best services
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 20 కొత్త బస్సులు
–ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు వెల్లడి తిరుపతి కల్చరల్: తిరుమలలో ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భక్తులకు మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆర్టీసీ ఆర్ఎం వి.నాగశివుడు తెలిపారు. బుధవారం ఆర్టీసీ ఆర్ఎం కార్యాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బ్రహ్మోత్సవాల్లో ఆర్టీసీ అందించనున్న సేవలు గురించి వెల్లడించారు. అత్యంత వైభవంగా జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఉత్సవాలకు 20 కొత్త సప్తగిరి సర్వీసులు రానున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అంచనాల మేరకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మెకానిక్స్, డ్రై వర్లకు పత్యేక శిక్షణ కల్పించి బస్సుల కండీషన్‌ను మెరుగు పరచడం జరిగిందన్నారు. ఉత్సవాల ప్రారంభం నుంచి ప్రతిరోజూ 425 బస్సులతో రెండు వేల ట్రిప్పులు తిప్పేలా చర్యలు తీసుకున్నామన్నారు. అత్యంత పవిత్రమైన గరుడ సేవ నాడు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 530 సర్వీసులతో 3800 ట్రిప్పులు తిప్పనున్నట్లు తెలిపారు. ఉత్సవాలలో భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ప్రత్యేక టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సురక్షిత ప్రయాణంతో పాటు భక్తుల ఆరోగ్యం కోసం అలిపిరి వద్ద, తిరుపతి బస్టాండ్‌లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గరుడ సేవ నాడు విజయనగరం, కడప జిల్లాలతో పాటు చిత్తూరు జిల్లాలలోని సర్వీసులను అదనంగా తిరుమలకు నడిపి భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇదే రోజు ప్రతి సర్వీసుకు డ్రై వర్తో పాటు కండక్టర్‌ను ఏర్పాటు చేసి టిక్కెట్లు బస్సులోనే ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇతర జిల్లాల నుంచి అదనంగా కండక్టర్లు, డ్రై వర్లను గరుడ సేవలో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. స్థానికులను దృష్టిలో ఉంచుకుని ఉత్సవాల సమయంలో ప్రతి రోజూ రైల్వేస్టేసన్, బస్టాండ్ లక్ష్మీపురం, బైరాగిపట్టెడ, ఎంఆర్‌పల్లి, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా అలిపిరి వరకు రెండు బస్సులు నడుపుతున్నామన్నారు. తిరుమల టిక్కెట్ తీసుకున్న వారు ఈ సర్వీసులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. అలాటే గరుడ సేవ భక్తుల కోసం అలిపిరి నుంచి రైల్వేస్టేషన్, బస్టాండ్ వంటి ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తూ 40 ప్రత్యేక సర్వీసులను నడిపి రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇదే రోజు పోలీసు, టీటీడీ సహకారంతో ఆర్టీసీ సిబ్బందిని గ్రూపులుగా ఏర్పాటు చేసి తిరుమల ఘాట్ రోడ్డులో ప్రతి మలుపు వద్ద డ్రై వర్లకు సిగ్నల్స్ ఇస్తూ సురక్షత ప్రయాణం సాగించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఘాట్ రోడ్డులో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేకంగా మొబైల్ టీంను అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఇవే కాకుండా తమిళనాడు నుంచి ప్రత్యేకంగా 130 సర్వీసులతో పాటు తమిళనాడుకు చెందిన 130 బస్సులతో బ్రహ్మోత్సవాల్లో సేవలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా బెంగళూరు సర్వీసులను ఈనెల 7,8వ తేదీల్లో అన్నమయ్య సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బస్టాండ్ వద్ద వరకు నడుపుతున్నామన్నారు. ఆ సర్వీసులలో వచ్చిన వారి కోసం అక్కడి నుంచి బస్టాండ్ వరకు టౌన్ సర్వీసు ద్వారా ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్టీసీ సేవలను భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
అవార్డుల ‘రాణి’
26 సార్లు ఉత్తమ సేవలకు పురస్కరాలు ఆదిలాబాద్ టౌన్ : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్ రూరల్ ప్రాజెక్టులో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ టీఈవీ రాణి అవార్డుల రాణిగా నిలుస్తోంది. ఉద్యోగిగా ఉత్తమ సేవలు అందిండమేగాక ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యహరిస్తోంది. ఇప్పటి వరకు ఆమె రాష్ట్ర మంత్రులు, జిల్లాలో పని చేసిన కలెక్టర్ల చేతుల మీదుగా, ఐసీడీఎస్ శాఖ ఉన్నత అధికారుల నుంచి సేవ పతకాలను, ప్రశంస పత్రాలను అందుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఆరు సార్లు, ప్రభుత్వం నుంచి పన్నెండు సార్లు, ఉత్తమ కళాకారిణి 4 సార్లు అవార్డులు అందుకుంది. అదే విధంగా ఉత్తమ కవయిత్రిగా 8 సార్లు పురస్కారాలు అందుకున్నారు. సోమవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ జగన్మోహన్ నుంచి ఉత్తమ వ్యాఖ్యత అవార్డును అందుకున్నారు. అవార్డును అందుకున్న ఆమె శాఖ అధికారులు, ఉద్యోగులు అభినందించారు. -
పుంగనూరు మున్సిపాలిటీ నెంబర్ వన్
17 అంశాలలో భేష్ పుంగనూరు: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పనితీరులో మెరుగ్గా ఉంటు నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది పుంగనూరు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పనితీరును ప్రభుత్వం పరిశీలించింది. 17 అంశాలలో మున్సిపాలిటీల పనితీరును అంచనా వేసేందుకు 100 మార్కులు నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపాలిటీల ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్, మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో పనితీరును అనుసరించి మార్కులు కేటాయించారు. ఈ కేటాయింపులో పుంగనూరు మున్సిపాలిటీ ఉత్తమ సేవలకు 75.17మార్కులు పొందింది. దీంతో నెంబరు వన్‌గా నిలిచింది. ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించడం, పన్నుల వృద్ధి, విజ్ఞప్తుల పరిష్కారం, ఐఐటీ ఫౌండేషన్, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, టౌన్‌ప్లానింగ్, డ్వాక్రాగ్రూపుల రుణాల పంపిణీ, గ్రీనరీ, స్వచ్ఛభారత్, స్కిల్‌డెవలెప్‌మెంట్, పాఠశాలలో కెరీర్ ఫౌండేషన్ కోర్సుల నిర్వహణ, అన్నిరకాల పెన్షన్లు పంపిణీ, సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్, అభివృద్ధి పనుల్లో నాణ్యత, ఇంకుడు గుంతల కార్యక్రమం, లెక్కల నిర్వహణ తనిఖీ అంశాలలో మున్సిపాలిటి పనితీరుకు నెంబర్‌వన్ ర్యాంకు లభించింది. -
‘సాక్షి’ ఎక్సలెన్స్ విజేతల ఎంపిక పూర్తి
♦ ఎనిమిది కేటగిరీల్లో అవార్డులకు విజేతల ఎంపిక ♦ త్వరలో ఎంపికైన విజేతలకు అవార్డుల ప్రదానం ♦ ఎంట్రీలకు అనూహ్య స్పందన సాక్షి, హైదరాబాద్: వివిధ రంగాల్లో అద్భుత సేవలందించిన ప్రతిభావంతులకు ఏటా అందజేసే ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డుల విజేతల ఎంపిక సోమవారం ముగిసింది. సామాజిక సేవ, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికం తదితర రంగాల్లో ‘సాక్షి ఎక్సలెన్స్-2015’ అవార్డులకు విజేతలను ఎంపిక చేశారు. త్వరలో నిర్వహించనున్న కార్యక్రమంలో విజేతలకు అవార్డులను అందజేయనున్నారు. ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులకు ఈ ఏడాది కూడా అనూహ్య స్పందన లభించింది. ఆయా రంగాల్లో ఉత్తమ సేవలు అందజేసిన వ్యక్తులు, సంస్థల నుంచి విజేతలను ఎంపిక చేసే ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా కొనసాగింది. వివిధ రంగాల్లో అపార అనుభ వజ్ఞులైన ప్రముఖులు జ్యూరీగా వ్యవహరించారు. వివిధ దశల్లో జరిగిన ఎంపిక ప్రక్రియ సోమవారం ఫైనల్‌కు చేరుకుంది. ఎనిమిది కేటగిరీల్లో... సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల కోసం ఎనిమిది కేటగిరీలను గుర్తించారు. ఎడ్యుకేషన్, హెల్త్, ఫార్మింగ్(వ్యవసాయం), బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ లార్జ్ స్కేల్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ స్మాల్ అండ్ మీడియం స్కేల్, సోషల్ డెవలప్మెంట్(ఎన్జీవోస్), యంగ్ ఎచీవర్ ఇన్ ఎడ్యుకేషన్, యంగ్ ఎచీవర్ ఇన్ సోషల్ సర్వీస్ రంగాల్లో అవార్డులను అందజేసేందుకు ఎంట్రీలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సాక్షికి అందిన ఎంట్రీలను వివిధ స్థాయిల్లో న్యాయనిర్ణేతలు వడపోశారు. చివరకు సోమవారం విజేతలుగా నిలిచిన ఉత్తమ వ్యక్తులు, సంస్థల ఎంపిక పూర్తయ్యింది. ఎంవీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా, మాజీ అడ్వొకేట్ జనరల్ ఏ సత్యప్రసాద్, కిమ్స్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.కృష్ణయ్య, సీనియర్ సంపాదకులు డాక్టర్ ఏబీకే ప్రసాద్, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ డీఎన్ రెడ్డి, ఎలికో ఫార్మా సీఎఫ్ఓ, మేనేజింగ్ డెరైక్టర్ వనితా దాట్ల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశమైన జ్యూరీ విస్తృతంగా చర్చించిన అనంతరం తుది విజేతలను ఖరారు చేసింది. తమకు అందిన ప్రతి ఎంట్రీని న్యాయనిర్ణేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిదీ ఒకదానితో మరొకటి పోటీపడుతున్నట్లుగా ఉందని జ్యూరీ సభ్యులు అభిప్రాయపడ్డారు. సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల జ్యూరీకి సభ్యులుగా వ్యవహరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జ్యూరీ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, కార్పొరేట్ కమ్యూనికేషన్ డెరైక్టర్ రాణిరెడ్డి పాల్గొన్నారు. -
ఉత్తమ సేవలు అందిస్తాం -డీజీపీ అనురాగ్ శర్మ
♦ సంగారెడ్డిలో సెంట్రల్ కమాండ్, కంట్రోల్ ప్రారంభం ♦ మహిళల కోసం రిసెప్షన్ సెంటర్ జిల్లాలలోనూ చలానాలు సంగారెడ్డి టౌన్: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తామని రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను ప్రజలకు దగ్గరకు తీసుకెళ్లి వారి భయాందోళనలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు, పోలీసుల మధ్య ఫ్రెండ్లీ వాతావరణం ఉన్నప్పుడే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్‌ను ఆయన ప్రారంభించారు. రూరల్ షీ బస్సును కూడా ప్రారంభించారు. చేతన సావనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతకు ముందు ప్రజలు ముఖ్యంగా మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. మహిళలు తమ సమస్యలను చెప్పుకోడానికి ప్రతేక్యంగా రిసెప్షన్ సెంటర్‌ను ప్రారంభించామని వివరించారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రమాదాలు జరిగితే తెలుసుకొని సిసి కెమెరాల ద్వారా నింధితులను పట్టుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్‌లో పాటు జిల్లాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. చలాన పద్ధతిని జిల్లాలో కూడా ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించారు. సిసి కెమెరాలను సమకూర్చిన మహీంద్రా, అరబిందో పరిశ్రమలను ఆయన అభినందించారు. అనంతరం జిల్లా ఐటి ల్యాబ్‌ను సందర్శించారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కోహీర్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫైరింగ్ రేంజ్‌కు భూమి పూజ నిర్వహించారు. అనంతరం చిరాక్‌పల్లి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్‌ను సందర్శించారు. జహీరాబాద్ పట్టణంలో నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కర్యాక్రమంలో ఐజిపి నవీన్ చంద్, ఎస్పీ బడుగుల సుమతి, అదనపు ఎస్సీ వెంకన్న, ఓయస్డి జ్యోతిప్రకాష్, ఎఆర్ అదనపు ఎస్పీ బాపురావు, వివిధ సబ్ డివిజన్ల డిఎస్పిలు, చేతన సెంటర్లో సేవలందిస్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయులు, సిఐలు, ఎస్సైలు, జిల్లా పోలీసు సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రిసెప్షన్ సెంటర్ నూతన భవనం ప్రారంభం సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ సెంటర్ నూతన భవనాన్ని డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ప్రారంభించారు. ఈ సెంటర్‌ను మహిళా కానిస్టేబుల్‌తో రిబ్బన్ కట్ చేయించడం విశేషం. -
దక్షిణమధ్య రైల్వేకు అవార్డుల పంట
సాక్షి,హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేకు అవార్డుల పంట పండింది. ఈ నెల 13న గువాహటిలో జరిగిన 60వ రైల్వే వారోత్సవాల్లో రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ ఈ అవార్డులను అందుకున్నారు. 2014-15 సంవత్సరానికి సివిల్ ఇంజనీరింగ్, స్టోర్స్, సేల్స్ మేనేజ్మెంట్, రన్నింగ్ రూమ్ రంగాలలో ఉత్తమ సేవలకు గాను దక్షిణ మధ్య రైల్వేకు షీల్డ్స్ బహూకరించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా, రైల్వే బోర్డు చైర్మన్ ఎ.కె.మిట్టల్, రైల్వేబోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యం... బాలింత మృతి!
రాయికల్ : ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతిచెందింది. సేవలు బాగున్నాయని ఇక్కడికి వస్తే ప్రాణాలు తీశారంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రిపై దాడికి దిగి ఆందోళన చేశారు. మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావుపేటకు చెందిన మోత్కుల విజయ(20) ప్రసవం కోసం మూడు రోజుల క్రితం రాయికల్ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఇక్కడి స్త్రీవైద్యుల నిపుణురాలు చైతన్యసుధకు మంచి పేరు ఉండడంతో ఉత్తమ సేవలు అందుతాయని ఇక్కడకు వచ్చారు. గురువారం ఉదయమే విజయకు సాధారణ ప్రసవమైంది. బాబు జన్మించాడు. తమ పెళ్లిరోజు నాడే పండంటి బాబు పుట్టాడన్న సంతోషంలో శ్రీనివాస్-విజయ దంపతులు మునిగిపోయారు. ఈ క్రమంలోనే విజయకు రక్తస్రావం ఎక్కువ కావడంతో స్థానికంగా ఉన్న వెంకన్న అనే వైద్యుడు చికిత్స అందించినా బ్లీడింగ్ ఆగలేదు. దీంతో జగిత్యాలలో ఉన్న వైద్యనిపుణురాలు చైతన్యసుధకు సమాచారం అందించారు. ఆమె హుటాహుటిన రాయికల్ ఆస్పత్రికి వచ్చి చికిత్స అందించినప్పటికీ రక్తస్రావం ఆగకపోవడంతో 108లో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. విషయం తెలుసుకున్న విజయ కుటుంబసభ్యులు ఆగ్రహంతో ప్రభుత్వాస్పత్రికి తరలివచ్చి ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్ వెంకన్న, వైద్య సిబ్బంది సుజన్‌పై దాడికి యత్నించగా వారు భయంతో ఓ గదిలో తాళం వేసుకుని తలదాచుకున్నారు. ఆందోళనపై సమాచారమందుకున్న ఎస్సై సరిలాల్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారితో మాట్లాడి శాంతింపజేశారు. -
ప్రయాణికులు మెచ్చే విమానాశ్రయాలు
1. సేవలలో ఫస్ట్.. షాంఘై ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌గా ఇప్పటికే నాలుగుసార్లు బహుమతులను కైవసం చేసుకున్న షాంఘై ఎయిర్పోర్ట్ ఈ ఏడాదీ మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్‌లో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ కిందటేడాది 50 మిలియన్ల మంది ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ప్రయాణికులు ఈ ఏడాది కూడా ఈ విమానాశ్రయానికి అగ్రతాంబూలం ఇచ్చారు. ఆసియా ఖండం నుంచి ఎంపికైన ఈ ఎయిర్పోర్ట్ 3,200 ఎకరాల స్థలంలో, ఏడాదికి 66 మిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలిగే సామర్థ్యం కలిగి ఉంది. 2. అత్యంత వేగం... ఇంచియాన్ ఆసియా ఖండంలో రెండవ అత్యుత్తమ ఎయిర్పోర్ట్ అవార్డును ఇంచియాన్ విమానాశ్రయం సొంతం చేసుకుంది. సౌత్ కొరియాలోని సియోల్‌లో ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. కొన్నేళ్లుగా బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌లలో రెండవస్థానాన్ని కొట్టేస్తూ వచ్చిన ఇంచియాన్ ఈ యేడాది కూడా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఇక్కడి సిబ్బంది సేవలు అత్యుత్తమంగా ఉంటాయని ప్రజలు కొనియాడారు. 2005 సంవత్సరంలో ప్రారంభించిన ఈ విమానాశ్రయంలో ఇతర సేవలతో పాటు గోల్ఫ్ కోర్స్, స్పా, వ్యక్తిగత గదులు, ఐస్ స్కేటింగ్ రింక్, క్యాసినో, ఇండోర్ గార్డెన్స్, కొరియా సంస్కృతికి సంబంధించిన మ్యూజియమ్.. మొదలైనవన్నీ ఉన్నాయి. ప్రయాణికులను అత్యంత వేగంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చగలదనే ప్రపంచవ్యాప్తంగా పేరుంది. దీంతో వ్యాపారవేత్తలు ఈ విమానాశ్రయం నుండి అత్యధికంగా ప్రయాణిస్తుంటారు. 3. సెల్ఫ్ సర్వీస్... ఆమ్స్టర్ డ్యామ్ చిపోల్ మొదటిసారి స్కైట్రాక్స్ అవార్డును సొంతం చేసుకున్న ఈ విమానాశ్రయం నెదర్ల్యాండ్స్, అమ్‌స్టర్ డ్యామ్ ప్రాంతంలో ఉంది. అతి పెద్దదైన ఈ విమానాశ్రయంలో స్వీయ సేవా బదిలీ ప్రక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. యూరప్ దేశాలలో రద్దీ గల విమానాశ్రయంగా దీనికి పేరుం ది. 1916లో ప్రారంభించిన ఈ విమానాశ్రయం కిందటేడాది 52 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించింది. 4. వాణిజ్య సేవలలో మేటి.. హాంగ్ కాంగ్ 2012లో మూడవస్థానంలో ఉన్న హాంగ్‌కాంగ్ విమానాశ్రయం ఈ ఏడాది నాలుగో స్థానంలో నిలిచింది. 1988 నుంచి ఈ విమానాశ్రయం వాణిజ్యపరమైన సేవలు అందిస్తోంది. 65,000 మంది సిబ్బంది పనిచేస్తున్న ఈ విమానాశ్రయంలో నుంచి ప్రపంచంలోని 180 ముఖ్య పట్టణాలకు వాయుమార్గం ఉంది. 5. అధునాతనం.. బీజింగ్ క్యాపిటల్ ఉత్తర బీజింగ్‌లో గల బీజింగ్ క్యాపిటల్ విమానాశ్రయం’ 1958లో చిన్న భవనంలో మొదలైంది. 1980లో ఒకేసారి 12 విమానాలు ల్యాండ్ అయ్యే సామర్థ్యంతో 3,700 ఎకరాలలో అధునాతనంగా నిర్మించారు. 1999లో 50వ వార్షికోత్సవం జరుపుకున్న ఈ ఎయిర్పోర్ట్ ప్రతియేటా 83 కోట్లకు పైగా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చుతూ 5వ స్థానంలో నిలిచింది. 6. అన్నపూర్ణ... మ్యూనిచ్ విమానాశ్రయాలలో ఆహారపదార్థాలకు అత్యధిక డబ్బు ఖర్చు చేస్తూ విసిగిపోయే ప్రయాణికులు మ్యూనిచ్ ఎయిర్పోర్ట్ కు నీరాజనాలు పలికారు. జర్మనీలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ అందించే స్థానిక సదుపాయాలు ప్రయాణికులకు అమితంగా నచ్చుతున్నాయి. మధ్య యూరప్‌లో అత్యుత్తమ భోజన సదుపాయాలు గల ఎయిర్పోర్ట్ జాబితాలో బెస్ట్ డైనింగ్ ప్లేస్ అవార్డును కొట్టేసింది. 7. లగేజీ సురక్షితం... జోరిచ్ విమానాశ్రయాలలో లగేజీలు పోగొట్టుకునే అనుభవం చాలా మంది ప్రయాణికులకు ఉంటుంది. కానీ, స్విట్జల్యాండ్లోని జోరిచ్ ఎయిర్పోర్ట్’లో లగేజీ మిస్ అయ్యే అవకాశమే లేదు. అన్ని భద్రతా చర్యలు తీసుకుంటారు ఇక్కడ. ప్రపంచంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌ల కన్నా లగేజీ సురక్షితంగా చేర్చడంలో ముందు వరసలో ఉన్నది జ్యూరిచ్ ఒక్కటే. అందుకే ఈ ఏడాది బెస్ట్ బ్యాగేజీ డెలివరీ అవార్డును, అలాగే అత్యుత్తమ సిబ్బంది సేవల అవార్డును ఈ ఎయిర్పోర్ట్ సొంతం చేసుకుంది. 8. ప్రతినిధుల ప్రశంసలు... వ్యాన్కూవర్ బ్రిటిష్ కొలింబియాలో గల వ్యాన్కూవర్ ఈ ఏడాది బెస్ట్ ఎయిర్పోర్ట్ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. ఉత్తర అమెరికా ప్రతినిధుల చేత ప్రశంసలు పొందిన ఈ ఎయిర్పోర్ట్ 2012లో తొమ్మిదవస్థానంలో ఉండగా ఈ ఏడాది మరో మెట్టు అధిగమించింది. 9. పరిశుభ్రతకు మారు పేరు... టొక్యో పది అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో కొత్తగా చేరింది జపాన్‌లోని ‘టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం. బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ల జాబితాలో 2012లో మొదటి స్థానంలో ఉన్న ఈ విమానాశ్రయంలోని పరిశుభ్రత సూపర్బ్‌గా ఉంటుందని ప్రయాణికులు కొనియాడారు. 10. అత్యుత్తమ టెర్మినల్స్... లండన్ హీత్రో లండన్‌లో 5 అతి పెద్ద టెర్మినల్స్తో 2008లో ప్రారంభించిన హీత్రో ఎయిర్పోర్ట్ 2012 వరకు వరుసగా బెస్ట్ టెర్మినల్స్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్ట్‌ను పదవ స్థానానికి పరిమితం చేశారు. -
‘ప్రశంస’లుఎవరికో..?
సాక్షి, ఖమ్మం: ఉత్తమ సేవలకు గుర్తింపుగా పురస్కారం అందుకోవడం ఉద్యోగికి తన సర్వీసులో అరుదైన గౌరవం. అది ఎప్పటికీ వారి జీవితంలో మరుపురాని రోజుగా మిగులుతుంది. అయితే ఏటా ఈ పురస్కారాలు జిల్లాలో కొంతమంది అనర్హులకు కూడా అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సారి కొత్త రాష్ట్రం, నూతన ప్రభుత్వంలో పురస్కారం అందుకోవడమంటే ఎప్పటికీ రికార్డుగా మిగులుతుంది. దీంతో ఉద్యోగులు గతంలో మాదిరిగా కాకుండా అర్హులకే పురస్కారాలు అందజేయాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 97 శాఖల పరిధిలో 30 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రోజువారీ పాలనలో, కార్యకలాపాల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ఏడాదిలో రెండుసార్లు పురస్కారాలు అందజేస్తారు. జిల్లా అధికారి నుంచి కింది స్థాయి వరకు ఉత్తమ సేవలు అందించిన వారి జాబితా తయారు చేయాలని కలెక్టర్.. ప్రతిసారి డీఆర్వోను ఆదేశిస్తారు. ఈ జాబితా ప్రకారం స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రభుత్వం తరఫున మంత్రి చేతుల మీదుగా, గణతంత్ర దినోత్సవం రోజున జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తారు. గతంలో ఉత్తమ అధికారుల గుర్తింపు చిత్తశుద్ధితో జరిగేది. జిల్లా అంతా కలిపి ఈ సంఖ్య 50కి మించేది కాదు. కొన్ని శాఖల్లో ప్రభుత్వం ఆశించిన మేర ఫలితాలు లేకుంటే ఆయా ఉద్యోగులను సదరు శాఖ అధికారులు పురస్కారానికి సిఫార్సు చేసేవారు కాదు. కానీ ఈ పురుస్కారం అందుకోవడం అన్ని శాఖల్లో ఇటీవల పోటీగా మారింది. తమ శాఖల పరిధిలో అంతగా అభివృద్ధి లేకున్నా పదుల సంఖ్యలో ఉద్యోగుల పేర్లు ఆయా శాఖల ఉన్నతాధికారులు పురస్కారాలకు ప్రతిపాదనలు పంపేవారు. దీంతో పురస్కార గ్రహీతల ఎంపికలో పారదర్శకత లోపించింది. ఈ సంఖ్య 50 నుంచి 100కు.. ఆ తర్వాత 200 వరకు చేరింది. గత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఈ సంఖ్య 200 పైగానే ఉంది. గతంలో పదుల సంఖ్యలో దక్కే ఉత్తమ పురస్కారాలు నేడు వందల సంఖ్యకు చేరాయి. విధుల్లో ఉత్తమంగా సేవలు అందించిన వారికి మాత్రం ఈ జాబితాలో చోటు దక్కడం లేదు. రాజకీయ పార్టీల, ప్రజాప్రతినిధుల ఒత్తిడి, ఉన్నతాధికారులతో చొరవగా ఉన్న ఉద్యోగులకే ఉత్తమ పురస్కారాలు అందుతున్నాయి. దీంతో ఉద్యోగ పరంగా ఉత్తమ సేవలు అందించిన వారు మాత్రం తీవ్ర వేదనకు గురవుతున్నారు. కొత్త కలెక్టర్ మార్క్ ఉండేనా..? నూతన రాష్ట్రంలో తొలిసారిగా ప్రశంసాపత్రం అందుకోవడం ఇప్పుడు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు వరమే. అయితే చాలా మంది ఉద్యోగులు తమ సేవలకు తప్పకుండా ప్రశంసాపత్రం అందుతుందని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇలంబరితి ప్రత్యేక మార్క్ చూపిస్తేనే అర్హులైన వారికి ఈ గౌరవం దక్కుతుందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అయితే చాలా సందర్భాల్లో పంద్రాగస్టు ముందురోజు వరకు కూడా ఉత్తమ అధికారులు, సిబ్బంది జాబితా తయారు కాదు. ప్రస్తుతం దీనిపై కలెక్టర్ ముందస్తుగా ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో గత ఏడాది ఎవరికి ఇచ్చాం..? అంతకు ముందు ఎవరి పేరు సిఫార్సు చేశాం...? మిగిలింది ఎవరు..? వారిలో ఎవరి పేరు ప్రతిపాదించాలి..? అనే తరహాలో శాఖల వారీగా ఎంపిక ప్రక్రియ చేయిస్తున్నట్లు సమాచారం. అయితే గురువారం సాయంత్రం వరకు ఉత్తమ ఉద్యోగుల తుది జాబితాకు కలెక్టర్ ఆమోదముద్ర వేస్తారని తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ వేడుకను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చేయిస్తోంది. దీంతో నూతన రాష్ర్టంలో ఆయా శాఖల వారీగా ఉత్తమ ప్రశంసాపత్రం ఎవరికి అందుతుందో, ఆ అదృష్టవంతులు ఎవరో అనే చర్చ ఉద్యోగుల్లో మొదలైంది. -
పోలీసులకు దాతల సహకారం
పోలీసులకు దాతల సహకారం మెరుగైన సేవలు అందించేందుకు సహకరించాలని పరకాల పోలీసులు కోరగానే దాతలు ముందుకు వస్తున్నారు. అడగ్గానే కాదనలేకనో.. ఏమోకానీ దాతలు పోలీస్ సేవలకు అవసరమైన వాటిని సమకూర్చుతున్నారు. ‘పరకాల పోలీస్‌స్టేషన్’ బోర్డు నుంచి స్టాపర్స్ (ట్రాఫిక్ బారికేడ్లు) వరకు అందజేస్తున్నారు. పోలీసులు పట్టణంలోని వ్యాపారులు, విద్యా సంస్థల నిర్వాహకులు, దాతల సహకారం కోరుతున్నారు. కొందరు తమ రక్షణ కోసమే కదా అని భావిస్తుండగా.. మరికొందరు సాయం చేస్తే ప్రచారం దక్కుతుందని ముందుకు వస్తున్నారు. పద్నాలుగు సీసీ కెమెరాలు పట్టణంలో దొంగతనాలను అరికట్టేందుకు, అపరిచిత వ్యక్తులను గుర్తించేందుకు సీసీ కెమెరాలను నెలరోజుల క్రితం ఏర్పాటు చేశారు. వ్యాపారులు ఒక కమిటీగా ఏర్పడి విరాళాలు జమ చేశారు. సుమారు *2లక్షలతో పద్నాలుగు సీసీ కెమెరాలను కొనుగోలు చేయగా పోలీసులు పట్టణంలో ఏర్పాటు చేశారు. జనం ద్దీగా ఉండే ప్రాంతాల్లో, ప్రధాన రహదారి వెంట ఏర్పాటు చేసి పోలీస్‌స్టేషన్‌లోని టీవీకి అనుసంధానం చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. స్టాపర్లు అందించిన విద్యాసంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలు స్టాపర్లు తయారు చేయించారు. పట్టణంలో రోజుకురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ నియంత్రణకు స్టాపర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి అవసరాన్ని గుర్తించి కోరిన పోలీసులకు ప్రైవేటు విద్యా సంస్థలు తమ సంపూర్ణ సహకారం అందించాయి. ఒక్కో స్టాపర్‌కు *8వేల చొప్పున ఖర్చు చేసి ఆరు తయూరు చేరుుంచారు. వీటిని ప్రధాన రహదారిలో పెట్టి పోలీసులు ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. స్టేషన్ బోర్డుపై.. వొడా ఫోన్ ప్రచారం పోలీస్‌స్టేషన్ బోర్డును మొబైల్ కంపెనీ ఏర్పాటు చేసింది. రోడ్డు విస్తరణలో భాగంగా పోలీస్‌స్టేషన్ పాత ప్రహరీని తొలగించి వెనక్కి మరో గోడను నిర్మించారు. దీంతో నూతన బోర్డును వొడాఫోన్ కంపెనీ వారు విద్యుత్‌లైట్లతో ఏర్పాటు చేశారు. ప్రబోధ్ కేంద్రానికి జూనియర్ కళాశాల గది నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు కెరీర్ గెడైన్స్ ఇచ్చేందుకు పోలీసుల ఆధ్వర్యంలో ప్రబోధ్ కేంద్రాన్ని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గదిలో ఏర్పాటు చేశారు. జనవరి 22న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు, గెడైన్స్ చేసే రిటైర్డ్ ఉపాధ్యాయుడితో ఆ గదిని వాడుకుంటున్నారు. -
ఖాతాదారులకు మెరుగైన సేవలు
ఎన్జీవోస్కాలనీ, న్యూస్‌లైన్ : తమ వద్దకు వచ్చే ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నామని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజింగ్ డెరైక్టర్, చైర్మన్ నరేంద్ర అన్నారు. హన్మకొండ రాంనగర్‌లోని ఏబీకే మాల్లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వరంగల్ రీజియన్ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ నరేంద్ర విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది వరంగల్ రీజియన్ పరిధిలో *2000 వేల కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు నిర్వహించామని, వచ్చే ఏడాదిలో ఈ సంఖ్యను *5,000 వేల కోట్లకు పెంచేందుకు ప్రణాళికలు రూపొం దించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,059 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయని తెలిపారు. గతంలో తమ బ్యాంకు సేవలు ఎక్కువగా పట్టణాలు, నగరాల్లో అందుబాటులో ఉండేవని, కొత్తగా ఈ ఏడాది 156 బ్రాంచ్‌లు ప్రారంభించగా వీటిలో 60 శాఖలను గ్రామీణ ప్రాంతాల్లోనే నెలకొల్పినట్లు వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా మరో 26 శాఖలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా త మ బ్యాంకు సేవలను విస్తరిస్తున్నామని, ఇందు లో భాగంగా వ్యవసాయం, సూక్ష్మ, చిన్న తర హా యూనిట్లకు రుణాలను విరివిగా అందజేస్తున్నామని చెప్పారు. ఐఓబీ తరపున ఇప్పటికే అగ్రిమేళా కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు పంటలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. రైతులకు వ్యవసాయరుణాలు ఇచ్చేందుకు దేశ వ్యాప్తం గా తమకు 40 బ్యాంకులు ఉన్నాయన్నారు. కొలంబో, హంగ్‌కాంగ్, సియోల్, సింగపూర్‌లో కూడా తమ బ్రాంచ్‌లను నెలకొల్పి విదేశాల్లో తమ సేవలను విస్తరింపజేశామన్నారు. రాబోయే మూడునెలల్లో బ్యాంకు బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఖాతాదారులను ఆకట్టుకునేందుకు గిఫ్ట్‌కార్డు, లిటిల్‌స్టార్ అకౌం ట్ వంటి పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వరంగల్‌లో రీజినల్ సెంటర్‌ను ప్రారంభించడం ద్వారా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో తమ సేవలు మరింత విస్తరింపజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, రీజినల్ సెంటర్ ప్రారంభాన్ని పురస్కరించుకుని 20 మంది లబ్ధిదారులకు సీఎండీ *20 కోట్ల రుణాలను చెక్‌ల ద్వారా పంపిణీ చేశారు. కార్యక్రమంలో బ్యాంకు సీనియర్ రీజినల్ మేనేజర్ కె.జీవానందం, చీఫ్ మేనేజర్ ఎం.రాజేశ్వరి, ఐఓబీ నేషనల్ బ్యాంకింగ్ జనరల్ మేనేజర్ పవన్కుమార్గార్గ్, హైదరాబాద్ చీఫ్ రీజినల్ మేనేజర్ కె.స్వామినాథన్, బ్రాంచ్ మేనేజర్లు రామకృష్ణపట్నాయక్, ఆంజనేయరెడ్డి, నాగప్రసాద్, వీరన్న, రంజిత్, ఐఓబీ ఆఫీసర్స్ అసోషియేషన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ సుబ్బారావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అంచిరెడ్డి, అవార్డ్స్ స్టాఫ్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్మోహన్రావు, టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.రాజేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రత్నవీరాచారి, నాయకుడు రత్నాకర్‌రెడ్డి, బిల్డర్స్ అసోషియేషన్ నాయకుడు చిదురాల రఘునాథ్, ఫోరం బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ పాల్గొన్నారు. -
ఏఎస్పీకి ప్రదీప్‌రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: జిల్లా ఏఎస్పీ ఎ.ప్రదీప్‌రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో భారతప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. 2014 జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించనున్నారు. ఆయన 1985 బ్యాచ్‌కు చెందినవారు. నిజామాబాద్‌లో ఎస్ఐగా మొదటి పోస్టింగ్ నిర్వహించారు. అనంతరం రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2008-09లో పదోన్నతిపై డీఎస్పీగా మహబూబ్‌నగర్‌లోని షాద్‌నగర్, ఒంగోలు జిల్లాలో విధులు నిర్వహించారు. 2009లోనే ఉత్తమ రాష్ట్ర సేవా పతకాన్ని అందుకున్నారు. 2012లో అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది జిల్లాకు వచ్చారు. హైదరాబాద్ ఆయన స్వస్థలం. జిల్లా అడిషనల్ ఎస్పీగా భాధ్యతలు చేపట్టిన నాటినుంచి శాంతిభద్రత పరిరక్షణలో ప్రజలతో మమేకమై పనిచేశారు. విధుల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించడం, శాంతిభద్రత పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించినందుకు భారత ప్రభుత్వం ఆయనను ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికచేసింది. ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రదీప్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడంతో తనకు మరింత స్ఫూర్తినిచ్చిందన్నారు. తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు సూచనలతో శాంతిభద్రతలను కాపాడేందుకు నిరంతరం పని చేస్తామన్నారు. అవార్డు రావడంపై జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, పోలీస్ అధికారులు, సిబ్బంది ఏఎస్పీకి అభినందనలు తెలిపారు.