
దాచిపెట్టి ఎవరి కళ్లు మూస్తారు?
రాష్ట్రంలో రూ.15వేల కోట్ల విలువైన భారీ కుంభకోణంవల్ల ప్రభుత్వానికి నష్టం ఏమీ లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన చేయడం ద్వారా ఎవరి కళ్లు మూస్తారని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
మియాపూర్ భూముల కుంభకోణాన్ని ప్రభుత్వమే బయటపెట్టిందని గొప్పలు చెప్పుకుంటున్న వారే ఇప్పుడు కుంభకోణం ఏమీలేదని చెప్పడం ద్వారా అనుమానాలను మరింత పెంచారని ఆయన పేర్కొన్నారు. కుంభకోణం ఏమీ లేకుంటే అధికారులపై కేసులు ఎందుకు పెట్టారని, ఒకేసారి 72 మంది సబ్ రిజిష్ట్రార్లను ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. పలువురు అధికారులపై ఏసీబీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో సీఎం సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, డి.శ్రీనివాస్‌లపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడానికి సీఎం కేసీఆర్‌కు ఉన్న అభ్యంతరం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం అంతు తేలేదాకా ప్రజాక్షేత్రంలో పోరాడుతామని స్పష్టంచేశారు.