ఖమ్మం జడ్పీసెంటర్ : కొత్త రాష్ట్రం... కొత్త పాలన... కొత్త ప్రణాళిక... ఇంతటి కీలక సమయంలో ఉన్నతాధికారులతో కళకళలాడాల్సిన జిల్లాకు ప్రస్తుతం ఇన్‌చార్జ్ అధికారులే దిక్కయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా జిల్లాకు సంబంధించిన ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళిక రూపొందుతున్న సమయంలో కీలక శాఖల్లో అధికారులు లేకపోవడం జిల్లా అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్నే చూపనుంది.
జిల్లా కలెక్టర్ నుంచి కీలక అధికారులందరికీ అదనపు బాధ్యతలే ఉండడంతో తమ సొంత శాఖపై దృష్టి పెట్టాలో.. అదనపు బాధ్యతలను చక్కబెట్టాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకే సమయంలో అనేక రకాల పనులు మీద పడడంతో పని ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో కీలక ఫైళ్లు కూడా క దిలే పరిస్థితి లేక పాలన స్తంభించిపోతోందని అధికార యంత్రాంగమే అంటోంది.
పూర్తిస్థాయి పర్యవేక్షణ లేదు..
జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల్లో ఇన్‌చార్జిల పాలన కొనసాగుతోంది. ఓ వైపు పోలవరం ముంపు మండలాల సమస్య, మరోవైపు జిల్లాలో సాధారణంగా నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు తోడు ‘మన ఊరు - మన ప్రణాళిక’ పేరుతో గ్రామగ్రామాన ప్రభుత్వ సిబ్బంది బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో కీలక శాఖలకు రెగ్యులర్ అధికారులు లేక పాలన కుంటుపడుతోంది.
రెండు పోస్టుల్లో సదరు అధికారులు విధులు నిర్వహించలేక పోతుండటంతో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. దీంతో అధికారులకు అదనపు బాధ్యతలు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇటు సొంత శాఖలో పనులు కుంటుపడుతుండటంతో పాటు అదనపు బాధ్యతలు తీసుకున్న శాఖల్లోనూ న్యాయం చేయలేక పోతున్నామని వారు వాపోతున్నారు. ఇలా ఇన్‌చార్జిల పాలన కొందరు అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతుండగా, మరికొందరికి వరంగా మారింది.
జిల్లాలోని పలు ప్రధాన శాఖలు ఇన్‌చార్జిల పాలనలో కొనసాగుతుండటంతో ఈ ప్రభావం మండల, గ్రామస్థాయి అభివృద్ధి పనులపై పడుతోంది. జిల్లా అధికారుల పనితీరు ఆదారంగానే కిందిస్థాయి ఉద్యోగుల పనితీరు ఉంటుంది. దీంతో పై స్థాయి అధికారులు అదనపు బాధ్యతలతో సతమతమవుతుండటంతో కిందిస్థాయిలోనూ పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడుతోంది. ఇక గ్రామ, మండల స్థాయిలో వివిధ అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు, ఇతర పనులలో ఆయా అధికారులు కమీషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఉన్నతాధికారులకూ తప్పని అదనపు బాధ్యతలు..
జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కూడా ఉన్నారు. అయితే, జిల్లా మొత్తాన్ని ఒంటిచేత్తో నడిపించే బాధ్యత ఉండడంతో ఆయన కార్పొరేషన్‌పై దృష్టి పెట్టలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ కూడా ఇప్పుడు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ సెలవుపై వెళ్లడంతో ఇన్‌చార్జి కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పీవో (ఎఫ్‌ఏసీ)గా ఆయన బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది.
జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల అనంతరం బదిలీపై వెళ్లారు. దీంతో డీఆర్‌డీఏ పీడీ పద్మజారాణికి డీపీఓగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
ఆమె కూడా జిల్లా నుంచి బదిలీ కావటంతో ప్రస్తుతం జడ్పీ సీఈఓ జయప్రకాశ్ నారాయణకు ఇన్‌చార్జి డీపీఓగా బాధ్యతలు అప్పగించారు. అదనపు బాధ్యతలతో ఆయన పర్యవేక్షణ సక్రమంగా లేక గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదు. కొత్త పాలకవర్గాలు ఏర్పడినప్పటికీ పూర్తిస్థాయిలో నిధులు రాకపోవటంలో పల్లెల్లో అపరిశుభ్ర వాతావర ణం నెలకొంది.
డీఆర్‌డీఏ పీడీగా పనిచేస్తున్న పద్మజారాణి బదిలీ పై వెళ్లడంతో ఇన్‌చార్జి పీడీగా పరిశ్రమల శాఖ ఏడీ శ్రీనివాస్‌నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇటు సొంత శాఖలో పనులు చక్కబెట్టే తీరిక లేక, ఇటు ఇన్‌చార్జి బాధ్యతల వహిస్తున్న శాఖలోనూ పూర్తిస్థాయిలో దృష్టిసారించలేకపోతున్నారు.
జిల్లాలో ఉక్కపరిశ్రమ నెలకొల్పేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆ పనుల్లో బిజీగా ఉన్న శ్రీనివాస్ నాయక్ డీఆర్‌డీఏ పై పూర్తిస్థాయిలో దృష్టిసారించలేక పోవటంతో నిరుద్యోగులు, పెన్షన్ దారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కిందిస్థాయి అధికారులపైనా అజమాయిషీ లేకపోవడంతో కొందరు కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లెవెత్తుతున్నాయి.
డ్వామా పీడీగా పనిచేస్తున్న శ్రీనివాసులు జంగారెడ్డిగూడెం ఆర్డీఓగా బదిలీ పై వెళ్లడంతో ఆంజనేయులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆయన ఇక్కడికొచ్చేందుకు విముఖత చూపడంతో బీసీ సంక్షేమాధికారి వెంకటనర్సయ్యకు ఇన్‌చార్జి డ్వామా పీడీగా బాధ్యతలు అప్పగించారు. ఆయన డ్వామాలో జరుగుతున్న అవినీతిఅక్రమాలైపై కొరడా ఝుళిపిస్తారని అందరూ భావించారు.
కానీ సొంత శాఖలోనే ఆయన పూర్తిస్థాయి సమయం కేటాయించాల్సి వస్తుండటంతో అక్కడ పూర్తిస్థాయిలో దృష్టిసారించలేక పోతున్నారు. దీంతో తన ఇన్‌చార్జి హయాంలో తన కింది స్థాయి ఉద్యోగులు అవినీతికి పాల్పడినా గుర్తించే పరిస్థితి లేకపోవటంతో ఈ అదనపు బాధ్యతలు తలనొప్పిగా మారినట్లు ఆయన అధికారులు వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.
జిల్లాలో కీలక శాఖగా ఉన్న హౌసింగ్ శాఖ సైతం ఇన్‌చార్జి పాలనలోనే కొనసాగుతోంది. దీంతో ఇందిరమ్మ లబ్ధిదారులు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో హౌసింగ్ పీడీగా పనిచేసిన రాందేవ్‌రెడ్డి గత సంవత్సరం బదిలీపై వరంగల్ వెళ్లడంతో పోస్టు ఖాళీ ఏర్పడింది. దీంతో మధిర డీఈగా పనిచేస్తున్న వైద్యం భాస్కర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరించి పలు అక్రమాలకు పాల్పడినా.. సమాన ఉద్యోగులు కావటంతో ఇన్‌చార్జి పీడీ అజమాయిషీ కొరవడిందని, దీంతో పేదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
ఉద్యానవన శాఖ సైతం ఇన్‌చార్జి పాలనేలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ శాఖలో ఉపసంచాలకులుగా పనిచేస్తున్న మరియన్నకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన జిల్లాలో ఆశాఖ అధికారులను సమన్వయకపర్చలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఇన్‌చార్జిల పాలనతో అన్ని శాఖల్లోనూ ఇబ్బందులు తప్పడం లేదు.
డబుల్.. ట్రబుల్..
Published Thu, Jul 17 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM
Advertisement