
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్‌గా నాగుర్ల వెంకటేశ్వర్లును నియమిస్తూ జీవో జారీ చేసినట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ల ధర్మాసనం నమోదు చేసుకుంది. నియామక ఉత్తర్వుల్ని పరిశీలించిన ధర్మాసనం బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి ప్రభుత్వంపై దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యంపై విచారణను ముగిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఇంద్రసేనారెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యా న్ని దాఖలు చేశారు. కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ హామీ మేరకు ధర్మాసనం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందిగానీ, దానికి ఎవరినీ చైర్మన్‌గా నియమించలేదంటూ ఆయన కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. చైర్మన్ నియామక జీవో ప్రతిని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కుమార్ అందజేయడంతో ఆ వ్యాజ్యాన్ని మూసివేస్తున్న ట్టు ధర్మాసనం ప్రకటించింది.