జీఓ111 నుంచి విముక్తికి చర్యలు
శంషాబాద్ రూరల్: జీఓ 111 నుంచి బాధిత గ్రామాల ప్రజలకు విముక్తి కల్పించడానికి చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం మండలంలోని పెద్దషాపూర్‌లో సర్పంచ్ సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ‘మన ఊరు-మన ప్రణాళిక’ గ్రామసభలో మంత్రి మాట్లాడారు. సభలో స్థానిక నాయకులు లేవనెత్తిన పలు సమస్యలపై ఆయన స్పందించారు. జీఓ 111 అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
రాష్ట్రంలో రోడ్డు ఉన్న ప్రతీ గ్రామానికి బస్సు సౌకర్యం క ల్పిస్తామన్నారు. అసంపూర్తి బస్సు డిపోల పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. పేదవారికి పింఛన్ల పెంపు తప్పకుండా అమలు చేస్తామన్నారు. 500 జనాభా గల తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్ని జిల్లాల్లో కంపెనీలు, ఫ్యాక్టరీలు ఏర్పాటైతేనే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా అభివృద్ధికి మార్గం సుగమమవుతుందన్నారు. జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు, హైటెక్ సిటీ ఉన్నప్పటికీ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఇందుకోసం ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేస్తానన్నారు.
ఆరు నెలల్లో కృష్ణా జలాల సరఫరాకు కృషి
శంషాబాద్ పట్టణ వాసులకు ఆరు నెలలలోపు తాగునీటి సరఫరాకు చర్యలు చేపడతామన్నారు. మండలానికి కృష్ణా జలాలు సరఫరా చేయడానికి కావాల్సిన నిధుల కోసం కృషి చేస్తామన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాహకులతో చర్చించి ఈ ప్రాంతంలోని గ్రామాలకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. శంషాబాద్‌లో బస్టాండ్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
పెద్దషాపూర్‌లో సెప్టిక్ ట్యాంకు, పంచాయతీ భవనం, గ్రంథాలయం ఏర్పాటుతో పాటు బుర్జుగడ్డతండాకు బస్సు సర్వీసుల పెంపు కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. తక్కువ నిధులతోనే హిమాయత్ సాగర్ నుంచి శంషాబాద్‌కు తాగునీరు సరఫరా చేయడానికి అవకాశం ఉందన్నారు. ఈ దిశగా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కె.శ్రవణ్‌కుమార్ గౌడ్, ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, ఎంపీటీసీ సభ్యురాలు టి.ఇంద్రమ్మ, సొసైటీ డెరైక్టరు కె.నర్సింహ, వార్డు సభ్యులు రాము నాయక్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ డెరైక్టరు జి.కృష్ణయ్య గౌడ్, నాయకులు గాదె రాజశేఖర్, టి.రమేష్, మహేందర్‌రెడ్డి, కె.చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.