కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్‌కు షాక్
హైదరాబాద్: మియాపూర్ భూకోణంలో దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఇంటిపై మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడి చేశారు. బోయిన్‌పల్లిలోని శ్రీనివాసరావు ఇంటితో పాటు ఆయన బంధువులకు చెందిన 11 ఇళ‍్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర‍్వహిస్తున్నారు. భారీ ఎత్తున నగదు, నగలతో పాటు పలు ప్రాంతాలలో భూములు, భవంతులకు సంబంధించిన పత్రాలు లభ‍్యమయ్యాయని తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ శివార్లలోని మియాపూర్‌లో రూ.10 వేల కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో శ్రీనివాసరావు ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక పలువురు రాజకీయ నాయకులు, బడా రియల్టర్ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత విలువైన ఈ ప్రభుత్వ భూములపై కన్నేసిన పలువురు రియల్టర్లు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన రాజకీయ నేతలు కలసి రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెర తీసినట్లు సమాచారం. ఈ కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. కాగా, ఈ నెల 1న హెచ్‌ఎండీఏ పరిధిలో 14 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ దాడులు చేసింది.