► ఏపీ వైఖరికి నిరసనగా తెలంగాణ వాకౌట్
► బస్ భవన్ ఒక్కటే పంచాలన్న టీఎస్‌ఆర్‌టీసీ
► మొత్తం 14 ఆస్తులు పంచాలన్న ఏపీఎస్‌ఆర్‌టీసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ విభజనకు మళ్లీ పీటముడి పడింది. హెడ్‌క్వార్టర్ అనే అంశంపై కేంద్రం ఇచ్చిన వివరణ మీద తెలంగాణ, ఏపీలు భిన్నమైన వాదనలు వినిపించడంతో వివాదం మొదటికొచ్చింది. దీంతో ఆర్టీసీ ఆస్తుల పంపిణీ, విభజనపై చర్చించేందుకు శుక్రవారం విజయవాడలో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ఏపీ అనుసరించిన ఏకపక్ష వైఖరికి నిరసనగా తెలంగాణ అధికారులు ఆర్టీసీ బోర్డు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఆర్టీసీ ఎండీ రమణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు పరిపాలన భవనమొక్కటే ఉమ్మడి ఆస్తిగా పరిగణించాలని తెలంగాణ అధికారుల బృందం సమావేశం ఆరంభంలోనే తమ వాదనను వినిపించింది.
మొత్తం 14 ఆస్తులను ఉమ్మడి ఆస్తులుగా పరిగణించాలని, విభజన చట్టం ప్రకారం జనాభా దామాషా మేరకు వీటన్నింటినీ పంపిణీ చేయాలని ఏపీ పట్టుబట్టింది. 14 ఆస్తుల్లో 13 తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయని, బస్‌భవన్ ఒక్కటే హెడ్ క్వార్టర్ పరిధిలోకి వస్తుందని టీఎస్‌ఆర్‌టీసీ తమ ప్రతిపాదనల నోట్‌ను సమావేశం ముం దుంచింది. దీంతో వాదోపవాదాలతో సయోధ్య కుదరలేదు. మధ్యేమార్గంగా రెండు బోర్డులు ఇచ్చిన నోట్‌లను, షీలాభిడే కమిటీ చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని, కేంద్రం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుందామని టీఎస్‌ఆర్‌టీసీ బోర్డు డైరెక్టర్లు సూచించారు. ఈ సూచనను సైతం ఏపీఎస్‌ఆర్‌టీసీ ఆంగీకరించలేదు.