‘ఆప్షన్’ ఇస్తే ఉద్యమమే
* ఉద్యోగుల కేటాయింపు మార్గదర్శకాలపై ఆర్టీసీ టీజేఏసీ హెచ్చరిక
* ‘కమలనాథన్’ మార్గదర్శకాలనే హైలెవల్ కమిటీ అనుసరణపై ధ్వజం
* దీని వెనక కుట్ర దాగుందని ఆరోపణ
* ‘ఎక్కడివాళ్లక్కడే’ మార్గదర్శకాలను రూపొందించాలని డిమాండ్
* అభ్యంతరాలు తెలిపేందుకు పక్షం రోజుల గడువివ్వాలని పట్టు
* ఈ వ్యవహారంపై యాజమాన్యానికి నిరసన తెలపాలని నిర్ణయం
* యాజమాన్యం స్పందించకుంటే ఉద్యమం చేపట్టాలని తీర్మానం
సాక్షి, హైదరాబాద్: ఊరించి ఊరించి రూపొందించిన ఉద్యోగుల కేటాయింపు మార్గదర్శకాలు ఇప్పుడు ఆర్టీసీలో అగ్గి రాజేసింది. ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి కమలనాథన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను ఆర్టీసీ హైలెవల్ కమిటీ యథాతథంగా అనుసరించటంపై ఆర్టీసీ తెలంగాణ జేఏసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఎక్కడివాళ్లక్కడే పనిచేసేలా ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలుండాలని మొదటి నుంచీ గట్టిగా డిమాండ్ చేస్తున్నా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఉద్యోగులకు ‘అప్షన్’ అవకాశం కల్పించటాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.
వెంటనే వాటిని బుట్టదాఖలు చేసి గతంలో తాము సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిం చింది. ఆర్టీసీ అధికారుల సంఘం, సూపర్‌వైజర్స్ సంఘం, టీఎంయూలతో కూడిన జేఏసీ ప్రతి నిధులు, ఎన్‌ఎంయూ ప్రతినిధులు ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో భేటీ అయ్యారు.
మూడు రోజుల క్రితం ఆర్టీసీ హైలెవెల్ కమిటీ పేరిట జారీ అయిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించారు. కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఆర్టీసీకి వర్తించవని స్పష్టం చేస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్‌లు ఆర్టీసీకి సంయుక్త లేఖ రాసినప్పటికీ అవే మార్గదర్శకాలను అనుసరించటంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అవే మార్గదర్శకాలను ఆర్టీసీ హైలెవెల్ కమిటీ పేరుతో జారీ చే యటం, అందులో ఎక్కడా సీఎస్‌ల సంయుక్త లేఖ గురించి ప్రస్తావించకపోవటాన్ని తప్పు పట్టారు. దీని వెనక కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
భేటీలో ఏం చర్చించారంటే...
# ఉద్యోగులకు ‘ఆప్షన్’ అవకాశం ఇవ్వటం వల్ల రెండు ప్రాంతాల్లో పదోన్నతులు పొందే వెసులుబాటు ఆంధ్రా ప్రాంత ఉద్యోగులకు లభిస్తుంది. అదే సమయంలో తెలంగాణ ఉద్యోగులు పదోన్నతులతోపాటు పోస్టులనూ కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో జూనియర్ స్కేల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 56 ఖాళీలు ఏర్పడనున్నాయి. ఆప్షన్ వల్ల వాటిని ఆంధ్రా ఉద్యోగులు ఆక్రమిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది.
# సీనియర్ స్కేల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 13 ఖాళీలు కూడా ఆంధ్రా అధికారులకే దక్కుతాయి. వెరసి రెండు ప్రాంతాల్లో వారు పదోన్నతులు పొందితే తెలంగాణకు పోస్టులు దక్కవు.
# పోస్టుల కంటే ఉద్యోగుల సంఖ్య ఆంధ్రలో ఎక్కువగా ఉంటే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి భర్తీ చేసుకోవాలి. కాదంటే వేరే డిపార్ట్‌మెంట్లకు కూడా మారే వీలున్న కేడర్ అధికారులను వాటికి బదిలీ చేసుకోవాలి.
# ఉద్యోగుల సంఖ్య మరీ అదనంగా ఉంటే... తప్పని స్థితిలో ఒకటి రెండేళ్ల కాలపరిమితితో డెప్యుటేషన్ పద్ధతిపై తెలంగాణకు రావాలి. ఆంధ్రలో పోస్టులు రాగానే తిరిగి వెళ్లిపోవాలి.
# స్పౌజ్ (భార్య లేదా భర్త), వికలాంగులు తదితరులకు ఆప్షన్ అవకాశం కల్పిస్తే, పదేళ్లపాటు హైదరాబాద్ ఆంధ్రకు కూడా రాజధానిగా ఉండనుంది. హైదరాబాద్‌లోని ఏపీఎస్‌ఆర్టీసీ పోస్టుల్లో వారిని నియమించుకోవాలి.
# మార్గదర్శకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసే గడువు 7వ తేదీ వరకు మాత్రమే ఇచ్చారు. దాన్ని కచ్చితంగా మరో 15 రోజులు పొడగించాలి.
# ప్రస్తుత మార్గదర్శకాల జారీ వల్ల తెలంగాణ నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినా వాటినే జారీ చేయడం చూస్తుంటే... మరికొంతకాలం జాప్యం జరిగి ఆ రూపంలో ఆంధ్ర ఉద్యోగులకు లబ్ధి చేకూర్చవచ్చనే కుట్ర దాగుంది.
# ఈ అభిప్రాయాలను ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. సానుకూలంగా స్పందించకుంటే వెంటనే ఉద్యమాన్ని ప్రారంభించాలి.