం దానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. -
భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు ఆదేశించడం ద్వారా సీఎం కేసీఆర్ తన సచ్ఛీలతను నిరూపించుకోవాలన్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం ఉందని ఆరోపించారు. నయీం కేసులో శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ పేరు ఎఫ్ఐఆర్లో ఉన్నా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. -
సూత్రధారులకు ప్రభుత్వం అండ: రేవంత్
హైదరాబాద్: వేల కోట్ల మియాపూర్ భూ కుంభకోణంలో సూత్రధారులకు, పాత్రధారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భూ కుంభకోణం వెలుగు చూసి వారం గడుస్తున్నా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సోమవారం టీటీడీపీ నేతలు హైదరాబాద్‌లోని మియాపూర్ భూముల్లో పర్యటించారు. రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసి, మరి కొంతమంది రిజిస్ట్రార్లను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థ యాజ మాని బంధువు ఒకరు సీఎం ఆఫీసులో పనిచేస్తున్నట్లు తెలిసిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. వారందరినీ వెలికితీయడానికి సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. -
‘డిప్యూటీ సీఎంను తొలగించాలి’
హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంగా తెలంగాణకు రూ. లక్ష కోట్లు ఇచ్చాం అనగానే ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఖండించిన సీఎం కేసీఆర్ లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందంటున్న ఎందుకు మౌనం వహిస్తున్నారని.. బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు విమర్శించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 24 గంటల్లో భూ కుంభకోణం పై వివరణ ఇవ్వాలి. డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి ఈ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిగే వరకు ఆయనను పదవి నుంచి దూరం పెట్టాలి. సీఎం మౌనంగా ఉన్నారంటే భూ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లే. గోల్డ్‌స్టోన్ ప్రసాద్ పై అమెరికాలో పలు కేసులు ఉన్నాయి.. సీఎం కేసీఆర్ కు ప్రసాద్ మధ్య ఉన్న బంధం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. -
సీబీఐ విచారిస్తే ఆధారాలిస్తాం
భూకుంభకోణంలో తలసాని: మల్లు రవి సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపిస్తే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాత్రకు సంబంధిం చిన ఆధారాలు ఇస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. తలసాని పిట్ట బెది రింపులకు భయపడేది లేదన్నారు. భూకుంభకోణంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ కూడా ఇదే చెప్పారన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన దీన్ని సీబీఐకి కాకుండా సీఐడీకి అప్పగించడంలో రహస్యమేంట ని ప్రశ్నించారు. తలసాని బాగోతం బయటపడుతుందనే భయంతోనే సీబీఐకి ఇవ్వడం లేదన్నారు. పెద్ద పెద్ద రాజకీయ, పోలీసు అధికారుల హస్తముందనే నయీం కేసును ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. కేసీఆర్‌కు నైతిక విలువలుంటే తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని మర్చి పోవద్దని మల్లు సూచించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు గాంధీభవన్‌లో శనివారం జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సోనియా ఫొటో లేకుండా, రాజకీయ స్వార్థంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సంద ర్భంగా పలువురు ఉద్యమకారులను సన్మానించారు. -
భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి: చాడ
మియాపూర్: మియాపూర్ భూ కుంభ కోణంపై సీబీఐతో విచారణ జరిపించి, నిజానిజాలను తేల్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. మియాపూర్‌లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను సీపీఐ నాయకులు, కార్యకర్తలతో కలసి ఆయన శనివారం పరిశీలించారు. కస్టడీలో ఉన్నవారు పాత్రధారులు మాత్రమేనని, తెర వెనక ఉన్న కథానాయకులను వెలికి తీయాల్సిన బా«ధ్యత ప్రభుత్వానిదేనని చాడ అన్నారు. కబ్జాకు పాల్పిడిన భూముల రిజిస్ట్రేషన్లను పూర్తిగా రద్దు చేయాలని, ఆక్రమ ణకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలని కోరారు. కబ్జాదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు. సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేష్ పాల్గొన్నారు. -
‘మియాపూర్’ సూత్రధారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోంది
టీటీడీపీ నేతలు రేవంత్, ఎల్.రమణ సాక్షి, హైదరాబాద్: శేరిలింగంపల్లి మండలం మియాపూర్ భూ కుంభ కోణం సూత్రధారులకు రాష్ట్ర ప్రభు త్వం కొమ్ముకాస్తోందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భూములు రిజిస్ట్రే షన్ చేసుకున్న సంస్థ యజమాని బంధువులు సీఎం కార్యాలయంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోందని, అదేవిధంగా కొందరు ప్రముఖ నేతలు సైతం దీని వెనుక ఉన్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపు కుంటోందన్నారు. ఈ మేరకు సచివాలయంలోని సీ బ్లాక్ ఎదుట టీటీడీపీ నేతలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్రమార్కు లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘ఆయనేం మాట్లాడారో నాకు తెలియదు’
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. అధికారుల అండతోనే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని.. ఈ అంశంతో సంబంధం ఉన్న సబ్ రిజిస్టార్లను బదిలీ చేశారు తప్పా వారి వెనుక ఉన్న ముఖ్య నాయకులను వదిలేశారని ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం తమకు నమ్మకం లేదని, మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. భూ కబ్జా వ్యవహారంలో పెద్ద పెద్ద వాళ్ల హస్తముందని, కాంగ్రెస్ హయం నుంచి విచారణ జరిపినా తమకు అభ్యంతరం లేదన్నారు. నయీం కేసులో కూడా పోలీసుల మీద చర్యలు తీసుకొని నాయకులను వదిలేశారని అన్నారు. ఈ కేసులో అలా చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనకు మీడియా హైప్ ఇచ్చిందన్నారు. చాలా మంది చేరతారని ప్రచారం జరిగినా ఎవరు చేరలేదని తెలిపారు. మతతత్వాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. పొత్తులపై జైపాల్‌రెడ్డి ఏం మాట్లాడారో తనకు తెలియదని దిగ్విజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
కొనసాగుతున్న బదిలీలపర్వం
మొత్తం 72 మంది సబ్ రిజిస్ట్రార్లు, జాయింట్ రిజిస్ట్రార్ల బదిలీ సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణం నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో రెవెన్యూ శాఖ బుధవారం 26 మంది సబ్ రిజిస్ట్రార్లు, జాయింట్ రిజిస్ట్రార్లను బదిలీ చేశారు. అదే వరుసలో మరో 46 మందిని బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల అధికారులను ఇతర జిల్లాలకు, ఇంతకాలం నాన్ ఫోకల్ ప్రాంతాల్లో పని చేసిన వారిని హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ (రిజిస్ట్రేషన్ల) శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 72 చోట్ల అధికారులను మార్చినట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. -
ఎనీవేర్ అక్రమాలు!
►సర్కారు కొంపముంచిన ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్ ►ల్యాండ్ మాఫియాకు కొమ్ముకాసినసబ్రిజిస్ట్రార్లు ►నిషేధిత ప్రభుత్వ స్థలాలు ధారాదత్తం చేసే ఎత్తుగడ ►ఎల్బీనగర్లోనూ అక్రమాల పరంపర ‘ఎక్కడైనా రిజిస్ట్రేషన్’ చేసుకోవచ్చనే వెసులుబాటు సర్కారు కొంపముంచింది. మియాపూర్ భూ కుంభకోణంతో ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చినా.. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రార్ల అడ్డగోలు వ్యవహారాలకు అండగా నిలిచాయి. జిల్లాలో భూముల విలువలు నింగినంటడంతో అక్రమాలకు తెరలేచింది. ప్రభుత్వ నిషేధిత జాబితా (22ఏ)లోని భూములను కూడా చట్టబద్ధం చేసుకునేందుకు పావులు కదిపిన ల్యాండ్ మాఫియాతో సబ్ రిజిస్ట్రార్లు కుమ్మక్కు కావడంతో ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల క్రయవిక్రయాలు, ఇతర దస్తావేజుల నుంచి ఎక్కడైనా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తూ 2009లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘ఎనీవేర్’ పద్ధతిని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అనంతరం దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తెచ్చింది. ఇదే ఇప్పుడు అక్రమ వ్యవహారాలకు దారి చూపింది. ముఖ్యంగా నగర శివార్లలో భూముల ధరలకు రెక్కలు రావడం.. కోట్లాది రూపాయలు పలకడంతో రెవెన్యూ వివాదాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే వివాదాస్పద ఆస్తులను రిజిస్టర్ చేసుకునేందుకు ఈ విధానాన్ని అక్రమార్కులు అదనుగా మలుచుకున్నారు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి మండలంలో దాదాపు వేలాది ఎకరాలకు కొందరు ప్రైవేటు వ్యక్తులు ఎసరు పెట్టే ప్రయత్నం చేశారు. కోట్ల విలువ చేసే భూమిని కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా నిషేధిత భూమిపై హక్కులు పొందేలా వ్యూహరచన చేశారు. 22ఏ రికార్డు ప్రకారం ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదని ఆంక్షలున్నా.. ఇదేమీ పట్టని సబ్‌రిజిస్ట్రార్ భూ మాఫియాతో చేతులుకలిపి అడ్డగోలు వ్యవహారాలు నెరిపారు. ముఖ్యంగా గతంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కూకట్పల్లి, బాలానగర్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో ఈ అక్రమాలు జరిగినట్లు తాజాగా ప్రభుత్వం గుర్తించింది. బడాబాబులతో చేతులు కలిపిన అధికారులు సర్కారీ భూములను ఎడాపెడా రిజిష్టర్ చేసినట్లు తెలిసింది. నెలకు సగటున 300 డాక్యుమెంట్లు..! ఎనీవేర్ భాగంగా ప్రతి నెలా కూకట్పల్లి, బాలానగర్‌లో 300 డాక్యుమెంట్లు నమోదయ్యేవి. ఈ రెండు కార్యాలయాల సబ్ రిజిస్ట్రార్లు అవకతవకలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవడంతో వివిధ ప్రాంతాల్లోని వివాదాస్పద, నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఇక్కడ చకచకా జరిగిపోయేవి. ముఖ్యంగా సూరారం, గచ్చిబౌలి తదితర ప్రాంతాల డాక్యుమెంట్లు ఈ రిజిస్ట్రార్ల పరిధిలో గణనీయంగా జరిగినట్లు అధికారుల విచారణలో తేలింది. ఖజానాకు గండి! కేవలం అక్రమ రిజిస్ట్రేషన్లేకాకుండా.. సర్కారు ఆదాయానికి కొందరు ఎస్‌ఆర్‌లు గండికొట్టినట్లు తేలింది. ప్రస్తుత మేడ్చల్ ఎస్ఆర్ రమేశ్‌చంద్రారెడ్డి గతంలో ఎల్బీనగర్ ఎస్‌ఆర్‌గా పనిచేసినప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమైంది. ఈ క్రమంలోనే ఆయనపై అభియోగాలు నమోదు కావడంతో మంగళవారం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు కావడంతో అరెస్టు కూడా అయ్యారు. ఓ ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూమిని 2016లో ప్రైవేటు వ్యక్తుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు స్పష్టం కావడంతో ఆయనపై వేటు పడింది. ఇవేకాకుండా.. విలువ ఆధారిత పన్ను, భూమి విలువ మదింపులో చేతివాటం ప్రదర్శించడంతో సుమారు రూ.2.86 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని తేలింది. ఇవేకాకుండా మరికొన్ని డాక్యుమెంట్లలోనూ ఆయన పాత్రపై ప్రభుత్వం విచారణ సాగిస్తోంది. ఈ పరిణామాలన్నింటిని విశ్లేషించిన ప్రభుత్వం.. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వల్ల లాభం కన్నా.. నష్టమే ఎక్కువ అనే అంచనా కొచ్చింది. దీంతో ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, నిషేధిత జాబితాలో భూముల రిజిస్ట్రేషన్లపై సబ్ రిజిస్ట్రార్ల వాదన మరో విధంగా ఉంది. 2013లో కేవలం నిషేధిత స్థలాలపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని జిల్లా యంత్రాంగం చెప్పింది తప్పితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదని రాష్ట్ర సబ్ రిజిస్ట్రార్ల సంఘం అధ్యక్షుడు విజయభాస్కరరావు అన్నారు. నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ, అంతర్గతంగా జాబితా పంపినా సమస్య ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. -
ఎక్కడి ఆస్తులు అక్కడే..
► ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్ల రద్దుతో అక్రమార్కులకు చెక్ ► మియాపూర్ కుంభకోణంతో సర్కారులో కదలిక ► జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచే బంద్ ► బుధవారం నుంచి వేరే ప్రాంతాల్లోని ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు ► అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల కబ్జాకు తెరపడే అవకాశం ► ఇప్పటికే వేలాది ఎకరాల భూములు హాంఫట్... ► జిల్లాలో 20 శాతానికి పైగా ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్లు సాక్షి, నల్లగొండ : నల్లగొండలో ఉన్న భూములు హుజూర్‌నగర్‌లో.. మోత్కూర్‌లో ఉన్న ఆస్తులు నకిరేకల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇక నుంచి కుదరదు. ఏ ప్రాంతంలో ఉన్న భూములు ఆ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వేల కోట్ల రూపాయల మియాపూర్ కుంభకోణం వెలుగులోకి రావడంతో ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలో అక్రమార్కులకు చెక్ పడనుంది. అధికారికంగా మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచే ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్లను రద్దు చేసినా.. బుధవారం ఉదయం నుంచి పూర్తిస్థాయిలో రద్దు అవుతాయని, ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 20 శాతానికి పైగా.. ఎనీవేర్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లను ఆన్లైన్లో చేయడం ద్వారా జిల్లాలో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలుస్తోంది. ఎక్కడ భూమి ఉన్నా.. ఏ ప్రాంతంలోని ఆస్తి అయినా యజమానికి తెలియకుండా డాక్యుమెంట్లను రూపొందించి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. వ్యవసాయ భూముల నుంచి భూదాన్, వక్ఫ్‌బోర్డు, ఎన్నెస్పీ, ఇతర ప్రభుత్వ భూములు, ప్రైవేట్ ఆస్తులు ఎనీవేర్ విధానంలో రిజిస్టర్ అయ్యాయని అంచనా. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి భూముల క్రయవిక్రయాలు జరిపే వారికి, కొందరు అక్రమ రియల్టర్లకు ఈ ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు పని సులువు చేశాయి. ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)కు చెందిన మడిగెలు, స్థలాలను కూడా ఈ పద్ధతిలోనే గుట్టుచప్పుడు కాకుండా అమ్మి రిజిస్టర్ చేయించారు. భువనగిరి, హుజూర్నగర్ ప్రాంతాల్లో ఉన్న మడిగెలు, ఆలేరులోని భూమిని కూడా నల్లగొండలో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా.. బీబీనగర్‌కు చెందిన ఓ ఎన్ఆర్ఐకు సంబంధించిన 24 ఎకరాల భూమిని చౌటుప్పల్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. సదరు యజమాని కేసు పెట్టడంతో అక్రమార్కులను అరెస్టు కూడా చేశారు. దీంతోపాటు రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన నయీం ముఠా.. తాము ఆక్రమించుకున్న భూములను కూడా ఎనీవేర్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయించుకునే వారని, ఇందుకు రిజిస్ట్రేషన్ వర్గాలు సైతం పూర్తిగా సహకరించే వారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పరిస్థితులను ఆసరాగా చేసుకుని.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరి«ధిలోని 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏటా లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అంచనా కాగా, అందులో 20 శాతానికి పైగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దాదాపు 20 శాతం ఎనీవేర్ రిజిస్ట్రేషన్లుంటే, గ్రామీణ ప్రాంతాల్లోని కార్యాలయాల్లో 30శాతం వరకు ఈ రిజిస్ట్రేషన్లు జరిగేవని రిజిస్ట్రేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్య పరిస్థితులు సరిగా లేని వారు, వయోధికులు, దూర ప్రాంతాల్లో ఉన్న వారు సలువుగా తమ ఆస్తులను క్రయవిక్రయాలు జరుపుకునేందుకు ఈ ఎనీవేర్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించగా, దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు జిల్లాలో ఇప్పటికే వేలాది ఎకరాల భూములు, కోట్ల విలువైన ఆస్తులను బదలాయించుకున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉండడంతో, అన్ని డాక్యుమెంట్లు తయారు చేయలేక ప్రజలు డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయించాల్సి రావడం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది. డాక్యుమెంట్ రైటర్లు కొందరు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఎక్కడి భూములనైనా, ఏ రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా రిజిస్టర్ చేయించగలిగే పరిస్థితి జిల్లాలో ఉందంటే ఈ అక్రమ వ్యవహారాలు ఎలా సాగేవో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎనీవేర్ రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన నేపథ్యంలో అక్రమార్కుల ఆగడాలకు కళ్లెం పడుతుందని, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి చెక్ పడుతుందని ఆశిద్దాం. కాగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేయగా.. ఇందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ముగ్గురు లేదా నలుగురు ఉన్నట్లు సమాచారం. -
‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ రద్దు
⇒ భూమాయపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ⇒ మరో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లపై వేటు ⇒ రిజిస్ట్రేషన్ల దందాపై ఉన్నతస్థాయిలో సమీక్షించిన సీఎం కేసీఆర్ ⇒ మియాపూర్‌లో 796 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ అయినట్లు వెల్లడి ⇒ బాధ్యులపై కఠిన చర్యలు.. సీఐడీ దర్యాప్తునకు ఆదేశం ⇒ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లకు సెక్షన్ 47(ఎ) విచక్షణాధికారాల తొలగింపు ⇒ కార్యాలయాలపై ఏసీబీ నిఘా.. తనిఖీలకు ఆదేశం ⇒ 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై నేటి నుంచి దాడులు.. ⇒ రంగంలోకి ఫ్లయింగ్ స్క్వాడ్లు ⇒ అప్లోడ్ చేయకుండా దాచిన డాక్యుమెంట్ల స్వాధీనానికి ఆదేశాలు సాక్షి, హైదరాబాద్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని నిర్ణయించడంతోపాటు అక్రమాలకు ఆస్కారమిస్తున్న ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్ (రాష్ట్రంలో ఎక్కడైనా భూముల రిజిస్ట్రేషన్)’విధానాన్ని రద్దు చేసింది. ఆస్తులు ఏ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తాయో అక్కడే వాటి రిజిస్ట్రేషన్ జరగాలని స్పష్టం చేసింది. జిల్లా రిజిస్ట్రార్లకు ఉన్న సెక్షన్ 47(ఎ) విచక్షణాధికారాలను తొలగించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై నిఘా పెట్టాలని, ఎక్కడ అవినీతి కనిపించినా వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏసీబీని ఆదేశించింది. సీఎం తీవ్ర అసంతృప్తి మియాపూర్‌లో రూ.వేల కోట్ల విలువైన 796 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడే కాకుండా మరికొన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వెల్లడైంది. దీంతో ఈ అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో ఐదు గంటలకుపైగా సమీక్షించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి జగదీశ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కవిత, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి, అక్రమాలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కఠిన నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ‘డబ్బులిస్తేనే తప్ప రిజిస్ట్రేషన్లు కావనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ పరిస్థితి పోవాలి. రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలు జరగాలి. పూర్తి ప్రక్షాళన అవసరం..’అని పేర్కొన్నారు. అవినీతికి తావు లేనివిధంగా రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయాలని సూచించారు. దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్నవారిని వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. గట్టి నిఘా.. అధికారాల కుదింపు రాష్ట్రంలోని అన్ని జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై నిఘా పెట్టాలని, ఎక్కడ అవినీతి కనిపించినా వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సెక్షన్ 47ఏ ద్వారా సబ్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రార్లకు కల్పించిన విచక్షణాధికారాలను తొలగించాలని ఆదేశించారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ప్రభుత్వ స్థలం ఎక్కడికీ పోలేదు ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందనే ప్రచారం అవాస్తమని కేసీఆర్ వివరణ ఇచ్చారు.‘‘మియాపూర్ పరిధిలో ఒక్క గజం ప్రభుత్వ స్థలం కూడా వేరే వ్యక్తులకు పోలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రభుత్వ స్థలం సర్వే నంబర్లు వేసి 2016లో ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించారు. కొందరు అధికారులు వారికి సహకరించారు. ఇటీవలే ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించి ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేశాం. ఈ వ్యవహారంలో ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటాం. అసలు ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధం. చేసినా అవి చెల్లవు. మియాపూర్‌లో ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ జరిగినా దానికి చట్టబద్ధత లేదు. భూబదలాయింపు జరగలేదు. ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందనే ప్రచారం తప్పు..’’అని పేర్కొన్నారు. వెంటనే తనిఖీలు బినామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మరో అక్రమ దందా సాగుతోందని సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించిన వారితో అధికారులు కుమ్మక్కై ఆ డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం లేదని సమాచారం అందింది. దీంతో వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై దాడులు చేసి.. అప్లోడ్ కాని రిజిస్ట్రేషన్ల వివరాలు సేకరించాలని, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలని పోలీసు శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో పోలీస్ శాఖ వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. అన్ని రికార్డులు పరిశీలించి, అవకతవకలు బయటపడితే వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. బు«ధవారం నుంచే ఈ స్క్వాడ్లు రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేయనున్నాయి. సెక్షన్ 47–ఎ అధికారాలు కట్ రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 47–ఎ ప్రకారం జిల్లా రిజిస్ట్రార్లకు ఉన్న అధికారాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సెక్షన్ ప్రకారం ఏదైనా ప్రాంతంలో భూమి రిజిస్ట్రేషన్ విలువ మార్కెట్ రేటుకంటే ఎక్కువగా ఉన్నట్లయితే.. విలువ తగ్గింపు కోసం సదరు భూమి అమ్మకం దారు లేదా కొనుగోలుదారులు జిల్లా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ అభ్యర్థనను పరిశీలించి ఆ భూమి రిజిస్ట్రేషన్ విలువను 50 శాతం వరకు తగ్గించేందుకు జిల్లా రిజిస్ట్రార్‌కు అధికారం ఉంటుంది. ఇలా భూమి విలువ తగ్గింపుతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపుడ్యూటీ కూడా తగ్గుతుంది. దీనిని సావకాశంగా తీసుకుని కొందరు జిల్లా రిజిస్ట్రార్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో జిల్లా రిజిస్ట్రార్లకున్న ఈ అధికారాలపై సర్కారు కోత వేసింది. ఇకపై ఈ అధికారాలు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్‌కు మాత్రమే ఉంటాయి. మరో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లపై కేసులు అటు సీఎం సమీక్ష కొనసాగుతుండగానే.. ఇటు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులపై చర్యలు ప్రారంభమయ్యాయి. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ యూసఫ్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేశ్ చంద్రారెడ్డిలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరిద్దరితో పాటు ఇప్పటికే సస్పెండైన కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మహ్మద్ యూసఫ్, రమేశ్ చంద్రారెడ్డి పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ‘ఎనీవేర్’రద్దును స్వాగతిస్తున్నాం: సబ్ రిజిస్ట్రార్ల సంఘం అక్రమాలకు నెలవుగా మారిన ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’విధానం రద్దును స్వాగతిస్తున్నామని రాష్ట్ర సబ్ రిజిస్ట్రార్ల సంఘం పేర్కొంది. కొందరు అధికారులు చేసే తప్పుల వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని, అక్రమార్కులపై విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని కోరింది. ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రిజిస్ట్రేషన్లలో జరిగిన అక్రమాలను నిర్భయంగా బయట పెట్టిన ఆడిట్ అధికారులను అభినందిస్తున్నామని.. అక్రమాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖలో సిబ్బంది కొరత, సదుపాయాల కొరతను తొలగించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. -
‘మియాపూర్’ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు
-
‘మియాపూర్’ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై సీఐడీ విచారణ జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. మియాపూర్ భూ కుంభకోణం వ్యవహారంపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం రద్దు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని లొసుగులకు కళ్లెం వేయాలని సూచించారు. మరోవైపు బెయిల్ కోసం మియాపూర్ భూ కుంభకోణం కేసు నిందితులు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. కాగా, ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా వ్యవహరిస్తున్న గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కోసం 8 బృందాలతో పోలీసులు గాలింపు జరుపుతున్నారు. భార్య, కోడలు, కుటుంబ సభ్యుల పేరుతో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను ఆయన రిజిస్ట్రేషన్ చేయించినట్టు పోలీసులు గుర్తించారు.