గందరగోళంగా మారిన ఆర్టీసీ విభజన త్వరలోనే కొలిక్కి రానుంది. దసరాలోగా విభజన పూర్తిచేసి రెండు రాష్ట్రాలకు ఆర్టీసీ బోర్డులను ప్రకటించే కసరత్తు వేగవంతమైంది.
13న షీలా బేడీ కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: గందరగోళంగా మారిన ఆర్టీసీ విభజన త్వరలోనే కొలిక్కి రానుంది. దసరాలోగా విభజన పూర్తిచేసి రెండు రాష్ట్రాలకు ఆర్టీసీ బోర్డులను ప్రకటించే కసరత్తు వేగవంతమైంది. విభజన కమిటీకి చైర్మన్‌గా ఉన్న ఉన్నతాధికారిణి షీలా బేడీ నేతృత్వంలో సభ్యులు 13వ తేదీన భేటీ కానున్నారు. అనంతరం పూర్తి స్థాయి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కమిటీ సమర్పించనుంది. సభ్యులు ఇప్పటికే జూలై 1న సమావేశమై ఇరు ప్రాంతాలకు చెందిన ఆస్తుల పంపకాలు, అప్పులపై లెక్కలు తేల్చారు. ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం, తెలంగాణకు 42 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించారు. ఆంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లో ఉన్న 123 డిపోల్లో 10,600 బస్సులు, ఉమ్మడిగా ఉన్న అప్పు రూ.4,700 కోట్లలో రూ.2,633 కోట్లు ఆంధ్ర వాటాగా తేల్చారు. ఉమ్మడిగా ఉన్న 14 ఆస్తుల విషయంలోనే వివాదాలు తలెత్తాయి. పైగా ఆంధ్రకు ఇంకా 1,005 బస్సులు రావాలని, ఆర్టీసీకి హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల్ని లెక్కగట్టి ఆ విలువ తమకు ఇవ్వాలని ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు పట్టుబడుతున్నారు. బస్ భవన్‌తో పాటు హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులకు రూ.1,500 కోట్లు ఇవ్వాలని కోరగా, పదేళ్ల పాటు ఉమ్మడిగా వినియోగించుకోవడమే తప్ప నిధులిచ్చే ప్రసక్తి లేదని తెలంగాణ తేల్చిచెప్పింది.
ఈ వివాదం కొనసాగుతుండగా, ఆర్టీసీ సంస్థలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ విభజన జరగకుంటే నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో షీలా బేడీ నేతృత్వంలో సభ్యులు ఏకే గోయల్, కె.నరసింగరావు, కేఎన్‌రావు వివాదాలు తేల్చే ప్రక్రియను వేగిరపరిచారు. విభజనకు రెండు నెలలు సమయం పడుతుందని ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు ఇప్పటికే ప్రకటించారు. దసరా నాటికి రెండు ఆర్టీసీ బోర్డులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీకి సంబంధించి ఆర్టీసీకి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తే తప్ప నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు.