సాక్షి, ఖమ్మం: ఉత్తమ సేవలకు గుర్తింపుగా పురస్కారం అందుకోవడం ఉద్యోగికి తన సర్వీసులో అరుదైన గౌరవం. అది ఎప్పటికీ వారి జీవితంలో మరుపురాని రోజుగా మిగులుతుంది. అయితే ఏటా ఈ పురస్కారాలు జిల్లాలో కొంతమంది అనర్హులకు కూడా అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సారి కొత్త రాష్ట్రం, నూతన ప్రభుత్వంలో పురస్కారం అందుకోవడమంటే ఎప్పటికీ రికార్డుగా మిగులుతుంది. దీంతో ఉద్యోగులు గతంలో మాదిరిగా కాకుండా అర్హులకే పురస్కారాలు అందజేయాలని కోరుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 97 శాఖల పరిధిలో 30 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రోజువారీ పాలనలో, కార్యకలాపాల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ఏడాదిలో రెండుసార్లు పురస్కారాలు అందజేస్తారు. జిల్లా అధికారి నుంచి కింది స్థాయి వరకు ఉత్తమ సేవలు అందించిన వారి జాబితా తయారు చేయాలని కలెక్టర్.. ప్రతిసారి డీఆర్వోను ఆదేశిస్తారు. ఈ జాబితా ప్రకారం స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రభుత్వం తరఫున మంత్రి చేతుల మీదుగా, గణతంత్ర దినోత్సవం రోజున జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తారు.
గతంలో ఉత్తమ అధికారుల గుర్తింపు చిత్తశుద్ధితో జరిగేది. జిల్లా అంతా కలిపి ఈ సంఖ్య 50కి మించేది కాదు. కొన్ని శాఖల్లో ప్రభుత్వం ఆశించిన మేర ఫలితాలు లేకుంటే ఆయా ఉద్యోగులను సదరు శాఖ అధికారులు పురస్కారానికి సిఫార్సు చేసేవారు కాదు. కానీ ఈ పురుస్కారం అందుకోవడం అన్ని శాఖల్లో ఇటీవల పోటీగా మారింది. తమ శాఖల పరిధిలో అంతగా అభివృద్ధి లేకున్నా పదుల సంఖ్యలో ఉద్యోగుల పేర్లు ఆయా శాఖల ఉన్నతాధికారులు పురస్కారాలకు ప్రతిపాదనలు పంపేవారు. దీంతో పురస్కార గ్రహీతల ఎంపికలో పారదర్శకత లోపించింది. ఈ సంఖ్య 50 నుంచి 100కు.. ఆ తర్వాత 200 వరకు చేరింది. గత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఈ సంఖ్య 200 పైగానే ఉంది.
గతంలో పదుల సంఖ్యలో దక్కే ఉత్తమ పురస్కారాలు నేడు వందల సంఖ్యకు చేరాయి. విధుల్లో ఉత్తమంగా సేవలు అందించిన వారికి మాత్రం ఈ జాబితాలో చోటు దక్కడం లేదు. రాజకీయ పార్టీల, ప్రజాప్రతినిధుల ఒత్తిడి, ఉన్నతాధికారులతో చొరవగా ఉన్న ఉద్యోగులకే ఉత్తమ పురస్కారాలు అందుతున్నాయి. దీంతో ఉద్యోగ పరంగా ఉత్తమ సేవలు అందించిన వారు మాత్రం తీవ్ర వేదనకు గురవుతున్నారు.
కొత్త కలెక్టర్ మార్క్ ఉండేనా..?
నూతన రాష్ట్రంలో తొలిసారిగా ప్రశంసాపత్రం అందుకోవడం ఇప్పుడు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు వరమే. అయితే చాలా మంది ఉద్యోగులు తమ సేవలకు తప్పకుండా ప్రశంసాపత్రం అందుతుందని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇలంబరితి ప్రత్యేక మార్క్ చూపిస్తేనే అర్హులైన వారికి ఈ గౌరవం దక్కుతుందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
అయితే చాలా సందర్భాల్లో పంద్రాగస్టు ముందురోజు వరకు కూడా ఉత్తమ అధికారులు, సిబ్బంది జాబితా తయారు కాదు. ప్రస్తుతం దీనిపై కలెక్టర్ ముందస్తుగా ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో గత ఏడాది ఎవరికి ఇచ్చాం..? అంతకు ముందు ఎవరి పేరు సిఫార్సు చేశాం...? మిగిలింది ఎవరు..? వారిలో ఎవరి పేరు ప్రతిపాదించాలి..? అనే తరహాలో శాఖల వారీగా ఎంపిక ప్రక్రియ చేయిస్తున్నట్లు సమాచారం. అయితే గురువారం సాయంత్రం వరకు ఉత్తమ ఉద్యోగుల తుది జాబితాకు కలెక్టర్ ఆమోదముద్ర వేస్తారని తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ వేడుకను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చేయిస్తోంది. దీంతో నూతన రాష్ర్టంలో ఆయా శాఖల వారీగా ఉత్తమ ప్రశంసాపత్రం ఎవరికి అందుతుందో, ఆ అదృష్టవంతులు ఎవరో అనే చర్చ ఉద్యోగుల్లో మొదలైంది.
‘ప్రశంస’లుఎవరికో..?
Published Thu, Aug 14 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement
Advertisement