► ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్ల రద్దుతో అక్రమార్కులకు చెక్
► మియాపూర్ కుంభకోణంతో సర్కారులో కదలిక
► జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచే బంద్
► బుధవారం నుంచి వేరే ప్రాంతాల్లోని ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు
► అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల కబ్జాకు తెరపడే అవకాశం
► ఇప్పటికే వేలాది ఎకరాల భూములు హాంఫట్...
► జిల్లాలో 20 శాతానికి పైగా ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్లు
సాక్షి, నల్లగొండ : నల్లగొండలో ఉన్న భూములు హుజూర్‌నగర్‌లో.. మోత్కూర్‌లో ఉన్న ఆస్తులు నకిరేకల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇక నుంచి కుదరదు. ఏ ప్రాంతంలో ఉన్న భూములు ఆ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వేల కోట్ల రూపాయల మియాపూర్ కుంభకోణం వెలుగులోకి రావడంతో ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలో అక్రమార్కులకు చెక్ పడనుంది. అధికారికంగా మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచే ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్లను రద్దు చేసినా.. బుధవారం ఉదయం నుంచి పూర్తిస్థాయిలో రద్దు అవుతాయని, ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
20 శాతానికి పైగా..
ఎనీవేర్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లను ఆన్‌లైన్‌లో చేయడం ద్వారా జిల్లాలో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలుస్తోంది. ఎక్కడ భూమి ఉన్నా.. ఏ ప్రాంతంలోని ఆస్తి అయినా యజమానికి తెలియకుండా డాక్యుమెంట్లను రూపొందించి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. వ్యవసాయ భూముల నుంచి భూదాన్, వక్ఫ్‌బోర్డు, ఎన్నెస్పీ, ఇతర ప్రభుత్వ భూములు, ప్రైవేట్ ఆస్తులు ఎనీవేర్ విధానంలో రిజిస్టర్ అయ్యాయని అంచనా. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి భూముల క్రయవిక్రయాలు జరిపే వారికి, కొందరు అక్రమ రియల్టర్లకు ఈ ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు పని సులువు చేశాయి. ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)కు చెందిన మడిగెలు, స్థలాలను కూడా ఈ పద్ధతిలోనే గుట్టుచప్పుడు కాకుండా అమ్మి రిజిస్టర్ చేయించారు. భువనగిరి, హుజూర్‌నగర్ ప్రాంతాల్లో ఉన్న మడిగెలు, ఆలేరులోని భూమిని కూడా నల్లగొండలో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా.. బీబీనగర్‌కు చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐకు సంబంధించిన 24 ఎకరాల భూమిని చౌటుప్పల్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. సదరు యజమాని కేసు పెట్టడంతో అక్రమార్కులను అరెస్టు కూడా చేశారు. దీంతోపాటు రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన నయీం ముఠా.. తాము ఆక్రమించుకున్న భూములను కూడా ఎనీవేర్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయించుకునే వారని, ఇందుకు రిజిస్ట్రేషన్ వర్గాలు సైతం పూర్తిగా సహకరించే వారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పరిస్థితులను ఆసరాగా చేసుకుని..
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరి«ధిలోని 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏటా లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అంచనా కాగా, అందులో 20 శాతానికి పైగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దాదాపు 20 శాతం ఎనీవేర్ రిజిస్ట్రేషన్లుంటే, గ్రామీణ ప్రాంతాల్లోని కార్యాలయాల్లో 30శాతం వరకు ఈ రిజిస్ట్రేషన్లు జరిగేవని రిజిస్ట్రేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్య పరిస్థితులు సరిగా లేని వారు, వయోధికులు, దూర ప్రాంతాల్లో ఉన్న వారు సలువుగా తమ ఆస్తులను క్రయవిక్రయాలు జరుపుకునేందుకు ఈ ఎనీవేర్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించగా, దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు జిల్లాలో ఇప్పటికే వేలాది ఎకరాల భూములు,
కోట్ల విలువైన ఆస్తులను బదలాయించుకున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉండడంతో, అన్ని డాక్యుమెంట్లు తయారు చేయలేక ప్రజలు డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయించాల్సి రావడం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది. డాక్యుమెంట్ రైటర్లు కొందరు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఎక్కడి భూములనైనా, ఏ రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా రిజిస్టర్ చేయించగలిగే పరిస్థితి జిల్లాలో ఉందంటే ఈ అక్రమ వ్యవహారాలు ఎలా సాగేవో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎనీవేర్ రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన నేపథ్యంలో అక్రమార్కుల ఆగడాలకు కళ్లెం పడుతుందని, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి చెక్ పడుతుందని ఆశిద్దాం. కాగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది సబ్ రిజిస్ట్రార్‌లను బదిలీ చేయగా.. ఇందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ముగ్గురు లేదా నలుగురు ఉన్నట్లు సమాచారం.
ఎక్కడి ఆస్తులు అక్కడే..
Published Wed, May 31 2017 7:59 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement