పార్థసారథి, శర్మల బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో ఓ సేల్‌డీడ్ తయారు చేశారని, అంతకుమించి ఏమీ జరగలేదని విన్నవించారు. పోలీసులు చెబుతున్నంత తీవ్రమైన కేసు కాదన్నారు. ఇప్పటికే పిటిషనర్ల కస్టడీ కూడా ముగిసిందని, అందువల్ల వారు జైలులో ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి జరిగిన నష్టమేమీ లేదని వివరించారు. అయితే ఈ వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి తోసిపుచ్చారు. నేరపూరిత దురుద్దేశాలతో సేల్‌డీడ్‌లు తయారు చేశారని, దీని వల్ల ప్రభుత్వానికి రూ.కోట్ల మేర నష్టం వాటిల్లిందని కోర్టుకు విన్నవించారు.
పెద్ద మొత్తంలో స్టాంప్ డ్యూటీ ఎగవేశారని తెలిపారు. ప్రభుత్వ భూములను స్వాహా చేయాలన్న దురుద్దేశంతోనే పిటిషనర్లు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇందులో సబ్ రిజిస్ట్రార్ల సాయం తీసుకున్నారని వివరించారు. ఇది చాలా భారీ కుంభకోణమని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, చార్మినార్‌ను అమ్మినంత మాత్రాన దానిపై ఎవరికైనా హక్కులు సంక్రమిస్తాయా అంటూ ప్రశ్నించారు. వ్యక్తి వేరు, ప్రభుత్వం వేరని ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి నష్టం కలిగించడమంటే ప్రజలకు నష్టం కలిగించడమేనని వివరించారు.