
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలో దాదాపు 2 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను సృష్టించి, వాటి ఆధారంగా బ్యాంకు రుణాలు పొందిన వ్యవహారంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతుంటే అధికారులేం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారం పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. విచారణలో తేలిన అంశాలతో సమగ్ర నివేదికను తమ ముందుంచాలని పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 20కి వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా, నెన్నల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి భారీగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని, దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇందూరి రామ్మోహనరావు పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యానికి ‘సాక్షి’లో వచ్చిన కథనాలను జత చేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జోగాపూర్, గొల్లపల్లి, మైలారం, ఘనాపూర్, నెన్నెల తదితర గ్రామాల్లో దాదాపు 2 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పాసు పుస్తకాలు సృష్టించి గ్రామీణ బ్యాంకు నుంచి భారీగా రుణాలు తీసుకున్నారని తెలిపారు. నెన్నెల మండలం ఎంపీపీ భర్త గడ్డం భీమా గౌడ్ 32 ఎకరాలు ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. భూముల విలువ రూ.5 వేల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment