Our town - our plan
-
ప్రజలను మెప్పించేలా పనిచేయాలి
సుల్తానాబాద్/మంథని రూరల్: అధికారులు మంత్రులు సిఫారసు లేఖలతో కాకుండా ప్రజలను మెప్పించేలా పనిచేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం ఆయన సుల్తానాబాద్ మండలం పూసాల, మంథని మండలం అక్కెపల్లిలో ‘మన ఊరు- మన ప్రణాళిక’పై జరిగిన గ్రామ సభలో మాట్లాడారు. అధికారులు ప్రజలకు సేవకులనే విషయాన్ని మరవరాదన్నారు. ప్రజల డబ్బులతోనే వేతనాలు పొందుతున్నారని, వారి కష్టాలను తొలగించేలా పనిచేయాలన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకే దక్కాలన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా పరిపాలన అందించాలన్నారు. 15 రోజుల్లో ప్రత్యామ్నాయ పంటలపై నిర్ణయం జిల్లాలో వర్షాలు లేక పంటల సాగు ప్రశ్నార్థకమైన తరుణంలో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు పదిహేను రోజుల్లో జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. పల్లె ప్రజలు ఏడుస్తుంటే తమ పాలన వ్యర్థమే అన్నారు. అందుకే వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తామన్నారు. అమరవీరుల త్యాగఫలమే రాష్ట్రం ఢిల్లీలో యాదిరెడ్డి, సిద్దిపేటలో శ్రీకాంతాచారిలాంటి అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమని మంత్రి అన్నారు. 1957లో సాయుధ పోరాటంలో 4వేల మందిని రజాకారులు ఊచకోత కోశారని, 1969లో 379 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, 2001నుంచి నేటి వరకు వెయ్యి మందికి పైగా విద్యార్థుల ఆత్మత్యాగాలు చేశారని, వారి ఆత్మ శాంతించాలంటే కష్టాలు, కన్నీళ్లు లేని పరిపాలన కొనసాగించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. దసరాకు పింఛన్లు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పెం చుతామని ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంద ని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. దసరా పండుగకు వికలాంగులకు రూ. 1500, వృద్ధులు, వితంతువులకు రూ.1000 పింఛన్ ఇస్తామన్నారు. తమ ప్రభుత్వం పనిచేస్తోంది బడాబాబుల కోసం కాదని, పేదల పక్షమే అన్నారు. ఇళ్లు లేనివారికి మూడున్నర లక్షలతో ఇంటి నిర్మాణం చేపడతామన్నారు. ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లలకు దసరా నుంచే కళ్యాణలక్ష్మి పేరున రూ.50వేలు ఇస్తామన్నారు. 50వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు మంత్రివర్గం తీర్మానించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఆఫ్కాబ్ చైర్మన్ చేతి ధర్మయ్య, ఆర్డీవో నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డబుల్.. ట్రబుల్..
ఖమ్మం జడ్పీసెంటర్ : కొత్త రాష్ట్రం... కొత్త పాలన... కొత్త ప్రణాళిక... ఇంతటి కీలక సమయంలో ఉన్నతాధికారులతో కళకళలాడాల్సిన జిల్లాకు ప్రస్తుతం ఇన్చార్జ్ అధికారులే దిక్కయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా జిల్లాకు సంబంధించిన ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళిక రూపొందుతున్న సమయంలో కీలక శాఖల్లో అధికారులు లేకపోవడం జిల్లా అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్నే చూపనుంది. జిల్లా కలెక్టర్ నుంచి కీలక అధికారులందరికీ అదనపు బాధ్యతలే ఉండడంతో తమ సొంత శాఖపై దృష్టి పెట్టాలో.. అదనపు బాధ్యతలను చక్కబెట్టాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకే సమయంలో అనేక రకాల పనులు మీద పడడంతో పని ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో కీలక ఫైళ్లు కూడా క దిలే పరిస్థితి లేక పాలన స్తంభించిపోతోందని అధికార యంత్రాంగమే అంటోంది. పూర్తిస్థాయి పర్యవేక్షణ లేదు.. జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల్లో ఇన్చార్జిల పాలన కొనసాగుతోంది. ఓ వైపు పోలవరం ముంపు మండలాల సమస్య, మరోవైపు జిల్లాలో సాధారణంగా నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు తోడు ‘మన ఊరు - మన ప్రణాళిక’ పేరుతో గ్రామగ్రామాన ప్రభుత్వ సిబ్బంది బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో కీలక శాఖలకు రెగ్యులర్ అధికారులు లేక పాలన కుంటుపడుతోంది. రెండు పోస్టుల్లో సదరు అధికారులు విధులు నిర్వహించలేక పోతుండటంతో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. దీంతో అధికారులకు అదనపు బాధ్యతలు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇటు సొంత శాఖలో పనులు కుంటుపడుతుండటంతో పాటు అదనపు బాధ్యతలు తీసుకున్న శాఖల్లోనూ న్యాయం చేయలేక పోతున్నామని వారు వాపోతున్నారు. ఇలా ఇన్చార్జిల పాలన కొందరు అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతుండగా, మరికొందరికి వరంగా మారింది. జిల్లాలోని పలు ప్రధాన శాఖలు ఇన్చార్జిల పాలనలో కొనసాగుతుండటంతో ఈ ప్రభావం మండల, గ్రామస్థాయి అభివృద్ధి పనులపై పడుతోంది. జిల్లా అధికారుల పనితీరు ఆదారంగానే కిందిస్థాయి ఉద్యోగుల పనితీరు ఉంటుంది. దీంతో పై స్థాయి అధికారులు అదనపు బాధ్యతలతో సతమతమవుతుండటంతో కిందిస్థాయిలోనూ పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడుతోంది. ఇక గ్రామ, మండల స్థాయిలో వివిధ అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు, ఇతర పనులలో ఆయా అధికారులు కమీషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులకూ తప్పని అదనపు బాధ్యతలు.. జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కూడా ఉన్నారు. అయితే, జిల్లా మొత్తాన్ని ఒంటిచేత్తో నడిపించే బాధ్యత ఉండడంతో ఆయన కార్పొరేషన్‌పై దృష్టి పెట్టలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ కూడా ఇప్పుడు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ సెలవుపై వెళ్లడంతో ఇన్చార్జి కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పీవో (ఎఫ్ఏసీ)గా ఆయన బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల అనంతరం బదిలీపై వెళ్లారు. దీంతో డీఆర్డీఏ పీడీ పద్మజారాణికి డీపీఓగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆమె కూడా జిల్లా నుంచి బదిలీ కావటంతో ప్రస్తుతం జడ్పీ సీఈఓ జయప్రకాశ్ నారాయణకు ఇన్చార్జి డీపీఓగా బాధ్యతలు అప్పగించారు. అదనపు బాధ్యతలతో ఆయన పర్యవేక్షణ సక్రమంగా లేక గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదు. కొత్త పాలకవర్గాలు ఏర్పడినప్పటికీ పూర్తిస్థాయిలో నిధులు రాకపోవటంలో పల్లెల్లో అపరిశుభ్ర వాతావర ణం నెలకొంది. డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న పద్మజారాణి బదిలీ పై వెళ్లడంతో ఇన్చార్జి పీడీగా పరిశ్రమల శాఖ ఏడీ శ్రీనివాస్‌నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇటు సొంత శాఖలో పనులు చక్కబెట్టే తీరిక లేక, ఇటు ఇన్చార్జి బాధ్యతల వహిస్తున్న శాఖలోనూ పూర్తిస్థాయిలో దృష్టిసారించలేకపోతున్నారు. జిల్లాలో ఉక్కపరిశ్రమ నెలకొల్పేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆ పనుల్లో బిజీగా ఉన్న శ్రీనివాస్ నాయక్ డీఆర్డీఏ పై పూర్తిస్థాయిలో దృష్టిసారించలేక పోవటంతో నిరుద్యోగులు, పెన్షన్ దారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కిందిస్థాయి అధికారులపైనా అజమాయిషీ లేకపోవడంతో కొందరు కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లెవెత్తుతున్నాయి. డ్వామా పీడీగా పనిచేస్తున్న శ్రీనివాసులు జంగారెడ్డిగూడెం ఆర్డీఓగా బదిలీ పై వెళ్లడంతో ఆంజనేయులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆయన ఇక్కడికొచ్చేందుకు విముఖత చూపడంతో బీసీ సంక్షేమాధికారి వెంకటనర్సయ్యకు ఇన్చార్జి డ్వామా పీడీగా బాధ్యతలు అప్పగించారు. ఆయన డ్వామాలో జరుగుతున్న అవినీతిఅక్రమాలైపై కొరడా ఝుళిపిస్తారని అందరూ భావించారు. కానీ సొంత శాఖలోనే ఆయన పూర్తిస్థాయి సమయం కేటాయించాల్సి వస్తుండటంతో అక్కడ పూర్తిస్థాయిలో దృష్టిసారించలేక పోతున్నారు. దీంతో తన ఇన్చార్జి హయాంలో తన కింది స్థాయి ఉద్యోగులు అవినీతికి పాల్పడినా గుర్తించే పరిస్థితి లేకపోవటంతో ఈ అదనపు బాధ్యతలు తలనొప్పిగా మారినట్లు ఆయన అధికారులు వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. జిల్లాలో కీలక శాఖగా ఉన్న హౌసింగ్ శాఖ సైతం ఇన్చార్జి పాలనలోనే కొనసాగుతోంది. దీంతో ఇందిరమ్మ లబ్ధిదారులు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో హౌసింగ్ పీడీగా పనిచేసిన రాందేవ్‌రెడ్డి గత సంవత్సరం బదిలీపై వరంగల్ వెళ్లడంతో పోస్టు ఖాళీ ఏర్పడింది. దీంతో మధిర డీఈగా పనిచేస్తున్న వైద్యం భాస్కర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరించి పలు అక్రమాలకు పాల్పడినా.. సమాన ఉద్యోగులు కావటంతో ఇన్చార్జి పీడీ అజమాయిషీ కొరవడిందని, దీంతో పేదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఉద్యానవన శాఖ సైతం ఇన్చార్జి పాలనేలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ శాఖలో ఉపసంచాలకులుగా పనిచేస్తున్న మరియన్నకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన జిల్లాలో ఆశాఖ అధికారులను సమన్వయకపర్చలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఇన్చార్జిల పాలనతో అన్ని శాఖల్లోనూ ఇబ్బందులు తప్పడం లేదు. -
జీఓ111 నుంచి విముక్తికి చర్యలు
శంషాబాద్ రూరల్: జీఓ 111 నుంచి బాధిత గ్రామాల ప్రజలకు విముక్తి కల్పించడానికి చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం మండలంలోని పెద్దషాపూర్లో సర్పంచ్ సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ‘మన ఊరు-మన ప్రణాళిక’ గ్రామసభలో మంత్రి మాట్లాడారు. సభలో స్థానిక నాయకులు లేవనెత్తిన పలు సమస్యలపై ఆయన స్పందించారు. జీఓ 111 అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో రోడ్డు ఉన్న ప్రతీ గ్రామానికి బస్సు సౌకర్యం క ల్పిస్తామన్నారు. అసంపూర్తి బస్సు డిపోల పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. పేదవారికి పింఛన్ల పెంపు తప్పకుండా అమలు చేస్తామన్నారు. 500 జనాభా గల తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్ని జిల్లాల్లో కంపెనీలు, ఫ్యాక్టరీలు ఏర్పాటైతేనే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా అభివృద్ధికి మార్గం సుగమమవుతుందన్నారు. జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు, హైటెక్ సిటీ ఉన్నప్పటికీ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఇందుకోసం ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఆరు నెలల్లో కృష్ణా జలాల సరఫరాకు కృషి శంషాబాద్ పట్టణ వాసులకు ఆరు నెలలలోపు తాగునీటి సరఫరాకు చర్యలు చేపడతామన్నారు. మండలానికి కృష్ణా జలాలు సరఫరా చేయడానికి కావాల్సిన నిధుల కోసం కృషి చేస్తామన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాహకులతో చర్చించి ఈ ప్రాంతంలోని గ్రామాలకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. శంషాబాద్‌లో బస్టాండ్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. పెద్దషాపూర్లో సెప్టిక్ ట్యాంకు, పంచాయతీ భవనం, గ్రంథాలయం ఏర్పాటుతో పాటు బుర్జుగడ్డతండాకు బస్సు సర్వీసుల పెంపు కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. తక్కువ నిధులతోనే హిమాయత్ సాగర్ నుంచి శంషాబాద్‌కు తాగునీరు సరఫరా చేయడానికి అవకాశం ఉందన్నారు. ఈ దిశగా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కె.శ్రవణ్‌కుమార్ గౌడ్, ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, ఎంపీటీసీ సభ్యురాలు టి.ఇంద్రమ్మ, సొసైటీ డెరైక్టరు కె.నర్సింహ, వార్డు సభ్యులు రాము నాయక్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ డెరైక్టరు జి.కృష్ణయ్య గౌడ్, నాయకులు గాదె రాజశేఖర్, టి.రమేష్, మహేందర్‌రెడ్డి, కె.చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికిప్రణాళిక లే కీలకం
తిర్యాణి : గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలే కీలకమని కలెక్టర్ డాక్టర్ జగన్మోహన్ అన్నారు. తిర్యాణి మండలం కన్నెపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘మన ఊరు- మన ప్రణాళిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్వరాజ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మన ఊరు- మన ప్రణాళిక చేపట్టిందని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం ఆర్టికల్ 73 ప్రకారం గ్రామసభలకు చ ట్టబద్ధత కల్పిస్తోందని, దీని ప్రకారం గ్రామసభలో తీర్మానం చేసే పనులను తప్పకుండా చేపడతామని చెప్పారు. చిన్నారులంతా బడికి వెళ్లేలా తల్లిదండ్రులు చూడాలని కోరారు. ఇటీవల వర్షాభావ పరిస్థితులతో విత్తనాలు మొలకెత్తక నష్టపోయిన రైతులకు ప్రభుత్వం విత్తనాలు పంపిణీ చేస్తుందని చెప్పారు. అనంతరం డీఈవో, మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణరెడ్డి మన ఊరు, మన ప్రణాళికలో భాగంగా గ్రామస్తులకు అవసరమైన పనుల వివరాలను కలెక్టర్‌కు వివరించారు. గ్రామస్తులు వివిధ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. కాగా, తిర్యాణి నుంచి 3 ఇంక్లైన్ వరకు ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, రోడ్డు మరమ్మతు చేపట్టి పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోకి మార్చాలని ఎంపీపీ హన్మాండ్ల లక్ష్మి కలెక్టర్‌ను కోరారు. ఉట్నూర్ ఆర్డీవో రాంచంద్ర య్య, గ్రామ సర్పంచ్ దుస్స మధుకర్, తిర్యాణి సింగిల్ విండో చైర్మన్ చుంచు శ్రీనివాస్, మాజీ సర్పంచులు వెడ్మ సోము, చంచు దుర్గయ్య, వైద్యాధికారి కిరణ్, ట్రాన్స్‌కో ఏఈ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాయెంగి మల్లేశ్, నాయకులు జగదీశ్, ముత్యం రాజయ్య, వార్డు సభ్యులు, గ్రామైక్య సంఘాల మహిళలు పాల్గొన్నారు. బోగస్ రేషన్‌కార్డులపై దృష్టి రెబ్బెన : జిల్లాలో కుటుంబాలకు మించి ఉన్న బోగస్ రేషన్ కార్డులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ జగన్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం రెబ్బెన తహశీల్దా ర్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని భూసమస్యలు, రేషన్‌కార్డుల వివరాల ను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బోగస్ కార్డులను ఏరివేసి అర్హులకు కార్డులు అందించేందుకు చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియలో జరి గే అవినీతిని అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. వేలిముద్రలు సరిగా వేయలేనివారు, రెండు చేతులు కోల్పోయిన వికలాంగులకు సెల్ఫ్ డిక్లరేషన్‌పై మ్యాన్వల్ పద్ధతిలో పింఛన్ అం దించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో మొదట్లో విత్తనాలు వేసి నష్టపోయిన రైతుల కోసం సోయా, పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటి వరకు విత్తినవాటి లో సుమారు 70 శాతం విత్తనాలు మొలకెత్తినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాంచంద్రయ్య ఉన్నారు. -
‘మన ఊరు - మన ప్రణాళిక’ను అడ్డుకున్న ఆందోళనకారులు
మహేశ్వరం: తెలంగాణ బంద్‌లో భాగంగా మండల కేంద్రంలో టీఆర్ఎస్, టీజేఏసీ, సీపీఎం, ఎస్ఎఫ్ఐ నాయకులు అంబేద్కర్- జగ్జీవన్ రామ్ చౌరస్తా నుంచి ర్యాలీగా వచ్చి ఎంపీడీఓ సమా వేశం హాలులో మన ఊరు-మన ప్రణాళి రూపకల్పనపై జరుగుతున్న అవగాహన సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులు చేసేదేమి లేక సమావేశాన్ని కొంతసేపు నిలి పివేశారు.కార్యక్రమంలోటీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రా మకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు రాఘవేందర్‌రెడ్డి, రాజేష్ నాయక్,సంజయ్, అలీ,బాలయ్య, తడకల యాదయ్య, అంజనేయులు, రవి, సలీంఖాన్, మునాఫ్, సీపీఎం మండల కార్యదర్శి దత్తునాయక్, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి యాదగిరి, టీఆర్ఎస్, టీజేఏసీ కార్యకర్తలు పాల్గొన్నారు. కందుకూరులో.. కందుకూరు: మండల పరిషత్ కార్యాలయంలో మన ఊరు-మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక అనే అంశంపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించేందుకు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం ప్రారంభించిన కొద్ది సేపటికే నిలిచిపోయింది. ఉదయం 11 గంటలకు మండల పరిషత్ సమావేశపు హాల్లో మండల ప్రత్యేకాధికారి దుర్గయ్య అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా సీపీఎం నేతలు సమావేశాన్ని అడ్డుకుని నిలిపివేశారు. దీంతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి దుర్గయ్య వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గ్రామాల్లో వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉందన్నారు.