ఖమ్మం క్రైం/ సత్తుపల్లి టౌన్, న్యూస్‌లైన్: అసలే కొత్త బండి... ఆపై కొత్త రాష్ట్రం... సాదాసీదా నంబరైతే ఏమి బాగు? ఫ్యాన్సీ నంబర్‌తో కొత్తబండిపై కొత్త రాష్ట్రంలో తిరుగుతుంటే ఆ మజాయే వేరు అనుకున్నారేమో..! పలువురు ఔత్సాహికులు ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీపడుతున్నారు. కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. తమకు ఫలానా నంబర్ కావాలని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆర్టీఏ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నిర్దేశించిన రుసుం మేరకు డీడీ తీసి రెడీగా ఉన్నారు. ఒకే నంబర్ కోసం పలువురు ప్రముఖులు పోటీపడుతుండటంతో ఎవరికి కేటాయించాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు.
మందగించిన రిజిస్ట్రేషన్లు..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించటంతో జూన్ 2 తరువాత టీజీ నంబర్లు రానున్నాయి. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల వినియోగదారులు టీజీ క్రేజీతో కొద్దిరోజులుగా రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ఆసక్తి చూపటం లేదు. జూన్ 2వ తేదీ తరువాత వాహనాలను రిజిస్ట్రేషన్ చేయిస్తే తెలంగాణ (టీజీ) పేరుతో నంబర్లు వస్తాయని వినియోగదారులు ఆరోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డ్రైవింగ్ లెసైన్సులు తీసుకునేవారు సైతం వారం రోజుల తరువాత తీసుకుంటే సొంతరాష్ట్ర పేరుతో వస్తుంది కదా..! అనే ఆలోచనలో పడ్డారు. సత్తుపల్లిలో గతంలో రోజుకు 15 లెసైన్స్‌లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య ఐదుకు పడిపోయింది.
గతంలో 10 వాహనాల వరకు రిజిస్ట్రేషన్ చేస్తే..ఇప్పుడు అందులో సగానికి పడిపోయింది. లెసైన్స్‌ల కోడ్ కూడా మారుతుండటంతో డ్రైవింగ్ లెసైన్స్‌లు తీసుకునేందుకు కూడా చాలామంది వెనుకాడుతున్నారు. సత్తుపల్లి ఆర్టీఏ పరిధిలో ఏప్రిల్ నెలలో 526 వరకు రిజిస్ట్రేషన్లు జరగ్గా సుమారు రూ.3.30 లక్షల ఆదాయం రవాణశాఖకు వచ్చింది. ఈనెలలో 400 వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించారని సమాచారం. టీజీ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లు, లెసైన్స్‌లు పొందాలనే ఉద్దేశంతో ఎక్కువమంది వాయిదా వేసుకుంటున్నట్లు తెలిసింది. రవాణాశాఖ లోగోను వెలువరించడంలో జాప్యం అయితే రిజిస్ట్రేషన్లు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆర్టీఏ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై సత్తుపల్లి ఎంవీఐ బి.శంకర్‌నాయక్‌ను ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా ‘తెలంగాణ పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించేకోవాలనే ఉద్దేశంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. జూన్ 2వ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్లు, లెసైన్స్‌లు ఊపందుకోవచ్చని భావిస్తున్నాం.’ అన్నారు.
క్రేజీ నంబర్స్ ఇవే..
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు కొత్త వాహనాలకు టీజీ 8 సిరీస్ పేరుతో జూన్ 2వ తేదీ నుంచి నంబర్లు కేటాయిస్తారు. లక్కీ నంబర్ కావాలనుకునే కొందరు ఆయా నంబర్ల కోసం పోటీపడుతున్నారు. వినియోగదారుల డిమాండ్‌ను బట్టి ఫ్యాన్సీ నంబర్లకు చార్జి నిర్ణయించారు.
టీజీ..క్రేజీ
Published Wed, May 28 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement