ఆ భూకుంభకోణంపై చర్యలేవీ? | What's the action on that Miyapur land scam? | Sakshi
Sakshi News home page

ఆ భూకుంభకోణంపై చర్యలేవీ?

Published Wed, Jul 26 2017 3:28 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఆ భూకుంభకోణంపై చర్యలేవీ? - Sakshi

ఆ భూకుంభకోణంపై చర్యలేవీ?

మియాపూర్‌ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు
 
సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన మియాపూర్‌ భూముల కుంభకోణం వ్యవహారంలో తీసుకున్న చర్యలేమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రిజిస్టరైన భూముల విస్తీర్ణమెంత, ఎవరిపేర్లపై రిజిస్ట్రేషన్‌ జరిగింది, బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలేమిటి.. తదితర పూర్తి వివరాలు తమ ముందుంచాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజనిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
సుప్రీంకోర్టు ఆదేశించినా..
మియాపూర్‌ భూముల కుంభకోణంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశించాలంటూ బీజేపీ అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్‌రావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రఘునందన్‌రావు వాదనలు వినిపిస్తూ... కొందరు ప్రైవేటు వ్యక్తులు దాదాపు 700 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను తమ సంస్థల పేర్ల మీద అక్రమంగా రిజిస్టర్‌ చేయించుకున్నారని.. తర్వాత వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు రుణాలుగా పొందారని కోర్టుకు తెలిపారు.

అసలు ఆయా భూములను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని 2014 అక్టోబర్‌ 31వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని... ఆ ఆదేశాలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్‌ జరిగిందని, ఇందుకు కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు సహకరించారని వివరించారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని.. పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే కేసును సీబీఐకి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎ.సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. మియాపూర్‌ వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని, బాధ్యులైన సబ్‌ రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేసి, కేసులు నమోదు చేసిందని కోర్టుకు తెలిపారు. విచారణ కొనసాగుతోందని వివరించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడానికి ముందు ప్రభుత్వం నుంచి కొన్ని వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. అసలు అక్రమంగా రిజిస్టరైన భూముల విస్తీర్ణమెంత, ఎవరి పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ జరిగింది, ఎవరు చేశారు, ఎంత మొత్తాలు చెల్లించారు, బాధ్యులైన అధికారుల పేర్లు, వారిపై తీసుకున్న చర్యలు.. ఇలా పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement