
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న పీఎస్ ప్రసాద్ (గోల్డ్‌స్టోన్ ప్రసాద్), అతని కుటుంబసభ్యులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన భూముల విషయంలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్(జేసీ) జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. రంగారెడ్డి జిల్లా బాలానగర్ మండలం హస్మత్‌పేట సర్వే నంబర్ 1లోని 74.08 ఎకరాలు, సర్వే నంబర్ 57లోని 39 ఎకరాల భూమిపై ప్రసాద్, అతని కుటుంబసభ్యులు, కంపెనీలు, ఇతరులకు హక్కు కల్పిస్తూ పేర్లను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయొ ద్దని సంబంధిత తహసీల్దార్‌ను ఆదేశించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వందల ఎకరాల భూమిపై 1958 నుంచి కొనసాగుతున్న వివాదంలో తుది తీర్పు వచ్చేవరకు వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. స్పష్టత వచ్చే వరకు ఆ భూములపై హక్కులు కోరజాలరని ప్రసాద్ తదితరులకు స్పష్టం చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రసాద్ తదితరులు చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. కోర్టు తుది తీర్పు ఇవ్వకపోయినా, ఇచ్చినట్లు ప్రసాద్ తదితరులు చేస్తున్న వాదన పిడికెడు బియ్యంలో గంపెడు గుమ్మడికాయను దాచే ప్రయత్నంలా ఉందని ఆక్షేపించింది. 113 ఎకరాల భూమి విషయంలో కోర్టు తమకు అనుకూలంగా తుది తీర్పునిచ్చిందంటూ ప్రసాద్, అతని కుటుంబ సభ్యులు హక్కులు కోరారు. దీంతో బాలా నగర్ తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లను చేరుస్తూ 2011లో ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు జేసీ ముందు రివిజన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన జేసీ 2018లో తహసీల్దార్ ఉత్తర్వులను రద్దు చేశారు. ఈ వ్యవహారంపై తిరిగి విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేయాలని తహసీల్దార్‌ను జేసీ ఆదేశించారు. జేసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రసాద్, అతని కుటుంబసభ్యులు, అతని కంపెనీలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా ధర్మాసనం విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment