
పొంగులేటి సుధాకర్ రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: పాత కేసులను తిరగదోడటం కన్నా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై ముందు విచారణ జరిపించాలని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎంసెట్, మియాపూర్ భూముల కుంభకోణం, నయీం ఎన్‌కౌంటర్ స్కాం.. ఇలా చాలా స్కాములు వెలుగులోకి వచ్చాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాజకీయ ఎజెండాలో భాగంగానే కాంగ్రెస్ నేతలపై మళ్లీ కేసులు పెట్టాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో అమలవుతున్న సబ్సిడీ పథకాల్లో జరుగుతున్న కుంభకోణంపై విజిలెన్స్ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. విభజన చట్టం హామీలపై సుప్రీంకోర్టులో తాను వేసిన కేసు మూడోసారి విచారణకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదని విమర్శించారు. విభజన హామీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేసులో ఇంప్లీడ్ కావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment