ఆర్టీసీ ఒకటేనా.. రెండా? | High Court Raised Questions On The Existence Of TSRTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఒకటేనా.. రెండా?

Published Sun, Nov 10 2019 1:48 AM | Last Updated on Sun, Nov 10 2019 1:48 AM

High Court Raised Questions On The Existence Of TSRTC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన సమయంలో ఆర్టీసీ విభజన పెద్ద వివాదాంశం. అధికారులు, కార్మిక సంఘాలు ఒకరి వాదనను ఒకరు ఖండిస్తూ ఫిర్యాదులతో హోరెత్తించారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల్లో రెండు ఆర్టీసీలు ఏర్పాటు కావడంతో అందరూ వివాదాలను ‘మరిచిపోయారు’. అయితే తాజాగా టీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణ సందర్భంగా సంస్థ ఉనికినే హైకోర్టు ప్రశ్నించే పరిస్థితి రావడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ అప్పట్లో జరిగిందేమిటి, ఇప్పుడెందుకు ఇది వివాదంగా మారింది?

పీటముడి ఇక్కడే...
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం ఆర్టీసీ బస్సులు, సిబ్బంది విభజన విషయంలో పెద్దగా సమస్య లేకున్నా ఆస్తుల విషయంలో పేచీ ఏర్పడింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎండీ కార్యాలయం, తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి, హకీంపేటలోని ఆర్టీసీ శిక్షణ కేంద్రం, మియాపూర్‌లోని ఆర్టీసీ బస్‌ బాడీ యూనిట్‌... ఇలా 14 ఆస్తులను 58:42 దామాషాలో పంచుకోవాలని ఏపీ అధికారులు, కార్మిక సంఘాలు పేర్కొనగా హైదరాబాద్‌లో ఆర్టీసీ నిజాం కాలం నుంచి వచ్చిందని, దానిపై పూర్తి హక్కు తెలంగాణకే ఉంటుందని తెలంగాణ అధికారులు, కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. ఆర్టీసీ సాంకేతికంగా ఉమ్మడిగా ఉండేందుకు ఇదే కారణమైంది.

కమిటీ సిఫార్సులు ఇచ్చినా...
రాష్ట్రం విడిపోయాక రెండుసార్లు ఆర్టీసీ బోర్డు సమావేశాలు జరిగాయి. తొలి సమావేశంలో ఆర్టీసీ ఆస్తులు, అప్పులకు సంబంధించి రెండు వైపుల నుంచి రెండు నివేదికలు అందాయి. వాటిని ఇరుపక్షాలూ పరస్పరం వ్యతిరేకించాయి. ఆ తర్వాత రెండో బోర్డు సమావేశం నాటికి షీలాభిడే కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. అయితే అందులో హెడ్‌ క్వార్టర్స్‌ నిర్వచనం ఆంధ్ర నివేదిక ఆధారంగా చేసినట్లు ఉందంటూ తెలంగాణ అధికారులు వ్యతిరేకించారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో సూచించిన విధంగా ఆ సిఫార్సులు లేవంటూ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. కానీ ఇప్పటివరకు హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశం వెలువడలేదు.

పాలనాపరమైన వ్యవహారాల కోసం...
ఆర్టీసీ చట్టంలోని సెక్షన్‌–3 ప్రకారం సొంతంగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులతో సంయుక్తంగా ఏర్పాటైన కమిటీ పాలనాపరమైన వెసులుబాటు కోసం రెండు వేర్వేరు కార్పొరేషన్లు నిర్వహించుకోవాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం 2016 ఏప్రిల్‌ 27న ప్రభుత్వ ఉత్తర్వు నం.31 ద్వారా ప్రత్యేకంగా టీఎస్‌ఆర్టీసీని ఏర్పాటు చేసుకుంది. ఈ మేరకు ఆర్టీసీ బోర్డు సమావేశంలో తీర్మానం చేసి ఆ ప్రతిని షీలాభిడే కమిటీకి పంపారు. సాంకేతికంగా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి ఆర్టీసీ ఉన్నా ఈ వెసులుబాటుతో విడివిడిగా ఏర్పాటయ్యాయి.

జేఎండీ టు ఎండీ...
రాష్ట్ర విభజన జరిగే సమయంలో ఉమ్మడి ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్‌ అధికారి సాంబశివరావు ఉన్నారు. రెండు రాష్ట్రాలు విడివిడిగా ఏర్పడ్డా.. విజయవాడ కేంద్రంగా ఆయన ఆధ్వర్యంలోనే రెండు ఆర్టీసీలు కొనసాగాయి. అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ సారథిగా జేఎండీ పోస్టు ఏర్పాటైంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో దీని ప్రస్తావన ఉన్నందునే తెలంగాణకు ప్రత్యేకంగా జేఎండీని ఏర్పాటు చేశారని అధికారులు చెబుతున్నారు.

అప్పట్లో ఆర్టీసీ ఈడీగా పనిచేసి పదవీ విరమణ పొందిన రమణారావును ప్రభుత్వం 2014 ఆగస్టులో ఏడాది కాలానికి  ఈ పోస్టులో నియమించింది. ఏడాది తర్వాత ఆయనకు ప్రభుత్వం మళ్లీ ఎక్స్‌టెన్షన్‌ ఇచ్చింది. కానీ 2016 ఏప్రిల్‌లో ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీకి సోమారపు సత్యనారాయణను చైర్మన్‌గా నియమించింది. చైర్మన్‌ ఉండి ఎండీ పోస్టు లేకపోవడం వెలితిగా ఉండటంతో అప్పటివరకు జేఎండీగా ఉన్న రమణారావును అదే సంవత్సరం జూన్‌ 16న ఎండీగా నియమించింది.

కేంద్రం వాదనే మా మాట
‘ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉంది. సాంకేతికంగా విభజన జరగనందున కేంద్రం వాటా ఏపీఎస్‌ఆర్టీసీలో ఉన్నట్లే. ఇప్పుడున్న బస్సులు, సిబ్బంది దానికి చెందిన వారే. విభజనే జరగని సంస్థలో కొంత భాగాన్ని ఎలా ప్రైవేటీకరిస్తారు? కేంద్రం అనుమతి లేకుండా ఎలా ప్రైవేటీకరిస్తారు? మొన్న కోర్టులో వినిపించిన కేంద్రం వాదననే మేం బలపరుస్తున్నాం’
– ఆర్టీసీ జేఏసీ–1 కన్వీనర్‌ హన్మంతు, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షుడు తిరుపతి

కేంద్రం ఇరుకున పడదా?
మోదీ ప్రభుత్వం ఫేమ్‌ పథకం కింద బ్యాటరీ బస్సులు మంజూరు చేస్తోంది. తొలి విడతలో తెలంగాణ ఆర్టీసీకి 40 ఏసీ బస్సులిచ్చింది. రెండో విడతలో ఏపీకి 300, తెలంగాణ ఆర్టీసీకి 325 కేటాయించింది. మరి సంస్థ ఉమ్మడిగా ఉన్నప్పుడు టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీకి విడివిడిగా ఎలా కేటాయించింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. దీనికి కేంద్రం ఏం సమాధానం చెబుతుంది. అది ఇరుకున పడే విషయమే కదా?
– న్యాయ నిపుణులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement