సీఎం నోరెందుకు విప్పడంలేదు?
మియాపూర్ భూ కుంభకోణంపై రేవంత్, రమణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మియాపూర్ ప్రభుత్వ భూముల కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించి సీఎం కేసీఆర్ తన చిత్త శుద్ధి నిరూపించుకోవాలని టీటీడీపీ అధ్యక్షు డు ఎల్.రమణ డిమాండ్ చేశారు. 700 ఎకరాల ప్రభుత్వ భూకుంభకోణం వెలుగు లోకి వచ్చి 20 రోజులు గడుస్తున్నా సీఎం ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తే కేసు నీరుగార్చినట్లేనన్నారు. సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో మియాపూర్ భూ కుంభకోణం నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వ అండదండలతోనే గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అక్రమాల్లో సీఎం పేషీలోని ఆయన సమీప బంధువు కీలకంగా వ్యవహరించారన్నారు. ఎంసెట్ లీకేజీ, నయీమ్ కేసులను అట కెక్కించిన సీఎం.. తాజాగా మియాపూర్ భూముల వ్యవహారాన్ని కూడా బుట్టదాఖలు చేసే యత్నం చేస్తున్నారన్నారు. మియాపూర్ భూ కుంభకోణం రూ.15 వేల కోట్లని, ఇవే కాకుండా.. మణికొండలోని కాందీశీకుల భూములనూ కాజేశారన్నారు.