సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తున్న
యువకుడిని కొట్టిన కమిటీ సభ్యులు
కలిదిండి(కై కలూరు): దసరా ఉత్సవాల్లో ఎటువంటి అశ్లీల, అసభ్యకర నృత్యాలు చేయకూడదని జిల్లా ఎస్సీ పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు కమిటీ సభ్యులు మాటవినడం లేదు. ఏలూరు జిల్లా కోట కలిదిండిలో 30వ వార్షికోత్సవ దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి మ్యూజికల్ నైట్, డాన్స్ బేబీ డాన్స్ ఏర్పాటు చేశారు. ఇదే మండలం పోతుమర్రు పంచాయతీ గొల్లగూడెం నుంచి 10 మంది మైనర్ యువకులు కార్యక్రమాన్ని తిలకించడానికి కోట కలిదిండి వచ్చారు. డాన్సులను సెల్‌ఫోన్‌లలో చిత్రీకరిస్తుండగా కమిటీ సభ్యులు సెల్‌ఫోన్లు లాక్కున్నారు.
పడమటి ప్రేమ్‌సాగర్ అనే యువకుడుని కొట్టారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ప్రేమసాగర్ తల్లి పడమటి వెంకటరమణ తాగిన మైకంలో తన బిడ్డను పేటేటి సత్యనారాయణ, గంధం వాసు, చిట్టూరి పరుశురాం, సుబ్బారావులు కొట్టారని కలిదిండి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. తన కుమారుడితో పాటు మరో యువకుడిని బంధించి హింసించారని సెల్‌ఫోన్లు లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం కొడుకును కై కలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకువెళ్లింది. దోషులను కఠినంగా శిక్షించాలని కోరింది.
నృత్యాలు వీడియా ఇప్పటిది కాదు
వాస్తవానికి ఈ నెల 5న అదే స్టేజీమీద మ్యూజికల్ నైట్‌లో నృత్యాలు జరిగినట్లు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఏలూరు డీఎస్పీ, సీఐలు విచారణ చేస్తున్నారు. నిర్వాహకులపై యువకులపై దాడి, అసభ్యకర నృత్యాల ప్రదర్శనపై కేసుల నమోదుకు పోలీసులు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. దీనిపై కలిదిండి ఎస్సై వేంకటేశ్వరరావును వివరణ కోరగా మంగళవారం గొడవ జరిగిన మాట వాస్తవమేనని అందుకు బాధ్యులైన వారిపై విచారించి కేసులు నమోదు చేస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న అసభ్యకర నృత్యాలు వీడియో ఇప్పటిది కాదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment