ఎనీవేర్‌ అక్రమాలు! | Anywhere irregularities! | Sakshi
Sakshi News home page

ఎనీవేర్‌ అక్రమాలు!

Published Wed, May 31 2017 10:04 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ఎనీవేర్‌ అక్రమాలు! - Sakshi

ఎనీవేర్‌ అక్రమాలు!

సర్కారు కొంపముంచిన ‘ఎనీవేర్‌’ రిజిస్ట్రేషన్‌
ల్యాండ్‌ మాఫియాకు కొమ్ముకాసినసబ్‌రిజిస్ట్రార్లు
నిషేధిత ప్రభుత్వ స్థలాలు ధారాదత్తం చేసే ఎత్తుగడ
ఎల్‌బీనగర్‌లోనూ అక్రమాల పరంపర


‘ఎక్కడైనా రిజిస్ట్రేషన్‌’ చేసుకోవచ్చనే వెసులుబాటు సర్కారు కొంపముంచింది. మియాపూర్‌ భూ కుంభకోణంతో ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చినా.. ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌లు రిజిస్ట్రార్ల అడ్డగోలు వ్యవహారాలకు అండగా నిలిచాయి. జిల్లాలో భూముల విలువలు నింగినంటడంతో అక్రమాలకు తెరలేచింది. ప్రభుత్వ నిషేధిత జాబితా (22ఏ)లోని భూములను కూడా చట్టబద్ధం చేసుకునేందుకు పావులు కదిపిన ల్యాండ్‌ మాఫియాతో సబ్‌ రిజిస్ట్రార్లు కుమ్మక్కు కావడంతో ‘ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌’ విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల క్రయవిక్రయాలు, ఇతర దస్తావేజుల నుంచి ఎక్కడైనా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తూ 2009లో రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ‘ఎనీవేర్‌’ పద్ధతిని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అనంతరం దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తెచ్చింది. ఇదే ఇప్పుడు అక్రమ వ్యవహారాలకు దారి చూపింది. ముఖ్యంగా నగర శివార్లలో భూముల ధరలకు రెక్కలు రావడం.. కోట్లాది రూపాయలు పలకడంతో రెవెన్యూ వివాదాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే వివాదాస్పద ఆస్తులను రిజిస్టర్‌ చేసుకునేందుకు ఈ విధానాన్ని అక్రమార్కులు అదనుగా మలుచుకున్నారు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి మండలంలో దాదాపు వేలాది ఎకరాలకు కొందరు ప్రైవేటు  వ్యక్తులు ఎసరు పెట్టే ప్రయత్నం చేశారు. కోట్ల విలువ చేసే భూమిని కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం ద్వారా నిషేధిత భూమిపై హక్కులు పొందేలా వ్యూహరచన చేశారు. 22ఏ రికార్డు ప్రకారం ఈ భూములను రిజిస్ట్రేషన్‌ చేయకూడదని ఆంక్షలున్నా.. ఇదేమీ పట్టని సబ్‌రిజిస్ట్రార్‌ భూ మాఫియాతో చేతులుకలిపి అడ్డగోలు వ్యవహారాలు నెరిపారు. ముఖ్యంగా గతంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కూకట్‌పల్లి, బాలానగర్, మేడ్చల్‌ సబ్‌ రిజిస్ట్రార్ల పరిధిలో ఈ అక్రమాలు జరిగినట్లు తాజాగా ప్రభుత్వం గుర్తించింది. బడాబాబులతో చేతులు కలిపిన అధికారులు సర్కారీ భూములను ఎడాపెడా రిజిష్టర్‌ చేసినట్లు తెలిసింది.

నెలకు సగటున 300 డాక్యుమెంట్లు..!
ఎనీవేర్‌ భాగంగా ప్రతి నెలా కూకట్‌పల్లి, బాలానగర్‌లో 300 డాక్యుమెంట్లు నమోదయ్యేవి. ఈ రెండు కార్యాలయాల సబ్‌ రిజిస్ట్రార్లు అవకతవకలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలవడంతో వివిధ ప్రాంతాల్లోని వివాదాస్పద, నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఇక్కడ చకచకా జరిగిపోయేవి. ముఖ్యంగా సూరారం, గచ్చిబౌలి తదితర ప్రాంతాల డాక్యుమెంట్లు ఈ రిజిస్ట్రార్ల పరిధిలో గణనీయంగా జరిగినట్లు అధికారుల విచారణలో తేలింది.

ఖజానాకు గండి!
కేవలం అక్రమ రిజిస్ట్రేషన్లేకాకుండా.. సర్కారు ఆదాయానికి కొందరు ఎస్‌ఆర్‌లు గండికొట్టినట్లు తేలింది. ప్రస్తుత మేడ్చల్‌ ఎస్‌ఆర్‌ రమేశ్‌చంద్రారెడ్డి గతంలో ఎల్‌బీనగర్‌ ఎస్‌ఆర్‌గా పనిచేసినప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమైంది. ఈ క్రమంలోనే ఆయనపై అభియోగాలు నమోదు కావడంతో మంగళవారం ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు కావడంతో అరెస్టు కూడా అయ్యారు. ఓ ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూమిని 2016లో ప్రైవేటు వ్యక్తుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు స్పష్టం కావడంతో ఆయనపై వేటు పడింది. ఇవేకాకుండా.. విలువ ఆధారిత పన్ను, భూమి విలువ మదింపులో చేతివాటం ప్రదర్శించడంతో సుమారు రూ.2.86 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని తేలింది. ఇవేకాకుండా మరికొన్ని డాక్యుమెంట్లలోనూ ఆయన పాత్రపై ప్రభుత్వం విచారణ సాగిస్తోంది.

ఈ పరిణామాలన్నింటిని విశ్లేషించిన ప్రభుత్వం.. ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ వల్ల లాభం కన్నా.. నష్టమే ఎక్కువ అనే అంచనా కొచ్చింది. దీంతో ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, నిషేధిత జాబితాలో భూముల రిజిస్ట్రేషన్లపై సబ్‌ రిజిస్ట్రార్ల వాదన మరో విధంగా ఉంది. 2013లో కేవలం నిషేధిత స్థలాలపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని జిల్లా యంత్రాంగం చెప్పింది తప్పితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయలేదని రాష్ట్ర సబ్‌ రిజిస్ట్రార్ల సంఘం అధ్యక్షుడు విజయభాస్కరరావు అన్నారు. నోటిఫికేషన్‌ జారీ చేయనప్పటికీ, అంతర్గతంగా జాబితా పంపినా సమస్య ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement