The new State
-
‘ప్రశంస’లుఎవరికో..?
సాక్షి, ఖమ్మం: ఉత్తమ సేవలకు గుర్తింపుగా పురస్కారం అందుకోవడం ఉద్యోగికి తన సర్వీసులో అరుదైన గౌరవం. అది ఎప్పటికీ వారి జీవితంలో మరుపురాని రోజుగా మిగులుతుంది. అయితే ఏటా ఈ పురస్కారాలు జిల్లాలో కొంతమంది అనర్హులకు కూడా అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సారి కొత్త రాష్ట్రం, నూతన ప్రభుత్వంలో పురస్కారం అందుకోవడమంటే ఎప్పటికీ రికార్డుగా మిగులుతుంది. దీంతో ఉద్యోగులు గతంలో మాదిరిగా కాకుండా అర్హులకే పురస్కారాలు అందజేయాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 97 శాఖల పరిధిలో 30 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రోజువారీ పాలనలో, కార్యకలాపాల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ఏడాదిలో రెండుసార్లు పురస్కారాలు అందజేస్తారు. జిల్లా అధికారి నుంచి కింది స్థాయి వరకు ఉత్తమ సేవలు అందించిన వారి జాబితా తయారు చేయాలని కలెక్టర్.. ప్రతిసారి డీఆర్వోను ఆదేశిస్తారు. ఈ జాబితా ప్రకారం స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రభుత్వం తరఫున మంత్రి చేతుల మీదుగా, గణతంత్ర దినోత్సవం రోజున జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తారు. గతంలో ఉత్తమ అధికారుల గుర్తింపు చిత్తశుద్ధితో జరిగేది. జిల్లా అంతా కలిపి ఈ సంఖ్య 50కి మించేది కాదు. కొన్ని శాఖల్లో ప్రభుత్వం ఆశించిన మేర ఫలితాలు లేకుంటే ఆయా ఉద్యోగులను సదరు శాఖ అధికారులు పురస్కారానికి సిఫార్సు చేసేవారు కాదు. కానీ ఈ పురుస్కారం అందుకోవడం అన్ని శాఖల్లో ఇటీవల పోటీగా మారింది. తమ శాఖల పరిధిలో అంతగా అభివృద్ధి లేకున్నా పదుల సంఖ్యలో ఉద్యోగుల పేర్లు ఆయా శాఖల ఉన్నతాధికారులు పురస్కారాలకు ప్రతిపాదనలు పంపేవారు. దీంతో పురస్కార గ్రహీతల ఎంపికలో పారదర్శకత లోపించింది. ఈ సంఖ్య 50 నుంచి 100కు.. ఆ తర్వాత 200 వరకు చేరింది. గత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఈ సంఖ్య 200 పైగానే ఉంది. గతంలో పదుల సంఖ్యలో దక్కే ఉత్తమ పురస్కారాలు నేడు వందల సంఖ్యకు చేరాయి. విధుల్లో ఉత్తమంగా సేవలు అందించిన వారికి మాత్రం ఈ జాబితాలో చోటు దక్కడం లేదు. రాజకీయ పార్టీల, ప్రజాప్రతినిధుల ఒత్తిడి, ఉన్నతాధికారులతో చొరవగా ఉన్న ఉద్యోగులకే ఉత్తమ పురస్కారాలు అందుతున్నాయి. దీంతో ఉద్యోగ పరంగా ఉత్తమ సేవలు అందించిన వారు మాత్రం తీవ్ర వేదనకు గురవుతున్నారు. కొత్త కలెక్టర్ మార్క్ ఉండేనా..? నూతన రాష్ట్రంలో తొలిసారిగా ప్రశంసాపత్రం అందుకోవడం ఇప్పుడు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు వరమే. అయితే చాలా మంది ఉద్యోగులు తమ సేవలకు తప్పకుండా ప్రశంసాపత్రం అందుతుందని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇలంబరితి ప్రత్యేక మార్క్ చూపిస్తేనే అర్హులైన వారికి ఈ గౌరవం దక్కుతుందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అయితే చాలా సందర్భాల్లో పంద్రాగస్టు ముందురోజు వరకు కూడా ఉత్తమ అధికారులు, సిబ్బంది జాబితా తయారు కాదు. ప్రస్తుతం దీనిపై కలెక్టర్ ముందస్తుగా ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో గత ఏడాది ఎవరికి ఇచ్చాం..? అంతకు ముందు ఎవరి పేరు సిఫార్సు చేశాం...? మిగిలింది ఎవరు..? వారిలో ఎవరి పేరు ప్రతిపాదించాలి..? అనే తరహాలో శాఖల వారీగా ఎంపిక ప్రక్రియ చేయిస్తున్నట్లు సమాచారం. అయితే గురువారం సాయంత్రం వరకు ఉత్తమ ఉద్యోగుల తుది జాబితాకు కలెక్టర్ ఆమోదముద్ర వేస్తారని తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ వేడుకను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చేయిస్తోంది. దీంతో నూతన రాష్ర్టంలో ఆయా శాఖల వారీగా ఉత్తమ ప్రశంసాపత్రం ఎవరికి అందుతుందో, ఆ అదృష్టవంతులు ఎవరో అనే చర్చ ఉద్యోగుల్లో మొదలైంది. -
డబుల్.. ట్రబుల్..
ఖమ్మం జడ్పీసెంటర్ : కొత్త రాష్ట్రం... కొత్త పాలన... కొత్త ప్రణాళిక... ఇంతటి కీలక సమయంలో ఉన్నతాధికారులతో కళకళలాడాల్సిన జిల్లాకు ప్రస్తుతం ఇన్చార్జ్ అధికారులే దిక్కయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా జిల్లాకు సంబంధించిన ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళిక రూపొందుతున్న సమయంలో కీలక శాఖల్లో అధికారులు లేకపోవడం జిల్లా అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్నే చూపనుంది. జిల్లా కలెక్టర్ నుంచి కీలక అధికారులందరికీ అదనపు బాధ్యతలే ఉండడంతో తమ సొంత శాఖపై దృష్టి పెట్టాలో.. అదనపు బాధ్యతలను చక్కబెట్టాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకే సమయంలో అనేక రకాల పనులు మీద పడడంతో పని ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో కీలక ఫైళ్లు కూడా క దిలే పరిస్థితి లేక పాలన స్తంభించిపోతోందని అధికార యంత్రాంగమే అంటోంది. పూర్తిస్థాయి పర్యవేక్షణ లేదు.. జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల్లో ఇన్చార్జిల పాలన కొనసాగుతోంది. ఓ వైపు పోలవరం ముంపు మండలాల సమస్య, మరోవైపు జిల్లాలో సాధారణంగా నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు తోడు ‘మన ఊరు - మన ప్రణాళిక’ పేరుతో గ్రామగ్రామాన ప్రభుత్వ సిబ్బంది బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో కీలక శాఖలకు రెగ్యులర్ అధికారులు లేక పాలన కుంటుపడుతోంది. రెండు పోస్టుల్లో సదరు అధికారులు విధులు నిర్వహించలేక పోతుండటంతో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. దీంతో అధికారులకు అదనపు బాధ్యతలు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇటు సొంత శాఖలో పనులు కుంటుపడుతుండటంతో పాటు అదనపు బాధ్యతలు తీసుకున్న శాఖల్లోనూ న్యాయం చేయలేక పోతున్నామని వారు వాపోతున్నారు. ఇలా ఇన్చార్జిల పాలన కొందరు అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతుండగా, మరికొందరికి వరంగా మారింది. జిల్లాలోని పలు ప్రధాన శాఖలు ఇన్చార్జిల పాలనలో కొనసాగుతుండటంతో ఈ ప్రభావం మండల, గ్రామస్థాయి అభివృద్ధి పనులపై పడుతోంది. జిల్లా అధికారుల పనితీరు ఆదారంగానే కిందిస్థాయి ఉద్యోగుల పనితీరు ఉంటుంది. దీంతో పై స్థాయి అధికారులు అదనపు బాధ్యతలతో సతమతమవుతుండటంతో కిందిస్థాయిలోనూ పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడుతోంది. ఇక గ్రామ, మండల స్థాయిలో వివిధ అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు, ఇతర పనులలో ఆయా అధికారులు కమీషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులకూ తప్పని అదనపు బాధ్యతలు.. జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కూడా ఉన్నారు. అయితే, జిల్లా మొత్తాన్ని ఒంటిచేత్తో నడిపించే బాధ్యత ఉండడంతో ఆయన కార్పొరేషన్‌పై దృష్టి పెట్టలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ కూడా ఇప్పుడు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ సెలవుపై వెళ్లడంతో ఇన్చార్జి కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పీవో (ఎఫ్ఏసీ)గా ఆయన బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల అనంతరం బదిలీపై వెళ్లారు. దీంతో డీఆర్డీఏ పీడీ పద్మజారాణికి డీపీఓగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆమె కూడా జిల్లా నుంచి బదిలీ కావటంతో ప్రస్తుతం జడ్పీ సీఈఓ జయప్రకాశ్ నారాయణకు ఇన్చార్జి డీపీఓగా బాధ్యతలు అప్పగించారు. అదనపు బాధ్యతలతో ఆయన పర్యవేక్షణ సక్రమంగా లేక గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదు. కొత్త పాలకవర్గాలు ఏర్పడినప్పటికీ పూర్తిస్థాయిలో నిధులు రాకపోవటంలో పల్లెల్లో అపరిశుభ్ర వాతావర ణం నెలకొంది. డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న పద్మజారాణి బదిలీ పై వెళ్లడంతో ఇన్చార్జి పీడీగా పరిశ్రమల శాఖ ఏడీ శ్రీనివాస్‌నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇటు సొంత శాఖలో పనులు చక్కబెట్టే తీరిక లేక, ఇటు ఇన్చార్జి బాధ్యతల వహిస్తున్న శాఖలోనూ పూర్తిస్థాయిలో దృష్టిసారించలేకపోతున్నారు. జిల్లాలో ఉక్కపరిశ్రమ నెలకొల్పేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆ పనుల్లో బిజీగా ఉన్న శ్రీనివాస్ నాయక్ డీఆర్డీఏ పై పూర్తిస్థాయిలో దృష్టిసారించలేక పోవటంతో నిరుద్యోగులు, పెన్షన్ దారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కిందిస్థాయి అధికారులపైనా అజమాయిషీ లేకపోవడంతో కొందరు కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లెవెత్తుతున్నాయి. డ్వామా పీడీగా పనిచేస్తున్న శ్రీనివాసులు జంగారెడ్డిగూడెం ఆర్డీఓగా బదిలీ పై వెళ్లడంతో ఆంజనేయులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆయన ఇక్కడికొచ్చేందుకు విముఖత చూపడంతో బీసీ సంక్షేమాధికారి వెంకటనర్సయ్యకు ఇన్చార్జి డ్వామా పీడీగా బాధ్యతలు అప్పగించారు. ఆయన డ్వామాలో జరుగుతున్న అవినీతిఅక్రమాలైపై కొరడా ఝుళిపిస్తారని అందరూ భావించారు. కానీ సొంత శాఖలోనే ఆయన పూర్తిస్థాయి సమయం కేటాయించాల్సి వస్తుండటంతో అక్కడ పూర్తిస్థాయిలో దృష్టిసారించలేక పోతున్నారు. దీంతో తన ఇన్చార్జి హయాంలో తన కింది స్థాయి ఉద్యోగులు అవినీతికి పాల్పడినా గుర్తించే పరిస్థితి లేకపోవటంతో ఈ అదనపు బాధ్యతలు తలనొప్పిగా మారినట్లు ఆయన అధికారులు వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. జిల్లాలో కీలక శాఖగా ఉన్న హౌసింగ్ శాఖ సైతం ఇన్చార్జి పాలనలోనే కొనసాగుతోంది. దీంతో ఇందిరమ్మ లబ్ధిదారులు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో హౌసింగ్ పీడీగా పనిచేసిన రాందేవ్‌రెడ్డి గత సంవత్సరం బదిలీపై వరంగల్ వెళ్లడంతో పోస్టు ఖాళీ ఏర్పడింది. దీంతో మధిర డీఈగా పనిచేస్తున్న వైద్యం భాస్కర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరించి పలు అక్రమాలకు పాల్పడినా.. సమాన ఉద్యోగులు కావటంతో ఇన్చార్జి పీడీ అజమాయిషీ కొరవడిందని, దీంతో పేదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఉద్యానవన శాఖ సైతం ఇన్చార్జి పాలనేలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ శాఖలో ఉపసంచాలకులుగా పనిచేస్తున్న మరియన్నకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన జిల్లాలో ఆశాఖ అధికారులను సమన్వయకపర్చలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఇన్చార్జిల పాలనతో అన్ని శాఖల్లోనూ ఇబ్బందులు తప్పడం లేదు. -
టీజీ..క్రేజీ
ఖమ్మం క్రైం/ సత్తుపల్లి టౌన్, న్యూస్‌లైన్: అసలే కొత్త బండి... ఆపై కొత్త రాష్ట్రం... సాదాసీదా నంబరైతే ఏమి బాగు? ఫ్యాన్సీ నంబర్‌తో కొత్తబండిపై కొత్త రాష్ట్రంలో తిరుగుతుంటే ఆ మజాయే వేరు అనుకున్నారేమో..! పలువురు ఔత్సాహికులు ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీపడుతున్నారు. కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. తమకు ఫలానా నంబర్ కావాలని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆర్టీఏ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నిర్దేశించిన రుసుం మేరకు డీడీ తీసి రెడీగా ఉన్నారు. ఒకే నంబర్ కోసం పలువురు ప్రముఖులు పోటీపడుతుండటంతో ఎవరికి కేటాయించాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. మందగించిన రిజిస్ట్రేషన్లు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించటంతో జూన్ 2 తరువాత టీజీ నంబర్లు రానున్నాయి. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల వినియోగదారులు టీజీ క్రేజీతో కొద్దిరోజులుగా రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ఆసక్తి చూపటం లేదు. జూన్ 2వ తేదీ తరువాత వాహనాలను రిజిస్ట్రేషన్ చేయిస్తే తెలంగాణ (టీజీ) పేరుతో నంబర్లు వస్తాయని వినియోగదారులు ఆరోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డ్రైవింగ్ లెసైన్సులు తీసుకునేవారు సైతం వారం రోజుల తరువాత తీసుకుంటే సొంతరాష్ట్ర పేరుతో వస్తుంది కదా..! అనే ఆలోచనలో పడ్డారు. సత్తుపల్లిలో గతంలో రోజుకు 15 లెసైన్స్‌లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య ఐదుకు పడిపోయింది. గతంలో 10 వాహనాల వరకు రిజిస్ట్రేషన్ చేస్తే..ఇప్పుడు అందులో సగానికి పడిపోయింది. లెసైన్స్‌ల కోడ్ కూడా మారుతుండటంతో డ్రైవింగ్ లెసైన్స్‌లు తీసుకునేందుకు కూడా చాలామంది వెనుకాడుతున్నారు. సత్తుపల్లి ఆర్టీఏ పరిధిలో ఏప్రిల్ నెలలో 526 వరకు రిజిస్ట్రేషన్లు జరగ్గా సుమారు రూ.3.30 లక్షల ఆదాయం రవాణశాఖకు వచ్చింది. ఈనెలలో 400 వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించారని సమాచారం. టీజీ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లు, లెసైన్స్‌లు పొందాలనే ఉద్దేశంతో ఎక్కువమంది వాయిదా వేసుకుంటున్నట్లు తెలిసింది. రవాణాశాఖ లోగోను వెలువరించడంలో జాప్యం అయితే రిజిస్ట్రేషన్లు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆర్టీఏ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై సత్తుపల్లి ఎంవీఐ బి.శంకర్‌నాయక్‌ను ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా ‘తెలంగాణ పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించేకోవాలనే ఉద్దేశంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. జూన్ 2వ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్లు, లెసైన్స్‌లు ఊపందుకోవచ్చని భావిస్తున్నాం.’ అన్నారు. క్రేజీ నంబర్స్ ఇవే.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు కొత్త వాహనాలకు టీజీ 8 సిరీస్ పేరుతో జూన్ 2వ తేదీ నుంచి నంబర్లు కేటాయిస్తారు. లక్కీ నంబర్ కావాలనుకునే కొందరు ఆయా నంబర్ల కోసం పోటీపడుతున్నారు. వినియోగదారుల డిమాండ్‌ను బట్టి ఫ్యాన్సీ నంబర్లకు చార్జి నిర్ణయించారు.