భూ కుంభకోణం నిందితులకు హైకోర్టు షాక్
భూమి మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరమని, దానిని దురాక్రమణదారుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించారు. అంతేకాక పిటిషనర్లకు చెందిన కంపెనీలు నిజమైనవా? లేక డొల్ల కంపెనీలా అన్న విషయం తేలాల్సి ఉందన్నారు. మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పార్థసారథి, శర్మలకు కూకట్‌పల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లపై మంగళవారం వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ దశలో పిటిషనర్లకు బెయిలిస్తే వారు మరిన్ని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. పూర్తిస్థాయి దర్యాప్తు ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఇది పోలీసులు చెబుతున్నంత తీవ్రమైన కేసు కాదన్న పిటిషనర్ల వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ కేసుతో రూ.700 కోట్ల విలువైన భూములు ముడిపడి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ, ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదంటూ వారి పిటిషన్లను కొట్టేశారు.