RTC board
-
ఆర్టీసీ ఒకటేనా.. రెండా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఆర్టీసీ విభజన పెద్ద వివాదాంశం. అధికారులు, కార్మిక సంఘాలు ఒకరి వాదనను ఒకరు ఖండిస్తూ ఫిర్యాదులతో హోరెత్తించారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల్లో రెండు ఆర్టీసీలు ఏర్పాటు కావడంతో అందరూ వివాదాలను ‘మరిచిపోయారు’. అయితే తాజాగా టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణ సందర్భంగా సంస్థ ఉనికినే హైకోర్టు ప్రశ్నించే పరిస్థితి రావడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ అప్పట్లో జరిగిందేమిటి, ఇప్పుడెందుకు ఇది వివాదంగా మారింది? పీటముడి ఇక్కడే... రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం ఆర్టీసీ బస్సులు, సిబ్బంది విభజన విషయంలో పెద్దగా సమస్య లేకున్నా ఆస్తుల విషయంలో పేచీ ఏర్పడింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎండీ కార్యాలయం, తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి, హకీంపేటలోని ఆర్టీసీ శిక్షణ కేంద్రం, మియాపూర్‌లోని ఆర్టీసీ బస్ బాడీ యూనిట్... ఇలా 14 ఆస్తులను 58:42 దామాషాలో పంచుకోవాలని ఏపీ అధికారులు, కార్మిక సంఘాలు పేర్కొనగా హైదరాబాద్‌లో ఆర్టీసీ నిజాం కాలం నుంచి వచ్చిందని, దానిపై పూర్తి హక్కు తెలంగాణకే ఉంటుందని తెలంగాణ అధికారులు, కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. ఆర్టీసీ సాంకేతికంగా ఉమ్మడిగా ఉండేందుకు ఇదే కారణమైంది. కమిటీ సిఫార్సులు ఇచ్చినా... రాష్ట్రం విడిపోయాక రెండుసార్లు ఆర్టీసీ బోర్డు సమావేశాలు జరిగాయి. తొలి సమావేశంలో ఆర్టీసీ ఆస్తులు, అప్పులకు సంబంధించి రెండు వైపుల నుంచి రెండు నివేదికలు అందాయి. వాటిని ఇరుపక్షాలూ పరస్పరం వ్యతిరేకించాయి. ఆ తర్వాత రెండో బోర్డు సమావేశం నాటికి షీలాభిడే కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. అయితే అందులో హెడ్ క్వార్టర్స్ నిర్వచనం ఆంధ్ర నివేదిక ఆధారంగా చేసినట్లు ఉందంటూ తెలంగాణ అధికారులు వ్యతిరేకించారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో సూచించిన విధంగా ఆ సిఫార్సులు లేవంటూ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. కానీ ఇప్పటివరకు హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశం వెలువడలేదు. పాలనాపరమైన వ్యవహారాల కోసం... ఆర్టీసీ చట్టంలోని సెక్షన్–3 ప్రకారం సొంతంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులతో సంయుక్తంగా ఏర్పాటైన కమిటీ పాలనాపరమైన వెసులుబాటు కోసం రెండు వేర్వేరు కార్పొరేషన్లు నిర్వహించుకోవాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం 2016 ఏప్రిల్ 27న ప్రభుత్వ ఉత్తర్వు నం.31 ద్వారా ప్రత్యేకంగా టీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేసుకుంది. ఈ మేరకు ఆర్టీసీ బోర్డు సమావేశంలో తీర్మానం చేసి ఆ ప్రతిని షీలాభిడే కమిటీకి పంపారు. సాంకేతికంగా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి ఆర్టీసీ ఉన్నా ఈ వెసులుబాటుతో విడివిడిగా ఏర్పాటయ్యాయి. జేఎండీ టు ఎండీ... రాష్ట్ర విభజన జరిగే సమయంలో ఉమ్మడి ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి సాంబశివరావు ఉన్నారు. రెండు రాష్ట్రాలు విడివిడిగా ఏర్పడ్డా.. విజయవాడ కేంద్రంగా ఆయన ఆధ్వర్యంలోనే రెండు ఆర్టీసీలు కొనసాగాయి. అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ సారథిగా జేఎండీ పోస్టు ఏర్పాటైంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో దీని ప్రస్తావన ఉన్నందునే తెలంగాణకు ప్రత్యేకంగా జేఎండీని ఏర్పాటు చేశారని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ఆర్టీసీ ఈడీగా పనిచేసి పదవీ విరమణ పొందిన రమణారావును ప్రభుత్వం 2014 ఆగస్టులో ఏడాది కాలానికి ఈ పోస్టులో నియమించింది. ఏడాది తర్వాత ఆయనకు ప్రభుత్వం మళ్లీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. కానీ 2016 ఏప్రిల్‌లో ప్రభుత్వం టీఎస్ఆర్టీసీకి సోమారపు సత్యనారాయణను చైర్మన్‌గా నియమించింది. చైర్మన్ ఉండి ఎండీ పోస్టు లేకపోవడం వెలితిగా ఉండటంతో అప్పటివరకు జేఎండీగా ఉన్న రమణారావును అదే సంవత్సరం జూన్ 16న ఎండీగా నియమించింది. కేంద్రం వాదనే మా మాట ‘ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉంది. సాంకేతికంగా విభజన జరగనందున కేంద్రం వాటా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నట్లే. ఇప్పుడున్న బస్సులు, సిబ్బంది దానికి చెందిన వారే. విభజనే జరగని సంస్థలో కొంత భాగాన్ని ఎలా ప్రైవేటీకరిస్తారు? కేంద్రం అనుమతి లేకుండా ఎలా ప్రైవేటీకరిస్తారు? మొన్న కోర్టులో వినిపించిన కేంద్రం వాదననే మేం బలపరుస్తున్నాం’ – ఆర్టీసీ జేఏసీ–1 కన్వీనర్ హన్మంతు, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు తిరుపతి కేంద్రం ఇరుకున పడదా? మోదీ ప్రభుత్వం ఫేమ్ పథకం కింద బ్యాటరీ బస్సులు మంజూరు చేస్తోంది. తొలి విడతలో తెలంగాణ ఆర్టీసీకి 40 ఏసీ బస్సులిచ్చింది. రెండో విడతలో ఏపీకి 300, తెలంగాణ ఆర్టీసీకి 325 కేటాయించింది. మరి సంస్థ ఉమ్మడిగా ఉన్నప్పుడు టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీకి విడివిడిగా ఎలా కేటాయించింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. దీనికి కేంద్రం ఏం సమాధానం చెబుతుంది. అది ఇరుకున పడే విషయమే కదా? – న్యాయ నిపుణులు -
విభజన చట్టం మేరకే...
♦ ఆర్టీసీ విభజనపై కేసీఆర్ ♦ వివాదం కూడదన్న ముఖ్యమంత్రి ♦ ఏపీతో స్నేహపూర్వకంగానే ఉంటాం ♦ కాదంటే కేంద్రమే చూసుకుంటుంది ♦ ఆర్టీసీ బోర్డు ప్రతినిధులకు స్పష్టీకరణ ♦ నేటి విజయవాడ భేటీలో ఇదే చెప్పాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ‘‘ఆర్టీసీ ఆస్తుల విభజనకు విభజన చట్టంలో పేర్కొన్న విధానాన్నే అనుసరించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా జరగిన విభజన పద్ధతులనే ఆర్టీసీ ఆస్తులకూ వర్తింపజేయాలి’’అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ విభజన ఒక వాస్తవం. ఈ వాస్తవాన్ని ముందు అంతా అంగీకరించాలి. రెండు రాష్ట్రాలకు సంబంధించి విజ్ఞతతో ఎవరి పాలన వారు చేసుకోవాలి. ఎవరి సంస్థలు వారు నడుపుకోవాలి. విభజన నేప థ్యంలోనే ఏపీఎస్ఆర్టీసీ విభజన కూడా జరుగుతోంది. కాబట్టి రాష్ట్ర విభజనకు వర్తించిన నిబంధనలే దానికీ వర్తిస్తాయి. పార్లమెంటు చట్టానికి లోబడే పంపకాలు జరుగుతాయి. ఈ విషయమై ఆర్టీసీ బోర్డు చేతిలో ఎలాంటి అధికారమూ లేదు’’అని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ ఆస్తుల విభజనపై ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటిదాకా సయోధ్య కుద రని విషయం తెలిసిందే. ఆగస్టులో జరిగిన ఆర్టీసీ బోర్డు భేటీలో రెండు రాష్ట్రాల ప్రతినిధులు విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ ఇటీవలి నిర్వచనం ప్రకారం బస్‌భవన్‌ను మాత్రమే ఉమ్మడి ఆస్తిగా పరిగణించాల్సి ఉంది. బోర్డు భేటీ లో రాష్ట్ర ప్రతినిధులు ఇదే అభిప్రాయం చెప్పగా ఏపీ అధికారులు ససేమిరా అన్నారు. ఆర్టీసీ విభజనపై శుక్రవారం మరోసారి భేటీ జరగనున్న నేపథ్యంలో బోర్డు సభ్యులైన ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్‌శర్మ, ఆర్టీసీ ఎండీ రమణా రావులతో పాటు మంత్రి మహేందర్‌రెడ్డి బుధ వారం సీఎంతో భేటీ అయ్యారు. విభజనపై కేంద్రం జారీ చేసిన స్పష్టమైన విధి విధానాల ప్రకారమే ఆర్టీసీ విభజన ఉంటుందని సీఎం తెలిపారు. ‘‘ఇరుగుపొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలనే రాష్ట్ర మౌలిక విధానానికి అనుగుణంగా ఏపీతో విభజన సమస్యలను పరిష్కరించుకుందాం. కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు అమలు చేసిన నిబంధనలనే ఏపీ విభజనకూ అనుసరించా రు. సమస్యలు తలెత్తితే రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలి. కాని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది. అయినా పరిష్కా రం కాకుంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయి. ఏ వివాదమైనా అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు చేసిన విభజన చట్టం మేరకే పరిష్కారమవాలి’’అని అన్నారు. ఇదే వైఖరిని విజయవాడ సమావేశంలో వెల్లడించాలని సూచించారు. ఏపీకి ఇవ్వాల్సింది రూ.8 కోట్లే కేంద్ర హోం శాఖ ఆదేశాలమేరకు బస్‌భవన్ విలువను మాత్రమే రెండు రాష్ట్రాల మధ్య పంచుకోవాల్సి ఉంది. ఏపీ మాత్రం 14 ఆస్తులు ఉమ్మడిగా ఉంటాయని, వాటిని జనాభా దామాషా ప్రాతిపదికన పంచాల్సిందేనని వాదిస్తోంది. వీటిలో 13 ఆస్తులు రాష్ట్రంలో ఉన్నాయి. మిగ తాది ఏపీలోని ప్రకాశం జిల్లా రామ్‌గిరిలోని పవన విద్యుత్తు ప్లాంటు. ఇవన్నీ ఉమ్మడి జాబి తాలోకి రావని తెలంగాణ చెబుతోంది. ‘‘బస్‌భవన్ మాత్రమే ఉమ్మడి ఆస్తి. అందులోనూ ఆ భూమి నిజాం ప్రభుత్వం ఇచ్చింది గనుక దాని పై ఏపీకి హక్కుండదు. విభజన విషయంలో భవనం పుస్తక విలువను మాత్రమే పరిగణనలో కి తీసుకుంటే ఏపీ వాటా రూ.8 కోట్లు తేలుతుంది’’అని ఇటీవలి భేటీలో తెలంగాణ తెలిపింది. ఉమ్మడి ఆర్టీసీ మొత్తాన్ని యూనిట్‌గా చేసుకుని లాభనష్టాలను లెక్కించి దాన్ని జనాభా దామాషాలో కేటాయించాలన్న ఏపీ వాదనను ఖండించింది. ఏ ప్రాంత నష్టాలు ఆ రాష్ట్రానివేనని 2014 మేలో విభజనకు నెల ముందు జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానం జరిగిందని విజ యవాడ భేటీలో అధికారులు గుర్తు చేశారు. శుక్రవారం కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తామని రమణారావు ‘సాక్షి’తో చెప్పారు. -
దసరాకల్లా ఆర్టీసీ విభజన
13న షీలా బేడీ కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్: గందరగోళంగా మారిన ఆర్టీసీ విభజన త్వరలోనే కొలిక్కి రానుంది. దసరాలోగా విభజన పూర్తిచేసి రెండు రాష్ట్రాలకు ఆర్టీసీ బోర్డులను ప్రకటించే కసరత్తు వేగవంతమైంది. విభజన కమిటీకి చైర్మన్‌గా ఉన్న ఉన్నతాధికారిణి షీలా బేడీ నేతృత్వంలో సభ్యులు 13వ తేదీన భేటీ కానున్నారు. అనంతరం పూర్తి స్థాయి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కమిటీ సమర్పించనుంది. సభ్యులు ఇప్పటికే జూలై 1న సమావేశమై ఇరు ప్రాంతాలకు చెందిన ఆస్తుల పంపకాలు, అప్పులపై లెక్కలు తేల్చారు. ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం, తెలంగాణకు 42 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించారు. ఆంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లో ఉన్న 123 డిపోల్లో 10,600 బస్సులు, ఉమ్మడిగా ఉన్న అప్పు రూ.4,700 కోట్లలో రూ.2,633 కోట్లు ఆంధ్ర వాటాగా తేల్చారు. ఉమ్మడిగా ఉన్న 14 ఆస్తుల విషయంలోనే వివాదాలు తలెత్తాయి. పైగా ఆంధ్రకు ఇంకా 1,005 బస్సులు రావాలని, ఆర్టీసీకి హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల్ని లెక్కగట్టి ఆ విలువ తమకు ఇవ్వాలని ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు పట్టుబడుతున్నారు. బస్ భవన్‌తో పాటు హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులకు రూ.1,500 కోట్లు ఇవ్వాలని కోరగా, పదేళ్ల పాటు ఉమ్మడిగా వినియోగించుకోవడమే తప్ప నిధులిచ్చే ప్రసక్తి లేదని తెలంగాణ తేల్చిచెప్పింది. ఈ వివాదం కొనసాగుతుండగా, ఆర్టీసీ సంస్థలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ విభజన జరగకుంటే నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో షీలా బేడీ నేతృత్వంలో సభ్యులు ఏకే గోయల్, కె.నరసింగరావు, కేఎన్‌రావు వివాదాలు తేల్చే ప్రక్రియను వేగిరపరిచారు. విభజనకు రెండు నెలలు సమయం పడుతుందని ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు ఇప్పటికే ప్రకటించారు. దసరా నాటికి రెండు ఆర్టీసీ బోర్డులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీకి సంబంధించి ఆర్టీసీకి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తే తప్ప నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు.