భూ కుంభకోణాలపై ప్రజా విచారణ చేపడతాం
- టీజేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్: మియాపూర్ భూములపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే అన్ని దస్తావేజులతో బహిరంగంగా ప్రజా విచారణ జరుపుతామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం హెచ్చరించారు. జేఏసీ కోచైర్మన్ గోపాలశర్మ అధ్యక్షతన మియాపూర్ భూకుంభకోణంపై హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే సంపన్నులకు అక్రమంగా కట్టబెడుతున్నదని విమర్శించారు. కాగితాల్లోనే భూములు మారాయని, ఎక్కడి భూములు అక్కడే ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే ఆ భూముల్లో భారీ విల్లాలు, అపార్టుమెంట్లు నిర్మాణమైనాయని, వాటిని పెద్దపెద్ద వ్యక్తులు కొన్నారని స్థానికులు చెబుతున్నారన్నారు. ఈ కుంభకోణంలో వాస్తవాలను వెలికి తెచ్చేందుకు కరపత్రాలు వేస్తామన్నారు. ప్రభుత్వ భూములను అధ్యయనం చేసిన ఎస్.కె.సిన్హా కమిటీ నివేదికను బయటపెట్టాలని, కుంభకోణంపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా ప్రభుత్వం గుర్తించిన భూముల వివరాలను బయటపెట్టాలని, వాటిని సంరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
భూములు కబ్జా కాలేదని, స్కాం లేదని సీఎం చేసిన ప్రకటనతోనే భూకబ్జాదారులకు బెయిల్ దొరికిందనే వార్తలు రావడం గమనార్హమని కోదండరాం అన్నారు. పేదలకు ఇళ్లు కట్టించడానికి, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడానికి భూములు లేవని చెబుతున్న ప్రభుత్వం వందలాది ఎకరాలను సంపన్నులకు కట్టబెడుతున్నదనిఘాయన విమర్శించారు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దామోదర్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో నిజాంకాలం నాటి నుంచి ఉన్న ప్రభుత్వ భూములు, వాటి స్వరూపం గురించి వివరించారు. ప్రజల అవసరాలను గుర్తించి భావితరాల అవసరాల కోసం ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం తగిన చర్యలను తీసుకున్నారని వివరించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూమి ఎంతో సరైన లెక్కలు ఇప్పటికీ లేవన్నారు. భూమి ఎక్కడ ఉందో, ఎంత ఉందో తెలుసుకోవడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. హైకోర్టు న్యాయవాది గోపాలశర్మ మాట్లాడుతూ ప్రభుత్వంలోని పెద్దలకు దగ్గరగా ఉన్నవారికి ప్రభుత్వ భూములను పంచిపెట్టినా ఎవరూ అడ్డుకోలేరనే అహంకారంతో వ్యవహరిస్తున్న పాలకులకు బుద్ది చెప్పాలన్నారు. సమావేశంలో జేఏసీ నేతలు భైరి రమేశ్, మాదు సత్యం, న్యాయ నిపుణులు పాల్గొన్నారు.