రాయికల్ : ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతిచెందింది. సేవలు బాగున్నాయని ఇక్కడికి వస్తే ప్రాణాలు తీశారంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రిపై దాడికి దిగి ఆందోళన చేశారు. మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావుపేటకు చెందిన మోత్కుల విజయ(20) ప్రసవం కోసం మూడు రోజుల క్రితం రాయికల్ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఇక్కడి స్త్రీవైద్యుల నిపుణురాలు చైతన్యసుధకు మంచి పేరు ఉండడంతో ఉత్తమ సేవలు అందుతాయని ఇక్కడకు వచ్చారు. గురువారం ఉదయమే విజయకు సాధారణ ప్రసవమైంది. బాబు జన్మించాడు. తమ పెళ్లిరోజు నాడే పండంటి బాబు పుట్టాడన్న సంతోషంలో శ్రీనివాస్-విజయ దంపతులు మునిగిపోయారు. ఈ క్రమంలోనే విజయకు రక్తస్రావం ఎక్కువ కావడంతో స్థానికంగా ఉన్న వెంకన్న అనే వైద్యుడు చికిత్స అందించినా బ్లీడింగ్ ఆగలేదు. దీంతో జగిత్యాలలో ఉన్న వైద్యనిపుణురాలు చైతన్యసుధకు సమాచారం అందించారు.
ఆమె హుటాహుటిన రాయికల్ ఆస్పత్రికి వచ్చి చికిత్స అందించినప్పటికీ రక్తస్రావం ఆగకపోవడంతో 108లో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. విషయం తెలుసుకున్న విజయ కుటుంబసభ్యులు ఆగ్రహంతో ప్రభుత్వాస్పత్రికి తరలివచ్చి ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్ వెంకన్న, వైద్య సిబ్బంది సుజన్‌పై దాడికి యత్నించగా వారు భయంతో ఓ గదిలో తాళం వేసుకుని తలదాచుకున్నారు. ఆందోళనపై సమాచారమందుకున్న ఎస్సై సరిలాల్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారితో మాట్లాడి శాంతింపజేశారు.
వైద్యుల నిర్లక్ష్యం... బాలింత మృతి!
Published Fri, Dec 26 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM
Advertisement