- ఆయన నుంచి భూములు కొని బ్యాంకులకు తాకట్టు
- ఏకంగా రూ.550 కోట్ల రుణం పొందిన ఓ వ్యాపారి
సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌స్టోన్ ప్రసాద్ చేసిన భూమాయకు బ్యాంకులు కూడా బోల్తా పడ్డాయి. హైదర్‌నగర్ సర్వే నంబర్ 172లోని వివాదాస్పద భూమికి సైతం కోట్లాది రూపాయల రుణం ఇచ్చాయి. నిజాం వారసులు, పైగా, సైరస్ కుటుంబీకులకు సంబంధించిన భూ వివాదం కేసులో ఫైనల్ డిక్రీ రాకున్నా.. ఆ భూములను గోల్డ్‌స్టోన్ ప్రసాద్ అనుయాయులకు కట్టబెట్టడమే కాకుండా, ఇతరులకు కూడా దర్జాగా వాటిని విక్రయించారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్ చెబుతున్న జీపీఏ అసలు ఉందో లేదో పరిశీలించకుండానే కొందరు సబ్ రిజి స్ట్రార్‌లు ఎడాపెడా రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో భూ అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. మియాపూర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, హైదర్‌నగర్‌లలో వేలాది ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు ప్రైవేటు పరమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా హైదర్‌నగర్‌లోని సర్వే నంబరు 172లోని 196.20 ఎకరాలను దశలవారీగా ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్న వైనాన్ని ‘సాక్షి’ఆదివారం వెలుగులోకి తీసుకు వచ్చింది. ఈ కుంభకోణంలో మరిన్ని కొత్త కోణాలు బయటపడ్డాయి.
ఇదీ రుణ మాయాజాలం..
హైదర్‌నగర్ సర్వే నంబరు 172లోని 48 ఎకరాలను గోల్డ్‌స్టోన్ ప్రసాద్ నుంచి నగరానికి చెందిన ఓ జ్యూయలరీ వ్యాపారి కొనుగోలు చేశాడు. ఈ భూమి మొత్తాన్ని తనకు చెందిన 13 సూట్ కేసు కంపెనీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి, ఆ భూములపై పంజాబ్‌కు చెందిన ఓ జాతీయ బ్యాంకు నుంచి రూ.550 కోట్లు రుణంగా పొందాడు. ఆ భూములను బ్యాంకు పేరిట మార్ట్‌గేజ్ రిజిస్ట్రేషన్ చేయించాడు. దానిలో పేర్కొన్న వివరాల ప్రకారం గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు ముంబైకి చెందిన సైరస్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి జీపీఏ ఉందని, దాని ద్వారా సంక్రమించిన హక్కుల మేరకు విక్రయించినట్లు పేర్కొన్నారు.
గోల్డ్‌స్టోన్ ప్రసాద్ పేర్కొన్నట్టు ఆ జీపీఏ నకలు పత్రాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించలేదు. జీపీఏ రిజిస్ట్రేషన్ నంబర్ గానీ, జీపీఏ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగిందన్న వివరాలను కూడా దస్తావేజులో పేర్కొనలేదు. జీపీఏకు సంబంధించిన కనీస వివరాలనూ పరిశీలించకుండా కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ మార్ట్‌గేజ్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడం, ఆ మార్ట్‌గేజ్‌తో జ్యూయలరీ వ్యాపారి బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవడం జరిగిపోయాయి. భూముల కొన్న జ్యూయలరీ వ్యాపారీ గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తేనని, మరికొన్ని భూ కుంభకోణాల్లోనూ అతని పాత్ర ఉందని సమాచారం.