దర్యాప్తు రికార్డులను మా ముందుంచండి | High Court order to govt on Miyapur land scam | Sakshi
Sakshi News home page

దర్యాప్తు రికార్డులను మా ముందుంచండి

Published Wed, Nov 22 2017 3:12 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

High Court order to govt on Miyapur land scam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మియాపూర్‌ భూ కుంభకోణం కేసులో ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు రికార్డులను తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ఈ కుంభకోణంలో కొందరు రిజిస్ట్రార్లు, సబ్‌ రిజిస్ట్రార్ల పాత్ర ఉందని వారిని సస్పెండ్‌ చేశారు. అంటే దీనర్థం అక్రమాలు జరిగా యని నిర్ధారించడమే. 693 ఎకరాలు అన్యాక్రాంతమైతే ఇప్పటి వరకు మీరు ఏం చర్యలు తీసుకున్నారు?’ అని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. ఈ కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

మియాపూర్‌ భూ కుంభకోణంపై ప్రస్తుత దర్యాప్తును సీబీఐకి బదలాయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీజేపీ అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్‌రావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో పిటిషనర్‌ రఘునందన్‌రావు వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేస్తూ.. మియాపూర్‌లోని సర్వే నంబర్లు 20,28,100,101లోని 693 ఎకరాల రిజిస్ట్రేషన్లను రద్దు చేశామని చెప్పిందన్నారు. దీంతోపాటు దండు మైలార్‌లో ఎంపీ కేకేకు చెందిన 70 ఎకరాలసేల్‌డీడ్లను కూడా రద్దు చేసినట్లు పేర్కొందని.. అయితే, సేల్‌డీడ్లను రద్దు చేసే అధికారం రెవెన్యూ అధికారులకు లేదని, ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానాలు స్పష్టం చేశాయన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయలేదన్నారు.

ఈ సమయంలో ప్రతివాదుల తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. కౌంటర్‌ దాఖలు చేసేందుకు గడువు కావాలని కోరారు. దీంతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌ కుమార్‌ను కేసుల పురోగతి గురించి ధర్మాసనం ఆరా తీసింది. దీనికి ఆయన స్పందిస్తూ, పిటిషనర్‌ చెబుతున్న సర్వే నంబర్లకు, మియాపూర్‌ భూ కుంభకోణానికి సంబంధం లేదని చెప్పారు. అయితే రిజిస్ట్రార్లను ఎందుకు సస్పెండ్‌ చేశారు? కేసులెందుకు నమోదు చేశారు? అని ధర్మాసనం ప్రశ్నించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement